Teenage - Behaviour: దురుసుగా ఉంటోంది...

మా అమ్మాయి డిగ్రీ చదువుతోంది. సహజంగా నెమ్మదస్తురాలు. కానీ ఈమధ్య దురుసుగా ఉంటోంది. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కబుర్లే. వాళ్ల ప్రభావంతోనే ఇలా తయారయ్యింది అనిపిస్తోంది.

Published : 03 Apr 2023 00:29 IST

మా అమ్మాయి డిగ్రీ చదువుతోంది. సహజంగా నెమ్మదస్తురాలు. కానీ ఈమధ్య దురుసుగా ఉంటోంది. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కబుర్లే. వాళ్ల ప్రభావంతోనే ఇలా తయారయ్యింది అనిపిస్తోంది.

- ఓ సోదరి

పిల్లలు తమకు నచ్చిన కొందరిని ఎంచుకుని వారిలా ఉండటానికి ప్రయత్నిస్తారు. లేదంటే వాళ్లలో కలవలేం అనుకుంటారు. ఎవరికైనా స్నేహితులు ఉండాల్సిందే! వాళ్ల నుంచి నేర్చుకుంటారు. తమకు తెలిసింది వారికి నేర్పిస్తారు. ఆ చర్చలూ, ఇచ్చిపుచ్చుకోవడాలూ సాధారణం. అది సహజ పరిణామం. మీ అమ్మాయిలో కూడా అలా మార్పు వచ్చి ఉంటుంది. పిల్లలు ఎక్కడ చెడు నేర్చుకుంటారో అనే భయంతో అక్కడికి వెళ్లొద్దు, వారితో మాట్లాడొద్దు.. తరహాలో పెద్దవాళ్లు ఆంక్షలు పెడతారు. దాంతో తమ ఫ్రెండ్స్‌ ఎక్కడ దూరమవుతారో అనే భయంతో పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. కనుక మీ అమ్మాయితో స్నేహితుల గురించి ప్రస్తావించకుండా ఆమె ఎలా ఉంటే మేలు జరుగుతుందో చెప్పండి. మంచి స్వభావాన్ని అలవరచుకుంటే భవిష్యత్తు బాగుంటుందని వివరించండి. మన పిల్లలు మంచివాళ్లు, స్నేహితుల కారణంగానే మారిపోతున్నారు అనుకోవడం సరికాదు. మంచి చెడులేంటో వాళ్లు గ్రహించగలరు. మనం పదేపదే చెబుతుంటే విసుగొచ్చి ఎదురుచెబుతారు. నిజానికి స్నేహితులతో కలసిమెలసి ఉండటం వల్ల లోకం పోకడ తెలుస్తుంది. జీవితం గురించి అవగాహన పెరుగుతుంది. స్నేహాలే వద్దనకుండా.. వేళ కాని వేళ వెళ్లడం, వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లడం లాంటివి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఉదాహరణలుగా చెప్పండి. ఎలాంటి స్నేహితులు ఉంటే బాగుంటుందో చెప్పండి. నిర్ణయం వారికే వదిలేస్తున్నట్టుగా ఉండాలి. ఫలానావారితో కలవొద్దని చెబితే మీమీద వ్యతిరేకత పెంచుకుంటారే తప్ప ఒనగూరేదేమీ ఉండదు. సందర్భవశాత్తూ చక్కటి కథలు చెప్పండి. మంచి పుస్తకాలు చదివేలా చూడండి. మీ మాట వినకపోతే ఎవరి మీద గురి ఉంటుందో వారితో చెప్పించండి. పాటలు పాడటం, బొమ్మలేయడం లాంటి తనకిష్టమైన వ్యాపకాల దిశగా ప్రోత్సహించండి. వాటి మీద దృష్టిపెడితే అందులో ఆనందాన్నీ పొందుతారు, స్నేహితులతో గడిపే సమయమూ తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్