పాలిచ్చే తల్లులైనా సరే.. వ్యాయామం కావాల్సిందే!

కొన్ని విషయాల్లో అతి జాగ్రత్త వల్లే ప్రసవానంతరం మహిళలు శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యల్ని త్వరగా దూరం చేసుకోలేకపోతున్నారని చెబుతున్నారు నిపుణులు.

Published : 17 Feb 2024 13:11 IST

కొన్ని విషయాల్లో అతి జాగ్రత్త వల్లే ప్రసవానంతరం మహిళలు శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యల్ని త్వరగా దూరం చేసుకోలేకపోతున్నారని చెబుతున్నారు నిపుణులు. పాలిచ్చే తల్లుల్ని ఇంట్లో వాళ్లు వ్యాయామం చేయకుండా వారిస్తారని, నిజానికి ఈ వ్యాయామం వల్ల కొత్తగా తల్లైన మహిళలకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో- పాలిచ్చే తల్లులు వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి..

ప్రతి తొమ్మిది మంది మహిళల్లో ఒకరు ప్రసవానంతర ఒత్తిళ్లు, ఇతర శారీరక సమస్యలతో బాధపడుతున్నారని సీడీసీ (సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) చెబుతోంది. అయితే ఈ సమస్యల్ని దూరం చేసుకోవడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రొలాక్టిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తిని పెంచి.. తద్వారా పాలు ఎక్కువగా పడేలా చేస్తుంది. ఇలా వ్యాయామం చేస్తూ.. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని డైట్‌లో చేర్చుకుంటే ప్రసవానంతరం త్వరగా బరువు తగ్గచ్చట!

ప్రయోజనాలివే!

⚛ ప్రసవం తర్వాత శరీరం శక్తిని కోల్పోయి పూర్తిగా బలహీనపడుతుంది. అయితే ఈ శక్తిని తిరిగి కూడగట్టుకోవాలంటే.. వ్యాయామం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసే క్రమంలో ఎండార్ఫిన్లు, డోపమైన్‌, సెరటోనిన్‌.. వంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచడంతో పాటు ప్రశాంతతను అందిస్తాయి.

⚛ బిడ్డకు జన్మనిచ్చాక నిద్రలేమి, అలసటతో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంటుంది. అయితే విభిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం.. వంటివి ఒత్తిడిని తరిమికొట్టి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇలా ప్రశాంతంగా ఉండడం వల్ల బిడ్డ ఎదుగుదలకు పరోక్షంగా మేలు జరుగుతుంది.

⚛ గర్భధారణ సమయంలో దృఢంగా ఉంచడానికి కొన్ని వ్యాయామాలు ఎలా మేలు చేస్తాయో.. ప్రసవానంతరం కూడా కొన్ని వర్కవుట్లు తిరిగి పూర్వపు స్థితికి తీసుకొస్తాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత అధిక బరువును తగ్గించుకోవడం, పొట్ట తగ్గించుకోవడంలో ఇవి సహకరిస్తాయంటున్నారు నిపుణులు.

⚛ బిడ్డ పుట్టాక కొంతమంది తల్లులు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వాళ్లు వ్యాయామాలు చేయడం వల్ల సుఖంగా నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

ఆరు వారాల తర్వాతే..!

సుఖ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా.. డెలివరీ అయిన ఆరు వారాల తర్వాతే వ్యాయామం మొదలుపెట్టమని సలహా ఇస్తుంటారు వైద్యులు. అయినా ఈ క్రమంలో ముందు ఓసారి డాక్టర్‌ వద్ద ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకున్నాకే ఎక్సర్‌సైజ్‌ ప్రారంభించడం మంచిది. అలాగే దీన్ని బట్టే మీరు ఎలాంటి వ్యాయామాలు చేయచ్చో కూడా చెబుతారు. సాధారణంగా బ్రిస్క్‌ వాకింగ్‌, ఈత, యోగా, సైక్లింగ్‌, పిలాటిస్‌, తక్కువ తీవ్రత ఉండే ఏరోబిక్‌ వ్యాయామాలు, పరుగు-జాగింగ్‌.. వంటివి ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. అలాగే ఒకేసారి ఎక్కువ సమయం వ్యాయామాలు చేయకుండా.. రోజూ క్రమేపీ కొంత సమయాన్ని పెంచుకుంటూ పోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్