తేన్పులకు వీటితో చెక్‌!

నలుగురిలో ఉన్నప్పుడు పదే పదే తేన్పులొస్తుంటే ఇబ్బంది పడతాం.. అసౌకర్యానికి గురవుతాం. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

Published : 08 Jun 2024 19:35 IST

నలుగురిలో ఉన్నప్పుడు పదే పదే తేన్పులొస్తుంటే ఇబ్బంది పడతాం.. అసౌకర్యానికి గురవుతాం. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

అల్లం

జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కడుపుబ్బరం, తేన్పులను ఇది తక్షణమే నివారిస్తుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలే దీనికి కారణం! రోజుకు రెండు లేదా మూడుసార్లు చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల తేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. అల్లాన్ని ఇలా నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు తేనె లేదా పంచదారతో కలిపి తీసుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని తీసుకొని నీటిలో వేసి ఓ పది నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెను కలుపుకొని తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేస్తే తేన్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు.

బొప్పాయి

తేన్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలోనూ బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ‘పపైన్’ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ, గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

పెరుగు

పాలల్లో కంటే పెరుగులో ఔషధ గుణాలు ఎక్కువని పలు పరిశోధనల్లో రుజువైంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై, కడుపుబ్బరం.. వంటి సమస్యలను దూరం చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పెరుగుతో తేన్పుల సమస్యను కూడా త్వరితగతిన తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడి, తేన్పులతో పాటు ఇతర పొట్ట సంబంధిత సమస్యలను కూడా నయం చేసుకోవచ్చంటున్నారు.

సోంపు గింజలు

భోజనం తర్వాత సోంపు గింజలను తీసుకోవడం చాలామందికి అలవాటే. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. అయితే తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. జీర్ణక్రియ సాఫీగా జరిగి.. కడుపుబ్బరం, తేన్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపును నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు.. ఒక కప్పు నీళ్లలో బరకగా దంచుకున్న సోంపును వేసి కాసేపు మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత తీసుకుంటే తేన్పుల సమస్య నుంచి విముక్తి పొందచ్చు. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు పాటిస్తే ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్