౩౫ ఏళ్లకే ఐదుగురు పిల్లలు.. ఒక మనవరాలు!

కెరీర్‌ వెంట పరుగులు పెడుతూ 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వారే ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటిది ౩౫ ఏళ్లకే ఓ మహిళ నానమ్మ అయిందంటే నమ్ముతారా? షిర్లీ లింగ్‌ కథ తెలిస్తే నమ్మాల్సిందే మరి! సింగపూర్‌కు చెందిన ఆమె ఐదుగురు పిల్లల తల్లిగానే కాదు.. ప్రస్తుతం నానమ్మగానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది....

Published : 17 May 2024 12:48 IST

(Photos : Instagram)

కెరీర్‌ వెంట పరుగులు పెడుతూ 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వారే ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటిది ౩౫ ఏళ్లకే ఓ మహిళ నానమ్మ అయిందంటే నమ్ముతారా? షిర్లీ లింగ్‌ కథ తెలిస్తే నమ్మాల్సిందే మరి! సింగపూర్‌కు చెందిన ఆమె ఐదుగురు పిల్లల తల్లిగానే కాదు.. ప్రస్తుతం నానమ్మగానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నటిగా, వ్యాపారవేత్తగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా.. అక్కడి వారికి సుపరిచితురాలైన ఆమె.. ఇప్పుడు బామ్మగానూ మరోసారి వార్తల్లోకెక్కింది. మరి, ఇంత చిన్న వయసులోనే షిర్లీ గ్రాండ్‌ మదర్‌గా ఎలా మారిందో తెలుసుకోవాలంటే.. ఆమె కథ చదవాల్సిందే!

‘చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలి.. జీవితంలో స్థిరపడాలి..’ యుక్త వయసులో షిర్లీ నమ్మిన సిద్ధాంతమిది! ఇలా తన ఆలోచన ప్రకారమే టీనేజ్‌లోనే వివాహబంధంలోకి అడుగుపెట్టిందామె. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. మొత్తం మూడుసార్లు పెళ్లి చేసుకుంది. పలు కారణాల రీత్యా మొదటి రెండు వివాహ బంధాలకు స్వస్తి పలికిన ఆమె.. ప్రస్తుతం మూడో భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే తన మూడు వివాహాల ఫలితంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది షిర్లీ. వారిలో ఇద్దరు కొడుకులు కాగా, ముగ్గురు కూతుళ్లున్నారు.

వివిధ రంగాల్లో రాణిస్తూ..!
ఇలా ఓవైపు ఐదుగురు పిల్లల బాధ్యతల్ని చూసుకుంటూనే.. మరోవైపు కెరీర్‌లోనూ రాణిస్తోంది షిర్లీ. ఈ క్రమంలోనే నటిగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, వ్యాపారవేత్తగా.. ఇలా పలు రంగాల్లో తనను తాను నిరూపించుకుంటోంది. 2022లో సింగపూర్‌ మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కించిన ‘Ah Girls Go Army’ అనే చిత్రంలో నటించి మెప్పించింది షిర్లీ. మరోవైపు ఓ రెస్టరంట్‌ నడుపుతూనే, ‘ది ఫ్లవర్‌ డ్యూయెట్‌’ పేరుతో పూల బొకే వ్యాపారాన్నీ నిర్వహిస్తోంది. అంతేకాదు.. విభిన్న రకాల వంటకాల్ని తయారుచేస్తూ, పేరెంటింగ్‌/లైఫ్‌స్టైల్‌ టిప్స్‌ అందిస్తూ.. ఆ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇలా సింగపూర్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం.. ఆమె నానమ్మ కావడమే!

నానమ్మగా..!
ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న తన పెద్ద కొడుకు గతేడాది తండ్రి కావడంతో నానమ్మ అయింది షిర్లీ. అతడి గర్ల్‌ఫ్రెండ్‌ పాపకు జన్మనిచ్చిందంటూ.. ఈ క్రమంలో తన కొడుకు చేసిన పనిని తాను విమర్శించట్లేదని, అలాగని సమర్థించట్లేదని అంటోందామె.
‘నేనూ టీనేజ్‌లో ఉన్నప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసుకోవాలి.. సెటిలవ్వాలి అనుకునేదాన్ని. కానీ చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో స్వీయానుభవంతో తెలుసుకున్నా. అందుకే నా పిల్లలు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదని.. వాళ్లు నాలా కష్టపడకూడదని వారికి పదే పదే చెబుతుండేదాన్ని. కానీ కొంతమంది పిల్లలకు ఏది చెప్పినా.. దానికి విరుద్ధంగా చేస్తుంటారు. నా పెద్ద కొడుకు చేసిందీ ఇదే! గతేడాది తన గర్ల్‌ఫ్రెండ్‌ గర్భం దాల్చిందని నాతో చెప్పినప్పుడు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో నా కొడుకు నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడేమో అనుకొని బాధపడ్డా! సరే.. జరిగిందేదో జరిగిపోయింది.. చేసిన పనికి వాడిపై కోపగించుకోవడం, అరవడం కంటే పుట్టిన పాపను వాడు కంటికి రెప్పలా చూసుకుంటే చాలనుకున్నా.. ఈ క్రమంలో నాకు చేతనైన సహకారం అందించాలనుకున్నా.. అయినా ఇప్పటికీ నా పిల్లలకు, బయటి వాళ్లకు ఒక్కటే మాట చెప్తా.. చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతలు తీసుకోకుండా.. కెరీర్‌పై దృష్టి పెట్టమని!’ అంటూ చెప్పుకొచ్చింది షిర్లీ.

‘వైరల్‌’ మామ్‌!
అయితే ఇంత చిన్న వయసులోనే షిర్లీ నానమ్మ కావడంతో ప్రస్తుతం ఆమె కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై స్పందిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
‘చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని.. దీనివల్ల కలిగే పర్యవసానాల్ని గ్రహించి.. పిల్లలు ఇదే పొరపాటు పునరావృతం చేయకుండా మార్గనిర్దేశనం చేస్తోన్న గ్రేట్‌ మామ్‌ షిర్లీ..’ అంటూ కొందరు స్పందిస్తున్నారు.
ఇక మరికొందరు.. ‘చిన్న వయసులో పెళ్లి, పిల్లలు కనడం వంటి విషయాల్లో తన స్వీయానుభవాల్ని బయటపెట్టి.. ఈ విషయంలో పిల్లల్ని నిందించకుండా, అలాగని మద్దతివ్వకుండా.. వారి బాధ్యతలు వారికి ఎలా తెలియజేయాలో నేర్పుతున్నారు షిర్లీ..’ అంటూ కామెంట్‌ చేశారు.
అంతేకాదు.. ‘ఫెయిల్డ్‌ మదర్‌’ అంటూ షిర్లీని విమర్శిస్తున్న వారూ లేకపోలేదు.. మరి, దీనిపై మీరేమంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్