హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!

హార్మోన్ల అసమతుల్యత.. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. దీని కారణంగా నెలసరి-ప్రత్యుత్పత్తి సమస్యలే కాదు.. జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, శక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు.. వంటివి తలెత్తుతాయి.

Published : 24 Apr 2024 12:39 IST

హార్మోన్ల అసమతుల్యత.. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. దీని కారణంగా నెలసరి-ప్రత్యుత్పత్తి సమస్యలే కాదు.. జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, శక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు.. వంటివి తలెత్తుతాయి. అయితే ఇన్ని అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్లను తిరిగి సమతులం చేసుకోవాలంటే.. ఆహారమే కాదు.. మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అందులోనూ ముఖ్యంగా ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు.. హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

ఆయిల్‌ పుల్లింగ్‌తో..!

దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఉదయాన్నే ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం కొంతమందికి అలవాటు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను పెంపొందించడంలోనూ సహకరిస్తుందంటున్నారు నిపుణులు. ఈ పద్ధతి వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లిపోయి జీవక్రియల పనితీరు, పొట్ట ఆరోగ్యం మెరుగుపడతాయి. అదే విధంగా ఆయిల్‌ పుల్లింగ్ హార్మోన్ల స్థాయులను క్రమబద్ధీకరించడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగవుతుంది. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యతకు చెక్‌ పెట్టచ్చు.

ఎండ పొడ.. తగలాల్సిందే!

నిద్ర లేచీ లేవగానే చాలామంది చేసే పని.. మొబైల్‌ పట్టుకోవడం. దీనివల్ల శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్‌. ఉదయాన్నే ఒత్తిడి దరిచేరితే.. ఇక ఆ రోజంతా చిరాగ్గానే గడపాల్సి వస్తుంది. కాబట్టి.. అటు ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తూనే, ఇటు హార్మోన్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే లేలేత ఎండలో ఓ అరగంట గడపమంటున్నారు నిపుణులు. ఇది జీవ గడియారాన్ని ప్రేరేపించి.. భౌతిక, మానసిక, ప్రవర్తన పరంగా మార్పులు తీసుకొస్తుంది. తద్వారా చక్కటి జీవనశైలిని పాటించే అవకాశం ఉంటుంది.. తద్వారా నిద్ర సమయాల పైనా సానుకూల ప్రభావం పడుతుంది. ఇలా జీవక్రియలన్నీ సక్రమంగా జరిగితే హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఇదే ఎండలో చిన్నపాటి వ్యాయామాలు చేయడం, నడక.. వంటివి చేస్తే మరీ మంచిది.

కాఫీ వద్దు!

ఉదయం బ్రష్‌ చేసుకోగానే ఓ కప్పు కాఫీనో, టీనో తాగందే అడుగు ముందుకు పడదు చాలామందికి. అయితే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుపునే తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. దీనికి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. గ్రెలిన్, లెప్టిన్‌.. వంటి ఆకలి హార్మోన్లపై సానుకూల ప్రభావం పడుతుంది. ఫలితంగా రోజంతటికీ కావాల్సిన శక్తి శరీరానికి అందుతుంది. అలాగే నిద్ర సమయాల పైనా సానుకూల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు.

చెప్పుల్లేకుండా.. కాసేపు!

అడుగు తీసి బయటపెట్టామంటే చెప్పులు వేసుకోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు చాలామంది. కానీ ఉదయాన్నే కాసేపు చెప్పుల్లేకుండా నడవడం వల్ల హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌పై సానుకూల ప్రభావం చూపి.. జీవ గడియారాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా హార్మోన్ల పనితీరు మెరుగుపడడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకొస్తాయి. జీవక్రియల పనితీరు మెరుగుపడడంతో పాటు అరికాళ్లలో మెదడుకు అనుసంధానమై ఉన్న నాడులపై ఒత్తిడి పడి.. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. అలాగే చెప్పుల్లేకుండా నడవడం వల్ల లైంగిక హార్మోన్ల పైనా సానుకూల ప్రభావం పడి సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

ఈ వ్యాయామాలు చేస్తున్నారా?

రోజంతా ఉత్సాహంగా ఉండడంలో ఉదయాన్నే చేసే వ్యాయామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ ప్రక్రియ హార్మోన్ల సమతుల్యతనూ ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువులెత్తడం, కార్డియో వ్యాయామాలు హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. అలాగే స్క్వాట్స్‌, పుషప్స్‌, పులప్స్‌, లాంజెస్‌, క్రంచెస్‌.. వంటి వర్కవుట్లను మధ్యమధ్యలో కాస్త విరామమిస్తూ సాధన చేయడం వల్ల.. ఇటు శారీరక ఫిట్‌నెస్‌, అటు హార్మోన్ల ఆరోగ్యాన్నీ మెరుగుపరచుకోవచ్చంటున్నారు.

ఇక వీటన్నింటితో పాటు హార్మోన్ల సమతుల్యత కోసం డాక్టర్‌ సూచించిన మందులు, ఇతర సలహాలూ పాటించడం అలవాటుగా మార్చుకోవాలి. తద్వారా సత్వర ఫలితాన్ని పొందచ్చు.. వాటి మూలంగా ఎదురయ్యే అనారోగ్యాలనూ దూరం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్