Published : 21/01/2023 19:14 IST

అందానికి ‘గుమ్మడి’!

సాధారణంగా గుమ్మడికాయల్ని వంటల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ ఇది అందానికీ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖానికి మెరుపును అందించడం దగ్గర్నుంచి.. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేసే గుమ్మడితో తయారుచేసుకునే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ గురించి తెలుసుకుందాం..

టోనర్‌లా..

గుమ్మడి పేస్ట్‌కు కొద్దిగా నిమ్మరసం, రెండు చెంచాల చక్కెర జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖానికి మంచి టోనర్‌లా పనిచేస్తుంది. ఫలితంగా ముఖ వర్ఛస్సు ఇనుమడిస్తుంది.

తక్షణ మెరుపు కోసం..

గుమ్మడి పేస్ట్‌కు కొద్దిగా పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం, కాస్త తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్షణ మెరుపును సొంతం చేసుకోవచ్చు.

స్క్రబ్‌లానూ..!

మెత్తగా చేసిన గుమ్మడికి చెంచా ఓట్స్, కాస్త తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీంతో ముఖమంతా మృదువుగా మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి మంచి స్క్రబ్‌లా పనిచేసి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

మాయిశ్చరైజర్‌లా..

గుమ్మడి ముక్కలకు.. పైనాపిల్, యాపిల్ పండ్ల ముక్కల్ని కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరేంత వరకు ఉండాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా కూడా పని చేస్తుంది.

ముఖ కాంతిని పెంచేలా..

మెత్తగా చేసిన గుమ్మడికి చెంచా తేనెతో పాటు అరచెంచా చొప్పున పాలు, దాల్చినచెక్క పొడి కలిపి బాగా మిక్స్ చేయాలి. ముందు ముఖం శుభ్రం చేసుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది హైడ్రేటింగ్ ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగపడుతుంది. అంటే చర్మంలోని తేమ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే ముఖానికి రక్తప్రసరణ బాగా జరగడానికి కూడా ఉపకరిస్తుంది. ఫలితంగా ముఖవర్ఛస్సు ఇనుమడిస్తుంది.

మొటిమలు లేకుండా..

గుమ్మడి పేస్ట్‌కు గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుపును సంతరించుకోవడమే కాకుండా మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని