అతిగా నిద్ర పోతున్నారా?

‘అతి అనర్థదాయకమే!’ అంటుంటారు. నిద్రకూ ఇది వర్తిస్తుంది. ఆరోగ్యదాయకమే కదా అని గంటల తరబడి నిద్ర పోతే.. లేనిపోని అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు నిపుణులు. అందుకే వయసును బట్టి నిద్ర సమయాల్ని నిర్ణయించుకుంటే ఎన్నో అనర్థాలకు అడ్డుకట్ట వేయచ్చంటున్నారు.

Published : 08 Apr 2024 12:19 IST

‘అతి అనర్థదాయకమే!’ అంటుంటారు. నిద్రకూ ఇది వర్తిస్తుంది. ఆరోగ్యదాయకమే కదా అని గంటల తరబడి నిద్ర పోతే.. లేనిపోని అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు నిపుణులు. అందుకే వయసును బట్టి నిద్ర సమయాల్ని నిర్ణయించుకుంటే ఎన్నో అనర్థాలకు అడ్డుకట్ట వేయచ్చంటున్నారు. మరి, అతిగా నిద్ర పోవడం వల్ల తలెత్తే సమస్యలేంటో తెలుసుకుందాం రండి..

నిద్ర ఎక్కువైతే..

సాధారణంగా పెద్ద వారికి రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరమవుతుంది. అయితే కొంతమంది సమయం దొరికిందనో, ఎక్కువసేపు నిద్ర పోవడం మంచిదన్న ఉద్దేశంతోనో తొమ్మిది గంటలకు మించి మరీ నిద్రపోతుంటారు. దీనివల్ల నిద్ర సమయాలకు అంతరాయం ఏర్పడడంతో పాటు తలనొప్పి కూడా వేధిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల పగలు నిద్ర రాదనుకుంటారు చాలామంది. కానీ దీనివల్ల కునికిపాట్లు తప్పవంటున్నారు.

ఈ సమస్యలొస్తాయ్!

అతి నిద్ర కొన్ని రకాల అనారోగ్యాలకు దారితీస్తుందని పలు అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. అవేంటంటే..!

⚛ మన శరీరం చక్కెరను విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చుతుంది. తద్వారా మధుమేహం రాకుండా జాగ్రత్తపడచ్చు. అయితే అతిగా నిద్ర పోవడం వల్ల ఈ వ్యవస్థ గాడి తప్పుతుంది. ఫలితంగా టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు.

⚛ 8 గంటలు నిద్ర పోయే మహిళలతో పోల్చితే 9-11 గంటలు నిద్రపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు 38 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఎనిమిది గంటలు సుఖ నిద్రకు కేటాయించడమే అన్ని విధాలా శ్రేయస్కరం!

⚛ తొమ్మిది గంటలకు మించి నిద్ర పోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదమూ 23 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అతి నిద్ర వల్ల మెదడుకు అందే రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణం.

⚛ సుఖ నిద్ర వల్ల ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరవు అన్న విషయం తెలిసిందే! అలాగని గంటల తరబడి నిద్ర కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల కూడా పలు మానసిక అనారోగ్యాలు తప్పవంటున్నారు.

⚛ అతి నిద్ర వల్ల శరీరంలో రసాయన చర్యల్ని ప్రేరేపించే న్యూరోట్రాన్స్‌మిటర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జీవ గడియారం పనితీరుని దెబ్బతీసి తద్వారా తలనొప్పి, ఒత్తిళ్లను తెచ్చిపెడుతుంది.

⚛ గంటల తరబడి కదలకుండా పడుకోవడం వల్ల శరీర అవయవాల్లో, కీళ్లలో కదలిక లోపించి నడుం నొప్పి, కీళ్ల నొప్పులు తలెత్తే అవకాశం ఉంటుందట!

⚛ అతి నిద్ర మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని ఓ సర్వే చెబుతోంది. ఐవీఎఫ్‌ చికిత్స తీసుకుంటోన్న మహిళలు.. ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం వల్ల 25 శాతం (తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారితో పోల్చితే) ఎక్కువగా సక్సెస్‌ రేటు ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్