వాటి జిడ్డును వదిలించేయండిలా..!

సాధారణంగా మనం వంటింట్లో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్, ప్లాట్‌ఫామ్, టైల్స్.. మొదలైన వాటిపై నూనె చిందుతుంటుంది. వీటిని తర్వాత శుభ్రం చేసుకుందాంలే అంటూ దాటవేస్తుంటాం.

Published : 16 Dec 2023 12:25 IST

సాధారణంగా మనం వంటింట్లో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్, ప్లాట్‌ఫామ్, టైల్స్.. మొదలైన వాటిపై నూనె చిందుతుంటుంది. వీటిని తర్వాత శుభ్రం చేసుకుందాంలే అంటూ దాటవేస్తుంటాం. తద్వారా కొన్ని రోజులకు అది వదిలించుకోవడానికి వీల్లేని జిడ్డులా తయారవుతుంది. కేవలం ఇవే కాదు.. స్టవ్ దగ్గర ఉన్న పాత్రలు కూడా జిడ్డుగా తయారవుతుంటాయి. మరి, వీటిని వదిలించుకోవడానికి ఎంత డిష్‌వాష్‌ ఉపయోగించినా, ఎంతసేపు రుద్దినా వాటికంటుకున్న జిడ్డు మాత్రం వదలదు. కానీ ఇలాంటి పాత్రలకు పట్టిన జిడ్డును ఇంట్లో లభించే పదార్థాలతోనే వదిలించుకోవచ్చు.

నిమ్మతో నిగనిగ..

నిమ్మలో సహజసిద్ధమైన బ్లీచ్ గుణాలుంటాయి. కాబట్టి దీన్ని ఇటు పాత్రల్ని, అటు దుస్తులపై పడిన మరకల్ని వదిలించుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా దీంతో పాత్రలపై అంటుకున్న జిడ్డు మరకల్ని కూడా తొలగించవచ్చు. అదెలాగంటే.. ఒక నిమ్మచెక్క మీద కొద్దిగా బేకింగ్ సోడా చల్లి.. దాంతో పాత్రలను శుభ్రం చేయాలి. తద్వారా వాటిపై ఉండే జిడ్డు తొలగిపోవడం మాత్రమే కాదు.. అవి తళతళలాడతాయి.

గ్రీజు పేపర్‌తో..

జిడ్డుగా మారిన పాత్రలను, ఇతర డబ్బాలను గ్రీజు పేపర్ సహాయంతో శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం.. ఒక ట్రాన్స్‌పరెంట్ పేపర్‌ని తీసుకొని దానిపై కొద్దిగా నూనె వేయాలి. ఇప్పుడు దీంతో పాత్రలపై జిడ్డుగా ఉన్న చోట రుద్దాలి.. ఆ తర్వాత డిష్‌వాష్‌తో శుభ్రపరిస్తే సరిపోతుంది. ఫలితంగా పాత్రలన్నీ తళతళా మెరుస్తాయి.

వెనిగర్ సహాయంతో..

వెనిగర్‌ని సైతం మన కిచెన్‌లో చాలా రకాలుగా వాడుతుంటాం. అయితే ఇది పాత్రలకున్న జిడ్డును తొలగించడంలో బాగా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని నీళ్లలో కొంచెం వెనిగర్ వేసి.. ఆ మిశ్రమంలో జిడ్డు పాత్రల్ని కొన్ని నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బయటికి తీసి కాటన్ క్లాత్‌తో తుడిచేసి.. స్క్రబ్బర్ సహాయంతో శుభ్రం చేస్తే సరి.

బేకింగ్ సోడాతో..

బేకింగ్ సోడాతో ఇటు ఇంట్లోను, అటు గార్డెన్‌లోనూ ఎన్ని ఉపయోగాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా నూనె వల్ల జిడ్డుగా మారిన పాత్రలను శుభ్రం చేయడానికి సైతం ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా బేకింగ్ సోడాని జిడ్డుగా తయారైన పాత్రలపై చల్లాలి. కాసేపాగి శుభ్రం చేస్తే జిడ్డు ఇట్టే తొలగిపోతుంది.

వీటిని ఇలా తొలగించాలి..

కుక్కర్, కడాయి, ప్యాన్.. వంటి కొన్ని అల్యూమినియం పాత్రలపై నూనె జిడ్డుతో పాటు మాడిపోయిన మరకల్లా ఏర్పడుతుంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి..

పాత్రలపై ఉన్న జిడ్డును, ఇతర మరకల్ని తొలగించడానికి దానిపై నేరుగా వెనిగర్‌ని పోయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేస్తే అవి జిడ్డు పోయి మృదువుగా తయారవుతాయి.

ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్‌ని కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పాత్ర మొత్తం అప్త్లె చేసి కొద్ది సేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వేడినీటితో పాత్రను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముందుగా కొద్ది నీటిని మరిగించి.. వాటిని జిడ్డుగా ఉన్న పాత్రలో పోయాలి. వాటిని చల్లారనిచ్చి ఆ తర్వాత డిష్‌వాష్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది.

ఇలా చేసినా జిడ్డు ఇంకా వదలలేదంటే.. ముందుగా మరిగించే నీటిలో కాస్త నిమ్మరసం వేసి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్