కాబోయే అమ్మలకు సోనమ్‌ చిట్కాలు!

గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో సందేహాలు. దీనికి తోడు ఈ సమయంలో చాలామంది ఇద్దరి కోసం తినాలని సూచిస్తుంటారు. ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకూడదని సలహా ఇస్తుంటారు. అయితే ఇవన్నీ అపోహలేనని, ఈ తొమ్మిది నెలలు ఏం చేసినా.....

Published : 15 Nov 2022 19:36 IST

(Photos: Instagram)

గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో సందేహాలు. దీనికి తోడు ఈ సమయంలో చాలామంది ఇద్దరి కోసం తినాలని సూచిస్తుంటారు. ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకూడదని సలహా ఇస్తుంటారు. అయితే ఇవన్నీ అపోహలేనని, ఈ తొమ్మిది నెలలు ఏం చేసినా బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవడం ముఖ్యమని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార సోనమ్‌ కపూర్‌. ఈ ఏడాది ఆగస్టులో తల్లైన ఈ ముద్దుగుమ్మ.. తాను గర్భిణిగా ఉన్న సమయంలో పాటించిన ఆహార నియమాలు, తీసుకున్న జాగ్రత్తల గురించి తాజాగా ఇన్‌స్టా రీల్స్‌ రూపంలో పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.

సెలబ్రిటీ కిడ్‌ అయినా తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకోవడానికి అస్సలు వెనకాడదు సోనమ్‌. ఈ క్రమంలోనే తాను గర్భిణిగా ఉన్న సమయంలో దిగిన ఫొటోల్ని, తన అనుభవాల్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకునేదీ సొగసరి. అయితే ఈ ఏడాది ఆగస్టులో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన సోనమ్‌.. కెరీర్‌కు కాస్త బ్రేకిచ్చి అమ్మతనానికే తన పూర్తి సమయం కేటాయిస్తోంది. మరోవైపు గర్భిణిగా ఉన్నప్పుడు తాను పాటించిన చిట్కాల్ని షేర్‌ చేస్తూ.. కాబోయే తల్లుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. అలా తన ప్రెగ్నెన్సీ డైట్‌, ఆ సమయంలో పాటించిన సౌందర్య చిట్కాల గురించి ఇలా పంచుకుందీ కపూర్‌ బ్యూటీ.


బిడ్డ ఎదుగుదలకు ఇవి!

కడుపులోని బిడ్డ ఎదుగుదలకు సంపూర్ణ పోషకాహారం తప్పనిసరి! అందుకే ఇవి పుష్కలంగా నిండి ఉన్న పండ్లు, కాయగూరలనే తరచూ ఆహారంలో భాగం చేసుకునేదాన్ని.

విటమిన్‌ ‘ఎ’, పొటాషియం నిండి ఉన్న క్యారట్లు, చిలగడదుంప, ఆకుపచ్చటి కాయగూరలు, ఆకుకూరలు, గుమ్మడి, టొమాటో, క్యాప్సికం.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

అరటి, ఆప్రికాట్స్‌, కమలాఫలం, ద్రాక్ష, ఎండు ద్రాక్ష.. వంటి ఫలాలతో పాటు ఆయా కాలాల్లో దొరికే పండ్లనూ మెనూలో చేర్చుకోవాలి.

వెన్న లేని పెరుగు, ఓట్‌ మిల్క్‌, సోయా పాలు, కొబ్బరి పాలు, మజ్జిగ, పనీర్‌.. వంటి పాల పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రొటీన్‌ అందుతుంది.

ఐరన్‌, ఫోలికామ్లం వంటి సప్లిమెంట్లను గర్భం ధరించిన మొదటి నెల నుంచే వాడడం మొదలుపెడతాం. అయితే వీటితో పాటు ఈ పోషకాలు ఎక్కువగా లభించే సెరల్స్ తీసుకోవడం మంచిది.

ప్రొటీన్లు బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే బీన్స్‌, పప్పులు, ధాన్యాలు, నట్స్‌, గింజలు, చేపలు, మాంసం.. వంటివి తీసుకోవడం మంచిది.

ఆహారంతో పాటు శరీరంలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవడమూ ముఖ్యమే. అందుకే బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.


పచ్చివి వద్దు!

గర్భిణిగా ఉన్న సమయంలో పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాలకు, అలవాట్లకు దూరంగా ఉండడమూ అంతే కీలకం. ఈ క్రమంలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను.

సహజసిద్ధంగా పండించినవే అయినా.. ఆయా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లను ముందు శుభ్రంగా కడగడం, ఆపై ఉడికించుకొని తినడం చాలా ముఖ్యం.

గర్భిణులు పండ్లు తప్ప మిగతావేవీ పచ్చిగా తినకపోవడమే మేలు. ఎందుకంటే ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమై.. ఎదిగే బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువ.

శుద్ధి చేయని పాలు, పండ్ల రసాల్ని తీసుకోకపోవడమే ఉత్తమం.

మద్యం, ధూమపానానికి దూరంగా ఉండడంతో పాటు.. కెఫీన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్స్‌.. వంటివీ దూరం పెట్టడం మంచిది.


మలబద్ధకం దూరమిలా!

గర్భిణుల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సహజం. వాటిలో మలబద్ధకం కూడా ఒకటి. అయితే దీన్ని దూరం చేసుకోవడానికి పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, ఫైబర్‌ సప్లిమెంట్లు తీసుకోమని నిపుణులు సూచిస్తారు. ఇక నా విషయంలోనూ ఈ సమస్య తలెత్తింది. దీన్నుంచి బయటపడడానికి ఫైబర్‌ సప్లిమెంట్లు, బాదం పాలు, బెల్లం.. వంటివి తీసుకునేదాన్ని. ఇక రోజూ ఉదయాన్నే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు, ఆపై టేబుల్‌స్పూన్‌ నెయ్యి తినడం అలవాటు చేసుకున్నా.


ఇది నమ్మకండి!

‘ఇప్పట్నుంచి నువ్వు ఇద్దరి కోసం తినాలి..’ గర్భిణులతో తమ ఇంట్లోని పెద్దవాళ్లు ఇలా చెప్పడం చూస్తుంటాం. కానీ ఇది పూర్తిగా అపోహ! మీరు ఇది నమ్మకండి.. ఈ విషయంలో ఇతరుల్ని ప్రోత్సహించకండి. కడుపులో ఒక బిడ్డను మోస్తున్నట్లయితే రోజూ గరిష్టంగా 350 క్యాలరీలు అవసరమవుతాయి. దీన్ని బట్టి నిపుణుల సలహా మేరకు డైట్‌ ప్లాన్‌ చేసుకుంటే సరిపోతుంది. అలాకాకుండా ఇద్దరి కోసం, ముగ్గురి (కడుపులో కవలలుంటే) కోసం తినడం వల్ల ఆయాసం తప్ప మరే ప్రయోజనం ఉండదు.. పైగా మీరు తీసుకున్న ఆహారంలో నుంచే పోషకాలు బిడ్డకు అందుతాయని గుర్తుపెట్టుకోండి.

ఇక కొంతమందికి ముందు నుంచే వ్యాయామాలు చేయడం అలవాటుంటుంది. అలాంటి వారు గర్భిణిగా ఉన్నప్పుడూ వీటిని కొనసాగించచ్చు. నేనైతే ఈ నవ మాసాలూ నిపుణుల పర్యవేక్షణలో యోగా, పిలాటిస్‌.. వంటి వ్యాయామాలు సాధన చేశా. ఒకవేళ గతంలో వర్కవుట్స్‌ సాధన చేయని వారు కూడా ఈ సమయంలో నిపుణులను అడిగి కొన్ని వ్యాయామాలు ప్రాక్టీస్‌ చేయచ్చు.

<


‘ఆయిల్‌ పుల్లింగ్‌’ అందుకే..!

గర్భిణిగా ఉన్న సమయంలో దంతాలు, చిగుళ్లు మరింత సున్నితంగా మారతాయి. ఈ క్రమంలో నేనూ పలుమార్లు దంత వైద్య నిపుణుల్ని సంప్రదించి చికిత్స తీసుకున్నా. ఇక అప్పట్నుంచి ఆయిల్‌ పుల్లింగ్‌ అలవాటు చేసుకున్నా. ప్రాచీన కాలం నాటి ఆయుర్వేద పద్ధతైన దీన్ని పాటించడం వల్ల నోటి బ్యాక్టీరియా దూరమై.. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేనైతే ఇందుకోసం నువ్వులు, కొబ్బరి, ఆలివ్‌ నూనెల్ని కలిపి ఓ ప్రత్యేకమైన నూనెను తయారుచేసుకున్నా. దాంతో ఉదయాన్నే ఆయిల్‌ పుల్లింగ్‌ చేసేదాన్ని.

ఇక గర్భిణిగా ఉన్న సమయంలో పిగ్మెంటేషన్‌ (చర్మ ఛాయ తగ్గిపోవడం) సహజం. కాబట్టి దీన్నుంచి బయటపడాలంటే సన్‌స్క్రీన్‌ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.

గర్భిణిగా ఉన్న సమయంలో అందరి ఆరోగ్య స్థితి ఒకేలా ఉండదు. కాబట్టి తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు, విటమిన్‌ సప్లిమెంట్లు, వాడే సౌందర్య ఉత్పత్తులు.. వంటి విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్