తనలో తాను మాట్లాడుకుంటుంది...

మా మనవరాలికి పదిహేనేళ్లు. తను ఈమధ్య నిరంతరం ఏదేదో మాట్లాడుతోంది. నిద్ర కూడా పోవడంలేదు. ఏం చేస్తే మార్పొస్తుందో కాస్త చెప్పండి?

Published : 02 Jan 2023 00:34 IST

మా మనవరాలికి పదిహేనేళ్లు. తను ఈమధ్య నిరంతరం ఏదేదో మాట్లాడుతోంది. నిద్ర కూడా పోవడంలేదు. ఏం చేస్తే మార్పొస్తుందో కాస్త చెప్పండి?

- ఓ సోదరి

యుక్తవయసు పిల్లల్లో శారీరకంగా, మానసికంగా, హార్మోన్ల పరంగా కొన్ని మార్పులు రావడం సహజమే. కానీ తను ఏదేదో మాట్లాడుతోంది, నిద్ర సరిగా పోవడంలేదు అంటే దాన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. ఈ వయసులో ఇలా ఉండటాన్ని బట్టి స్కిజోఫ్రినియా లక్షణాలు ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ మానసిక సమస్య కుటుంబంలో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచీ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటం, నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకోవడం, తమ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుంభనంగా ఉండటం లాంటి వ్యక్తిత్వం ఉండేవారిలో ఆ జన్యువు ఉందని అనుమానించవచ్చు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. చిన్న వయసులో తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించండి. స్కిజోఫ్రినియా తొలిదశ అయితే మందులతో నియంత్రించవచ్చు. ఆ అమ్మాయిని పరీక్షించిన తర్వాత ఎంతకాలం మందులు వాడాల్సి ఉంటుందో, మీరు తనతో ఎలా మెలగాలో చెబుతారు. ఆమెకి మానసిక ఒత్తిడి కలగకుండా చూసుకుంటూ ఎవరో ఒకరు ఆసరాగా నిలవాలి. వెంటనే చికిత్స ఆరంభిస్తే వ్యాధి ఎక్కువ కాకుండా, మళ్లీ మళ్లీ రాకుండా చూస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్