మా వాళ్ల నంబర్లు బ్లాక్‌ చేశాడు

మేం ముగ్గురు పిల్లలం. నాన్న మా మేనత్త కొడుకుకు ఆర్థిక సాయం చేసి తన బాగోగులు చూశారు. తనకు ప్రభుత్వోద్యోగం వచ్చింది. అక్కని చేసుకోమంటే కాదని నన్ను చేసుకున్నాడు.

Published : 09 Jan 2023 00:32 IST

మేం ముగ్గురు పిల్లలం. నాన్న మా మేనత్త కొడుకుకు ఆర్థిక సాయం చేసి తన బాగోగులు చూశారు. తనకు ప్రభుత్వోద్యోగం వచ్చింది. అక్కని చేసుకోమంటే కాదని నన్ను చేసుకున్నాడు.  తనను సరిగా చూడలేదు, పెద్దల్లుడికి ఎక్కువిచ్చారు, అతనికే మర్యాద చేస్తారు- అంటాడు. నాన్నేమో చదువుకు ఖర్చుపెట్టాను, పెద్దల్లుడంటే బయటివాడు, ఇతడు మనవాడేగా అంటారు. నాన్నకు అక్క, తమ్ముడంటేనే ఎక్కువిష్టం. అలా నేనూ న్యూనతకు గురయ్యాను. ఆయన ఫోన్లో మా వాళ్ల నంబర్లు శాడిస్ట్‌ 1, 2, 3 అంటూ ఉండేవి. ఇప్పుడైతే బ్లాక్‌ చేశాడు. మాకిద్దరు పాపలు. ఈ గొడవలతో వాళ్లకీ ఇబ్బందని చెప్పబోతే, అదీ నా తప్పేనంటాడు.

- ఓ సోదరి

మీ నాన్న అతడికి ఆర్థికసాయం చేసి తన కాళ్లమీద నిలబడగిలిగేలా చేశారు. పెద్ద కూతురిని కాదన్నా కోపం తెచ్చుకోక అతడి ఇష్టప్రకారమే పెళ్లి చేశారు. ఇదంతా మీ నాన్న ఔదార్యం. కావాలనుకున్న అమ్మాయి దొరికిందని సంతోషించక తోడల్లుడితో పోల్చుకోవడం, ఆరోపణలు చేయడం సబబు కాదు. బయటి నుంచి వచ్చాడు, పెద్దవాడు అని తానూ మర్యాద ఇవ్వాల్సింది పోయి నిందిస్తున్నాడు. ఈ కాలంలో మరో వ్యక్తి బాధ్యత తీసుకునే వారే లేరు. ఆ ఔదార్యాన్ని గ్రహించి కృతజ్ఞత చూపకపోగా నిందించడం సభ్యత కాదు. మీ భర్తను సమర్థించనూ వద్దు, తప్పుపట్టనూ వద్దు. వాదనలూ, ప్రతిఘటనలూ ఏవీ వద్దు. అదంతా అతడి అభిప్రాయం అనుకోండి. మీరు కూడా కోపంలో అన్న మాటలు గుర్తుచేసుకుని తప్పుపట్టడాలు, తీర్మానాలూ వద్దు. నాన్న మీ అందరినీ పెంచి పెద్దచేశారని మర్చిపోవద్దు. జీవితంలో దొరికిందాన్ని తృప్తిగా అనుభవించడంలోనే ఆనందం ఉంది. మీ నాన్న చేయాల్సిందంతా చేసేశారు. ఇంకేదో చేయలేదనుకోవడం సరికాదు. ఎవరి జీవితాన్ని వారే మెరుగుదిద్దుకోవాలి. అమ్మా నాన్నలు మీకు చేయలేదు అనుకున్నది మీరు మీ పిల్లలకి చేయండి. వాళ్లమీద ఈ ప్రభావం పడకుండా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకునేట్లు ప్రోత్సహించండి. అతడు నంబర్ని బ్లాక్‌ చేసినట్లు మీరు మీవాళ్ల చర్చలను బ్లాక్‌ చేయండి. మీరు వాళ్ల ప్రస్తావన తేకపోతే అతడూ ఆ విషయాలు వదిలేస్తాడు. అయినా నిందిస్తుంటే వాళ్ల గురించి ఎందుకు, మన కుటుంబం గురించి ఆలోచిద్దాం అనండి, దాని మీదే ధ్యాస పెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్