దుస్తులపై లిప్‌స్టిక్‌ మరకలా?

రోజూ మేకప్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఒక్కోసారి లిప్‌స్టిక్‌ ఎక్కువైందని తుడుచుకోవడం వల్లో, అప్లై చేసుకునేటప్పుడో లేదంటే ముఖాన్ని శుభ్రపరచుకునే క్రమంలోనో అది దుస్తులకు అంటుకుంటుంది.

Updated : 16 Dec 2023 19:20 IST

రోజూ మేకప్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఒక్కోసారి లిప్‌స్టిక్‌ ఎక్కువైందని తుడుచుకోవడం వల్లో, అప్లై చేసుకునేటప్పుడో లేదంటే ముఖాన్ని శుభ్రపరచుకునే క్రమంలోనో అది దుస్తులకు అంటుకుంటుంది. ఇలా దుస్తులపై పడిన లిప్‌స్టిక్‌ మరకలు ఓ పట్టాన వదలవు.. ఎంత రుద్దినా దుస్తుల రంగు వెలిసిపోతుందేమో గానీ మరకలు మాత్రం తొలగిపోవు. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

దుస్తులపై పడిన లిప్‌స్టిక్‌ మరకల్ని వదిలించడానికి హ్యాండ్‌ శానిటైజర్‌ చక్కగా పనిచేస్తుంది. అదెలాగంటే.. మరకలు పడిన చోట కొద్దిగా శానిటైజర్‌ని స్ప్రే చేసి పొడి క్లాత్‌తో రుద్దాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే మరక వదిలిపోతుంది.

షేవింగ్‌ క్రీమ్‌తోనూ దుస్తులపై పడిన మొండి లిప్‌స్టిక్‌ మరకల్ని వదలగొట్టచ్చట! ఇందుకోసం మరకలున్న చోట షేవింగ్‌ క్రీమ్‌ను సమానంగా పరచుకునేలా చేయాలి.. ఆపై రుద్ది కాసేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత సాధారణంగానే ఉతికేస్తే మరకలు మటుమాయవుతాయి.

డిష్‌వాష్‌ లిక్విడ్‌, డిటర్జెంట్‌.. వంటివీ దుస్తులపై లిప్‌స్టిక్‌ మరకల్ని వదలగొడతాయట! ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. నేలపై మరకలు పడిన దుస్తుల్ని పరిచి.. కొద్దిగా డిష్‌వాష్‌ లిక్విడ్‌/డిటర్జెంట్‌ని వేసి.. తడిగుడ్డతో రుద్దాలి. ఆపై సాధారణంగా ఉతికేస్తే మరక తొలగిపోతుంది.

కొద్దిగా రబ్బింగ్‌ ఆల్కహాల్‌ని లిప్‌స్టిక్‌ మరకలు పడిన చోట పోసి మృదువైన వస్త్రంతో రుద్దాలి. కాసేపు ఆరనిచ్చి ఆపై సాధారణ పద్ధతిలో ఉతికేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

నిమ్మరసం, బేకింగ్‌ సోడా సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ని లిప్‌స్టిక్‌ మరకలు పడిన చోట అప్లై చేసి పొడి గుడ్డతో రుద్దాలి. ఆపై అరగంట పాటు వదిలేసి.. చల్లటి నీళ్లు, డిటర్జెంట్‌తో శుభ్రం చేస్తే మరక వదిలిపోవడం గమనించచ్చు.

లిప్‌స్టిక్‌ మరకలు పడిన చోట కొద్దిగా హెయిర్‌స్ప్రేను స్ప్రే చేయాలి. కాస్త తడిగా ఉన్న వస్త్రం లేదా పేపర్‌ టవల్‌తో మరకలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల మరక క్రమంగా తొలగిపోవడం గమనించచ్చు. ఆపై చల్లటి నీటితో మరోసారి శుభ్రం చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

లాండ్రీ డిటర్జెంట్‌, డిష్‌ సోప్‌, షాంపూ.. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని మరకపై వేసి కాసేపు రుద్దాలి. ఈ మిశ్రమం మొండి లిప్‌స్టిక్‌ మరకల్నే కాదు.. దుస్తులపై పడిన నూనె/గ్రీజు మరకల్ని కూడా తొలగిస్తుంది. ఆపై మరోసారి సాధారణ పద్ధతిలో ఉతికేస్తే సరిపోతుంది.

ఉప్పు, వెనిగర్‌ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరకలు పడిన చోట అప్లై చేసి పూర్తిగా ఆరేంత వరకు అలాగే ఉంచాలి. ఆపై రుద్దడం వల్ల ఈ మిశ్రమంతో పాటు లిప్‌స్టిక్‌ మరకలు కూడా వదిలిపోతాయి. ఇప్పుడు సాధారణంగా దుస్తుల్ని ఉతికేస్తే ఫలితం ఉంటుంది.

ఉన్ని దుస్తులపై పడిన లిప్‌స్టిక్‌ మరకల్ని తొలగించడానికి షాంపూ చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలో మరకలున్న చోట షాంపూను అప్లై చేసి చేత్తో రుద్దాలి. ఆపై దీన్ని వాషింగ్‌ మెషీన్‌లోనైనా వేయచ్చు లేదంటే చేత్తోనైనా ఉతికేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్