ఇల్లాలిగా చేసిన ఇంటి పని కోసం రూ. 1.75 కోట్లు..!

కొంతమంది మహిళలు ఇంటిని-కెరీర్‌ను బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగితే.. మరికొంతమంది పలు కారణాల రీత్యా ఇంటికే పరిమితమవుతుంటారు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించడానికే మొగ్గు చూపుతుంటారు. నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే దాకా నిరంతరాయంగా చేసినా ఎడతెగని....

Updated : 11 Mar 2023 16:14 IST

(Representational Image)

కొంతమంది మహిళలు ఇంటిని-కెరీర్‌ను బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగితే.. మరికొంతమంది పలు కారణాల రీత్యా ఇంటికే పరిమితమవుతుంటారు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించడానికే మొగ్గు చూపుతుంటారు. నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే దాకా నిరంతరాయంగా చేసినా ఎడతెగని ఈ పనికి ఎలాంటి వేతనం ఉండదు. సరికదా.. కొంతమంది భర్త నుంచి వేధింపులు, ఇతర కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూనే.. ఈ పనులన్నీ పూర్తి చేస్తుంటారు. ఈ క్రమంలో ‘ఈ పనులన్నీ ఎవరి కోసం.. నా కుటుంబం కోసమే కదా!’ అనుకుంటారే తప్ప.. వారిలో ఎలాంటి స్వార్థపూరిత భావనా ఉండదు.

అయితే ఇలా జీవిత భాగస్వామిపై ఆధారపడ్డ భార్యలు ఒకానొక సమయంలో భర్త నుంచి విడిపోవాల్సి వస్తే..? సడెన్‌గా, కట్టుబట్టలతో ఇల్లు వదలాల్సిన పరిస్థితి తలెత్తితే..? తనకు ఆర్థిక భరోసా ఎవరిస్తారు? తన పిల్లల బాధ్యతను ఎవరు చూసుకుంటారు? స్పెయిన్‌కు చెందిన ఇవానా మోరల్‌ అనే గృహిణి ఇలాంటి ప్రశ్నలతోనే కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఆమెను కోటీశ్వరురాలిని చేసింది. ఇంటి పని విషయంలో ఎలాంటి విలువ లేదని బాధపడే ఎంతోమంది గృహిణుల్ని ఈ తీర్పు ఆలోచనలో పడేసింది.

చిల్లిగవ్వ ఇచ్చేవాడు కాదు!

స్పెయిన్‌కు చెందిన ఇవానా మోరల్‌ 1995లో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వీళ్ల పాతికేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా ఇద్దరమ్మాయిలు పుట్టారు. అయితే పెళ్లి తర్వాత జిమ్‌ వ్యాపారం ప్రారంభించిన ఇవానా భర్త.. వచ్చిన లాభాలతో 70 ఎకరాల్లో ఆలివ్‌ ఆయిల్‌ తోటను కొన్నాడు. అంతేకాదు.. ఖరీదైన కార్లు, ఇతర ఆస్తిపాస్తులు సంపాదించాడు. అన్నీ తన పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. తన భార్య ఇవానాను ఇంటి పనులకే పరిమితం చేశాడు. దీంతో ఆర్థికంగా తన భర్తపై ఆధారపడాల్సి వచ్చిన ఆమెకు తన ఆస్తిపాస్తుల గురించి కానీ, ఆదాయ వ్యయాల గురించి కానీ తెలియనిచ్చేవాడు కాదు. ఒకరకంగా ఇవానాకు చిల్లిగవ్వ దొరక్కుండా వేధించేవాడన్నమాట! అయినా అన్నీ భరిస్తూ పాతికేళ్ల పాటు భర్తతో జీవితాన్ని గడిపిన ఆమె నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నాడా భర్త. ఇలా పలు కారణాల రీత్యా 2020లో ఈ జంట విడాకులు తీసుకుంది.

కట్టుబట్టలతో బయటికొచ్చేశాం!

అయితే పెళ్లికి ముందు ఇవానా భర్త ‘సెపరేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌’ ఒప్పందంపై ఆమెతో సంతకం చేయించుకున్నాడట! అంటే.. దీని ప్రకారం విడాకుల సమయంలో ఇద్దరి ఉమ్మడి ఆస్తిపాస్తులు, వస్తువులు మాత్రమే విభజన అవుతాయి.. ఆమె భర్త సంపాదించిన ఆస్తులపై ఆమెకు ఎలాంటి హక్కు ఉండదని దీని అర్థం. ఈ క్రమంలోనే విడాకుల సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కట్టుబట్టలతోనే తన ఇద్దరు కూతుళ్లతో బయటికొచ్చేశానంటోంది ఇవానా.

‘పెళ్లైన పాతికేళ్ల నుంచి ఇంటికే పరిమితమయ్యా. ఇంటి పనుల్ని, గృహిణిగా నా బాధ్యతలను ఎంతో ఓపిగ్గా నిర్వర్తించా. బాధ్యతాయుతంగా నా ఇద్దరు పిల్లల్ని పెంచా. నా భర్త ఇంటి ఆర్థిక విషయాల్లో నన్ను భాగం చేయకపోయినా ఓపికతో సహించా. వ్యాపారంలో వచ్చిన లాభాలతో తాను కొన్న ఖరీదైన వస్తువులు, ఆస్తిపాస్తులు తన పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అయినా ‘తనవైతే ఏంటి? నావైతే ఏంటి?’ అని సర్దుకుపోయా. నా ఓపికకు పరీక్ష పెడుతూ 2020లో నా భర్త నాకు విడాకులిచ్చాడు. నా ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురి చదువుకయ్యే ఖర్చునూ భరించనని తేల్చి చెప్పాడు. ఇన్నేళ్లు ఇంటి కోసం నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇదేనా? అనిపించింది.. అందుకే కోర్టు మెట్లెక్కా..’ అంటూ గృహిణిగా ఈ పాతికేళ్లు తాను పడ్డ కష్టాల్ని పంచుకుంది ఇవానా.

ఆ తీర్పుతో కోటీశ్వరురాలైంది!

స్థానిక కోర్టులో విచారణ సాగిన ఈ కేసులో భాగంగా.. ఈ భార్యాభర్తలిద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇటీవలే అంతిమ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలో ఈ పాతికేళ్లు తన వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను త్యాగం చేసి మరీ ఇంటి పనులకే సమయం కేటాయించిన ఇవానాకు రూ. 1.75 కోట్లు వేతనంగా చెల్లించాలని ఆమె భర్తను కోర్టు ఆదేశించింది. స్పెయిన్‌లో వృత్తిపరంగా నెలవారీ కనీస వేతనాన్ని ఆధారంగా చేసుకొని.. పాతికేళ్లకు గానూ లెక్కగట్టి మరీ.. ఇంత సొమ్ము చెల్లించాలని సూచించింది. అంతేకాదు.. ప్రతినెలా తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి 400 యూరోలు (సుమారు రూ. 34,777), మరో కూతురికి 600 యూరోలు (సుమారు రూ. 52,164) చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇంటి పని విషయంలో ఎలాంటి విలువ లేదని బాధపడే ఎంతోమంది గృహిణుల్ని ఈ తీర్పు ఆలోచనలో పడేసిందని చెప్పచ్చు. అలాగే ప్రస్తుతం ఈ తీర్పు.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి విడాకుల భరణాల్లో ఒకటిగా నిలిచింది.

కష్టానికి ప్రతిఫలంగా!

అయితే ఇటీవలే తన కథ, విడాకుల సమయంలో ఇచ్చిన తీర్పు గురించి స్థానిక మీడియాతో పంచుకుంది ఇవానా. విడాకుల సమయంలో ఇంటి పనులకూ డబ్బును క్లెయిమ్‌ చేసుకోవచ్చని మహిళలందరికీ చెప్పడానికే ఇలా మీ ముందుకొచ్చానంటూ చెప్పుకొచ్చిందామె.

‘విడాకుల తర్వాత ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే నా భర్త ఇన్నేళ్లూ ఇంటి ఆర్థిక విషయాలకు నన్ను దూరంగా ఉంచాడని నాకు స్పష్టంగా అర్థమైంది. ఇన్నేళ్లు నా కెరీర్‌ను త్యాగం చేసి మరీ ఇంటి పనులకే నా పూర్తి సమయం వెచ్చించాను. అన్ని విషయాల్లో నా భర్తకు నీడలా మారాను. నాలాగే తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను త్యాగం చేసి ఇంటికి సమయం వెచ్చిస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న మహిళలు ఎంతోమంది ఉండి ఉంటారు. అలాంటి వారందరికీ.. విడాకుల సమయంలో ఇంటి పనులకూ డబ్బును క్లెయిమ్‌ చేసుకోవచ్చన్న సందేశం ఇవ్వడానికే ఇలా మీ ముందుకొచ్చా..’ అంటూ ఎంతోమంది మహిళల్ని ఆలోచనలో పడేసిన ఇవానా కథ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్