రోజ్‌మేరీ.. ఇలా ఇంట్లోనే పెంచుకోవచ్చు!

రోజ్‌మేరీ.. పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద ఇది. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో, బ్రెడ్‌-సూప్స్‌ తయారీలో, సలాడ్లలోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు.

Published : 07 Dec 2023 12:45 IST

రోజ్‌మేరీ.. పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద ఇది. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో, బ్రెడ్‌-సూప్స్‌ తయారీలో, సలాడ్లలోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. దీంతో హెర్బల్‌ టీ కూడా తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో రోజ్‌మేరీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

పెంచడం సులభం!

బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటి సన్నని ఆకులతో, సువాసన గల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుందీ మొక్క. దాదాపు మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగే చిన్నపొద ఇది. నీరు నిలవని ఇసుక నేలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాగని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండ పడని చోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపిట్‌ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.

రకాలు రెండు.. వాడకం ఒకటే!

రోజ్‌మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండుదైనా వంటల్లో వాడతారు. ఆకు కోసేటప్పుడు గ్రీవం పైన తుంచుకుంటే చిగుళ్లు త్వరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు. ఒకసారి నాటిన మొక్క ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటుంది. రోజ్‌మేరీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పొదలాగా పెరిగితే.. మరొకటి కొద్దిగా తీగలాగా సాగుతుంది. రెండో రకం రాక్‌ గార్డెన్లలోనూ, వేలాడే తోటల్లోనూ పెంచుకోవడానికి బాగుంటుంది. వంటలకు మాత్రం రెండూ ఒకే రకమైన రుచిని అందిస్తాయి.

సేంద్రియ ఎరువులు వాడితే..

రోజ్‌మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతున్నాయంటే కుండీ మార్చే సమయం దగ్గర పడిందని సంకేతం. ఏడాదికోసారి కుండీ మార్చుకోవాలి. ఈ మొక్క ఆకుల్ని వంటల్లో ఉపయోగిస్తుంటాం. కాబట్టి వర్మీ కంపోస్టు, ఆముదం, వేరుశెనగ పిండి.. వంటి సేంద్రియ ఎరువుల్ని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువే. అలాగే బూడిద తెగులు, వేరు కుళ్లు కూడా వస్తుంటాయి. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగ్గా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరప వంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను (మార్కెట్లో దొరుకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే పురుగుల బెడదను నివారించవచ్చు.

ఔషధ గుణాలెన్నో..!

రోజ్‌మేరీలో ఔషధ గుణాలు ఎక్కువే. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులకు నివారణగా దీన్ని వాడతారు. ఈ నూనెను తలకు మర్దన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందట. రోజ్‌మేరీని కలపడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే నూనెలు (అవిసె నూనె వంటివి) త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీన్ని రూమ్‌ ఫ్రెష్‌నర్‌గానూ, పెర్‌ఫ్యూమ్‌ల్లోనూ వాడతారు. రోజ్‌మేరీని కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయచ్చు. గింజలతో పెంచడం కాస్త కష్టం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్