అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!

మనం ఏది తిన్నా ఆరోగ్యం కోసమే! అయితే ఆయా ఆహార పదార్థాల్ని తీసుకునే క్రమంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటిస్తేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే పప్పుల్ని తీసుకునే విషయంలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు....

Published : 19 Mar 2024 13:32 IST

మనం ఏది తిన్నా ఆరోగ్యం కోసమే! అయితే ఆయా ఆహార పదార్థాల్ని తీసుకునే క్రమంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటిస్తేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే పప్పుల్ని తీసుకునే విషయంలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు.

పప్పుల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. వంటి పోషకాలే కాదు.. వీటి పనితీరుకు ఆటంకం కలిగించే యాంటీ న్యూట్రియంట్లు కూడా ఉంటాయి. ఇవి పోషకాల్ని శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. తద్వారా అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్యలు రాకూడదంటే పప్పుల్ని ఆహారంగా తీసుకునే క్రమంలో ఈ మూడు నియమాలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

మొలకెత్తాకే..!
చాలామందికి పప్పుల్ని నేరుగా వండుకోవడం లేదంటే వివిధ వంటకాల్లో భాగం చేసుకోవడం అలవాటు. కానీ ముందు వీటిని నానబెట్టి, మొలకలొచ్చాక వండుకునే వారు చాలా తక్కువమంది ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల యాంటీ న్యూట్రియంట్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను ప్రేరేపించచ్చు. ఎందుకంటే పప్పుల్లో ఉండే పోషకాల్ని శరీరం గ్రహించకుండా ఈ యాంటీ న్యూట్రియంట్లు అడ్డుపడతాయి. అదే నానబెట్టి, మొలకలెత్తించిన పప్పుల్లో వీటి శాతం తగ్గిపోతుంది. తద్వారా సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్‌.. వంటివి శరీరానికి అందుతాయి. అరుగుదల మెరుగుపడి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

వాటితో కలపండి!
పప్పుల్ని బియ్యంతో కంటే చిరుధాన్యాలు, కాయధాన్యాలతో కలిపి తీసుకోవడం వల్ల వాటిలోని సుగుణాలను శరీరం గ్రహించే సామర్థ్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి. శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తై రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు.. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండా జాగ్రత్తపడచ్చు.

ఇలా తీసుకోవచ్చు!
సాధారణంగా చాలామంది కంది, పెసర, శెనగ.. వంటి పప్పుల్నే రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. కానీ మన దేశంలో ఎన్నో రకాల పప్పులు, కాయధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వారానికి కనీసం ఐదు రకాలనైనా ఆహారంలో భాగం చేసుకుంటే అటు వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.. అలాగే వాటి రుచినీ ఆస్వాదించచ్చు. ఈ క్రమంలో వీటితో పచ్చళ్లు, ఇడ్లీ, దోసె, లడ్డూలు, హల్వా, పాపడ్‌.. వంటి విభిన్న వంటకాల్ని తయారుచేసుకొని తినచ్చు. తద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.


ప్రయోజనాలెన్నో!

పప్పుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.
 పప్పుల్లో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాల్ని ఫ్రీరాడికల్‌ డ్యామేజ్‌ నుంచి రక్షిస్తాయి. తద్వారా జీవక్రియల పనితీరుకు ఆటంకం జరగదు. అలాగే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
 పప్పుల్లో ఉండే పొటాషియం రక్తప్రసరణను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గేలా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 కాయధాన్యాలు, పప్పులు తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ కలిగి ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
 గర్భం ధరించిన మహిళలకు ఫోలికామ్లం చాలా అవసరం. ఇది బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. కాబట్టి ఈ పోషకం ఎక్కువగా ఉండే పప్పులు, కాయధాన్యాలు గర్భిణులు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
 వీటిలోని ఫైబర్‌, ప్రొటీన్లు కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని అదుపు చేస్తాయి. తద్వారా ఏది పడితే అది తినకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
 ఇక పప్పులు, కాయధాన్యాలు, గింజ ధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ ముప్పును తగ్గించడంలో సహకరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్