ఆ తల్లి సలహాతో.. ఇకపై బ్లింకిట్‌లో కూరగాయలు కొంటే.. కొత్తిమీర ఫ్రీ!

మార్కెట్లో కాయగూరలు కొనేటప్పుడు ధర కాస్త తగ్గించమంటూ బేరమాడడం.. లేదంటే కొత్తిమీర/పుదీనా/కరివేపాకు కట్ట.. ఇలాంటివి ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వమనడం మనకు అలవాటే! అదే ఆన్‌లైన్‌లో కాయగూరలు ఆర్డర్‌ చేస్తే.. ఈ అవకాశం ఉండదు. యాప్‌లో ఫిక్స్‌ చేసిన ధరను చెల్లించాల్సిందే!

Published : 17 May 2024 14:10 IST

మార్కెట్లో కాయగూరలు కొనేటప్పుడు ధర కాస్త తగ్గించమంటూ బేరమాడడం.. లేదంటే కొత్తిమీర/పుదీనా/కరివేపాకు కట్ట.. ఇలాంటివి ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వమనడం మనకు అలవాటే! అదే ఆన్‌లైన్‌లో కాయగూరలు ఆర్డర్‌ చేస్తే.. ఈ అవకాశం ఉండదు. యాప్‌లో ఫిక్స్‌ చేసిన ధరను చెల్లించాల్సిందే! అయితే తాజాగా గ్రాసరీ యాప్‌ బ్లింకిట్‌ ఈ నియమాన్ని కాస్త సడలించింది. అదీ.. ఓ మధ్య తరగతి తల్లి విజ్ఞప్తి మేరకు నిర్దిష్ట ధరలో కాయగూరలు కొంటే.. ఓ కొత్తిమీర కట్ట ఉచితంగా పొందచ్చంటూ కొనుగోలు దారులకు ఆప్షన్‌ ఇవ్వడం విశేషం!అందులోనూ ఏకంగా ఈ సంస్థ సీఈవోనే స్పందించి.. ఈ ఆఫర్‌ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, దీని వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి..

ఆ తల్లి ఆలోచనతో!
ముంబయికి చెందిన అంకిత్‌ సావంత్‌ తల్లి బ్లింకిట్‌ యాప్‌లో ఇటీవలే కొన్ని కాయగూరలు కొనుగోలు చేసింది. వాటిలో కొత్తిమీరకు కూడా డబ్బు చెల్లించాల్సి రావడంతో కాస్త నిరాశకు గురైందామె. ఎందుకంటే.. ఇన్ని కాయగూరలు కొన్నా.. కొసరుగా కనీసం కొత్తిమీర అయినా ఉచితంగా ఇవ్వట్లేదనేది ఆమె అసంతృప్తికి కారణం. ఇలా తన తల్లి మనోభావాల్ని తెలియజేస్తూ అంకిత్‌ తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.
‘బ్లింకిట్‌లో కొత్తిమీరకు కూడా డబ్బు చెల్లించాల్సి రావడంతో అమ్మకు ఓ చిన్నపాటి హార్ట్‌ఎటాక్‌ వచ్చినంత పనైంది. ఎందుకంటే ఇంత డబ్బు పెట్టి ఇన్ని కాయగూరలు కొన్నప్పుడు.. కనీసం కొత్తిమీర అయినా కాంప్లిమెంటరీగా ఇవ్వచ్చుగా అనేది అమ్మ సలహా!’ అంటూ బ్లింకిట్‌ సీఈవో అల్బీందర్‌ ధిండ్సాను ట్యాగ్‌ చేశారు.

ఇకపై కొత్తిమీర ఫ్రీ!
ఇలా అంకిత్‌ తన తల్లి గురించి పెట్టిన పోస్ట్‌ అల్బీందర్‌ కంట పడింది. వెంటనే దానికి స్పందించిన ఆయన.. ఆ తల్లి సలహాను స్వాగతించారు. ఈ క్షణం నుంచే తమ యాప్‌లో నిర్దిష్ట ధరలో కాయగూరలు కొంటే కొత్తిమీర ఉచితంగా ఇస్తామంటూ.. ఆర్డర్‌ పేజీని అప్‌డేట్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.
‘నిర్దిష్ట ధరలో కాయగూరలు కొంటే కొత్తిమీర ఉచితంగా అందిస్తున్నామనే ఫీచర్‌ని తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇకపై బ్లింకిట్‌ ఆర్డర్‌ పేజీలో మీరు ఆర్డర్‌ చేసిన కాయగూరలకు ఫ్రీ గిఫ్ట్‌గా కొత్తిమీరను పొందచ్చు. ముందు ముందు ఈ ఫీచర్‌ని మరింతగా అప్‌డేట్‌ చేస్తాం.. ఇందుకు కారణమైన అంకిత్‌ అమ్మగారికి అందరూ కృతజ్ఞతలు చెప్పండి..’ అంటూ రాసుకొచ్చారు.

ఇన్‌స్టెంట్ డెలివరీ.. ఇన్‌స్టెంట్ అప్‌డేట్‌!
లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోన్న ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ కొత్తిమీర అప్‌డేట్‌తో మార్కెట్లో ఈ కంపెనీ విలువ మరింత పెరుగుతుంది.. ఓ మధ్య తరగతి తల్లి ఇచ్చిన సలహాకు ఇంత త్వరగా స్పందించడం గ్రేట్‌! వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఇదో అద్భుత వ్యాపార వ్యూహం!’ అంటూ బ్లింకిట్‌ సీఈవోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరికొందరు.. ‘కాయగూరలు కొనే విషయంలో ప్రతి తల్లి ఆలోచన ఇదే! ఈ సలహా ఇచ్చిన ఆ తల్లికి, ఇంత త్వరగా అమలు చేసిన సంస్థకు ధన్యవాదాలు!’ అంటూ రాసుకొచ్చారు. ఇంకొందరేమో.. ‘కొత్తిమీర లాగే మిర్చి, పుదీనా.. వంటివీ ఎంచుకొనే ఆప్షన్లు ఇస్తే బాగుంటుంద’ని సరదాగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. మరోవైపు ఈ వైరల్‌ పోస్ట్‌పై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వర్షం కురుస్తోంది. మరి, ఇంతకీ దీనిపై మీ స్పందనేంటి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్