స్టీల్ సింక్.. ఎలా శుభ్రం చేయాలి?

ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడానికి.. కూరగాయలు కడగడానికి.. చేతులు శుభ్రం చేసుకోవడానికి.. ఇలా ప్రతి చిన్న పనికీ మనం ఉపయోగించేది సింక్‌నే. ఈ క్రమంలో కొంతమంది స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్స్‌ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

Published : 15 Feb 2024 21:46 IST

ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడానికి.. కూరగాయలు కడగడానికి.. చేతులు శుభ్రం చేసుకోవడానికి.. ఇలా ప్రతి చిన్న పనికీ మనం ఉపయోగించేది సింక్‌నే. ఈ క్రమంలో కొంతమంది స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్స్‌ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కానీ వీటిని సరైన విధానంలో వాడకపోయినా, శుభ్రం చేయకపోయినా.. మొత్తం వంటగది లుక్‌నే మార్చేస్తాయి. ఈ క్రమంలో- సింక్ ఎప్పుడూ కొత్తదానిలా తళతళలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? గీతలు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చూద్దాం రండి..

స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్స్ శుభ్రం చేయడానికి చాలా అనువుగా ఉంటాయి. అయితే సింక్‌ని శుభ్రం చేయడం అనగానే చాలామంది రసాయనాలున్న లిక్విడ్స్‌తో గరుకుగా ఉన్న స్క్రబ్స్‌ని ఉపయోగిస్తారు. కానీ అలా చేయడం వల్ల స్టీల్ సింక్ కొద్ది రోజుల్లోనే పాతబడిపోయినట్లు అయిపోతుంది. సింక్‌ని వాడేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వారం లేదా 15 రోజులకోసారి..

మనం రోజూ గిన్నెలు శుభ్రం చేసినప్పుడు, కాయగూరలు కడిగినప్పుడు.. ఎంతో కొంత చెత్త సింక్‌లో కూడా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే సింక్‌ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సింక్ వాడకాన్ని బట్టి ఎన్ని రోజులకోసారి శుభ్రం చేసుకోవాలనేది నిర్ణయించుకోవాలి.

శుభ్రం చేద్దామిలా..!

రసాయనాలతో కూడిన లిక్విడ్‌వాష్‌లు, డిటర్జెంట్‌లు ఉపయోగించి సింక్‌ని శుభ్రం చేయడం వల్ల దాని నాణ్యత దెబ్బతింటుంది. అందుకే సహజసిద్ధంగా తయారుచేసిన పదార్థాలతో శుభ్రం చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మ లేదా నారింజ తొక్కలు, ఆలివ్ నూనె.. మొదలైనవి ఉపయోగించి సింక్‌ని సులభంగా క్లీన్ చేయచ్చు.
ముందుగా సింక్‌లో ఎలాంటి చెత్తా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్ సాయంతో సింక్ అంతా వ్యాపించేలా బాగా రుద్ది, తర్వాత వెనిగర్‌తో కడగాలి. తర్వాత నీటితో శుభ్రం చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో మెల్లగా సింక్ మొత్తం రుద్దాలి. ఇలా చేయడం వల్ల సింక్ నుంచి దుర్వాసన రాకుండా, తాజాగా ఉండడంతో పాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతూ ఉంటుంది. మళ్లీ నీళ్లతో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తని వస్త్రంపై ఆలివ్‌నూనె వేసి సింక్ మొత్తం తుడవాలి.

ఈ జాగ్రత్తలు కూడా..

⚛ లిక్విడ్ సోప్ లేదా ఇతర హౌస్‌హోల్డ్ క్లీనర్స్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ సింకును శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు.

⚛ సింక్‌లో బ్లీచ్, క్లోరిన్ వంటి పదార్థాలు కూడా ఎక్కువ సమయం ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మెరుపు తగ్గే అవకాశం లేకపోలేదు.

⚛ స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల గీతలు పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని సింక్‌లో వాడకూడదు.

⚛ గిన్నెలు వేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు.. నెమ్మదిగా పని చేసుకోవాలి. లేదంటే వాటి వల్ల గీతలు పడచ్చు.

⚛ ఉపయోగించిన ప్రతిసారీ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వేడినీళ్లలో మైల్డ్ సోప్ కలిపి వాటితో సింక్‌ని శుభ్రం చేయాలి.

⚛ సింక్‌ని తరచూ ఉపయోగించడం వల్ల మచ్చలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. కాబట్టి మెత్తని వస్త్రంపై వైట్ వెనిగర్ వేసి తుడవడం వల్ల ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్