చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా?

ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు చపాతీ మంచిదని.. రోజుకో పూట చపాతీ తినేవారు చాలామందే! ఈ క్రమంలో పిండి మిగిలిపోయిందనో, సమయం ఉండదని ముందే అదనంగా కలిపి పెట్టుకొనో.. దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇలా అయితే తాజాగా ఉంటుందన్నది చాలామంది...

Published : 20 Jul 2022 19:12 IST

ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు చపాతీ మంచిదని.. రోజుకో పూట చపాతీ తినేవారు చాలామందే! ఈ క్రమంలో పిండి మిగిలిపోయిందనో, సమయం ఉండదని ముందే అదనంగా కలిపి పెట్టుకొనో.. దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇలా అయితే తాజాగా ఉంటుందన్నది చాలామంది భావన. కానీ ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఓ పూట గడిచాక పరిశీలిస్తే.. దానిపై నల్లటి పొర లాంటిది ఏర్పడడం గమనించచ్చు. అంటే దానిపై సూక్ష్మ క్రిములు వృద్ధి చెందాయని అర్థం. ఇక ఇలాంటి పిండితో పూరీలు, రోటీలు, చపాతీలు మొదలైనవి చేసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లే! మరి, ఇలాంటి పిండి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం రండి..

గోధుమ పిండితో చపాతీ, పూరీ, పరాఠా, ప్యాన్‌కేక్స్‌.. వంటి వివిధ రకాల వంటకాలు చేసుకోవడం మనకు అలవాటే! అయితే పిండి మిగిలిపోయినప్పుడు, ఎక్కువగా ముందే కలుపుకొన్నప్పుడు.. దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకొని మరో పూట ఉపయోగించుకోవాలనుకుంటారు చాలామంది. అయితే దీనివల్ల పలు రకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

అదే కారణమా?

పిండి కలిపిన రెండు గంటల తర్వాత అందులో రసాయనిక మార్పులు జరగడం.. బ్యాక్టీరియా, ఫంగస్‌లు అభివృద్ధి చెందడం మొదలవుతుంది. తద్వారా అందులో కొన్ని రకాల విషతుల్యాలు పెరిగిపోతాయి. ఇవి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. పైగా లోపలి పొర తాజాగానే ఉన్నా.. పై పొర నల్లగా మారడం మనం గమనిస్తాం. అంటే దానిపై ఫంగస్‌ వృద్ధి చెందిందని అర్థం అంటున్నారు నిపుణులు. ఇలాంటి పిండితో చపాతీలు చేసుకోవడం వల్ల అవి రుచించకపోగా ఆరోగ్యానికీ హాని చేస్తాయి. కాబట్టి పిండి కలిపిన రెండు గంటల్లోపే దాన్ని ఉపయోగించుకునేలా, అవసరం ఉన్నంత మేర ఏ పూటకు ఆ పూట కలుపుకోవడమే మేలంటున్నారు నిపుణులు.

ఈ సమస్యలొస్తాయ్!

మిగిలిపోయిన పిండిని ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి. సాధారణంగా గోధుమ పిండిలో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, అమైనో ఆమ్లాలు.. వంటివి ఉంటాయి. గంటలు గడిచే కొద్దీ ఇవి తొలగిపోయి.. సూక్ష్మ క్రిములు వృద్ధి చెందుతాయి. ఫలితంగా అజీర్తి, కడుపునొప్పి, విరేచనాలు వంటి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

పిండిని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల.. ఫ్రిజ్‌లోని వాయువులు పిండిలోకి చేరే ప్రమాదం ఉంది. ఇది వివిధ రకాల అనారోగ్యాలకు, ఒక్కోసారి ఫుడ్‌ పాయిజనింగ్‌కూ కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.

నానబెట్టిన పిండి గంటలు గడిచే కొద్దీ త్వరగా పులుస్తుంది. అయితే ఇది మరీ ఎక్కువగా పులియడం వల్ల అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియా హానికరంగా మారుతుంది. ఇలాంటి పిండితో చపాతీలు చేసుకొని తినడం వల్ల అది అరగకపోగా.. కడుపంతా పట్టేసినట్లుగా అవుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది.

ఇలాంటి పిండితో చపాతీలు చేసుకొని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు.

కొంతమంది పిండి కలిపే క్రమంలో కొద్దిగా పాలు, ఇతర పాల పదార్థాల్ని కూడా ఉపయోగిస్తుంటారు. అయితే దీనివల్ల పిండి త్వరగా పాడై పోయే ప్రమాదం ఉంటుందట!

సమయం గడిచే కొద్దీ పిండిలోని స్టార్చ్‌ చక్కెరలుగా రూపాంతరం చెందుతాయని, వీటిని తీసుకుంటే మధుమేహ సమస్య పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


ఇలా చేయచ్చు!

సాధ్యమైనంత వరకు పిండిని ఏ పూటకు ఆ పూటే, సరిపడే మోతాదులో కలుపుకోవడం మేలంటున్నారు నిపుణులు. అయితే ఒకవేళ మిగిలితే ఫ్రిజ్‌లో భద్రపరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మిగిలిన పిండిని అల్యూమినియం ఫాయిల్‌ కవర్‌లో, లోపల గాలి లేకుండా దగ్గరికి చుట్టి ఫ్రిజ్‌లో పెట్టచ్చు.

జిప్‌లాక్‌ బ్యాగ్‌ లేదంటే గాలి చొరబడని డబ్బాల్లో/బాక్సుల్లో పెట్టి ఈ పిండిని ఫ్రిజ్‌లో పెడితే పాడవకుండా జాగ్రత్తపడచ్చు.

పిండిలోని నీళ్లు/ఇతర పదార్థాలే అది త్వరగా పాడయ్యేలా చేస్తాయి. కాబట్టి కాస్త తక్కువ నీటితో పిండిని కలుపుకొని దాన్ని గాలి చొరబడని డబ్బాల్లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అవసరమున్నప్పుడు ఇంకాసిన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవచ్చు.

ఫ్రిజ్‌లో పెట్టాలనుకునే పిండిపై నూనె లేదా నెయ్యిని ఓ పొరలా పూయాలి. ఆపై గాలి చొరబడని డబ్బాల్లో పెట్టి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్