Simran Ranga: ‘బ్రేక్ డ్యాన్స్‌’తో హృదయాల్ని షేక్‌ చేస్తోంది!

డ్యాన్స్‌ అందరూ చేస్తారు.. కానీ అత్యంత కఠినమైన విన్యాసాలతో కూడిన బ్రేక్ డ్యాన్స్‌ చేసే వారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అది కూడా ఈ తరహా డ్యాన్స్‌ స్టైల్‌లో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. వాళ్లకు మాత్రమే ఇది....

Updated : 20 May 2023 20:21 IST

(Photos: Instagram)

డ్యాన్స్‌ అందరూ చేస్తారు.. కానీ అత్యంత కఠినమైన విన్యాసాలతో కూడిన బ్రేక్ డ్యాన్స్‌ చేసే వారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అది కూడా ఈ తరహా డ్యాన్స్‌ స్టైల్‌లో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. వాళ్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుందనుకుంటారు. కానీ అలాంటి అరుదైన నృత్య కళను అవపోసన పట్టడమే కాదు.. తన డ్యాన్సింగ్‌ స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది జైపూర్‌కు చెందిన సిమ్రన్‌ రంగా. ఈ డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన చేయడమే కాదు.. ట్రోఫీల్నీ అందుకుంటోంది. అలా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘రెడ్‌ బుల్‌ బీసీ వన్‌ సైఫర్‌ ఇండియా’ పోటీల్లో అమ్మాయిల (బి-గర్ల్‌) విభాగంలో ఇటీవలే విజేతగా నిలిచింది. ఇక త్వరలోనే ప్రపంచస్థాయిలో జరగబోయే ఈ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోన్న సిమ్రన్‌.. తాను ఎంచుకున్న ఈ ప్రత్యేకమైన నృత్య కళే తనకు అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టిందంటోంది.

హిప్-హాప్ నృత్యరీతిలో ఓ భాగమైన బ్రేక్ డ్యాన్స్‌.. తల/చేతులు/కాళ్లు.. ఇలా ఒక్కో భాగం పైనే శరీర భారమంతా మోపి.. గాల్లో గింగిరాలు తిరగడం, జంప్‌ చేయడం.. వంటి కఠినమైన విన్యాసాల్ని ఈ డ్యాన్స్‌ స్టైల్‌లో చూడచ్చు. సింపుల్‌గా బ్రేకింగ్‌ పేరుతో పిలిచే ఈ అథ్లెటిక్‌ స్టైల్‌ స్ట్రీట్‌ డ్యాన్స్‌ పుట్టింది విదేశాల్లోనే అయినా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. యువతను ఎక్కువగా ఆకట్టుకునే ఈ నృత్యరీతిని సాధన చేసే అబ్బాయిల్ని బి-బాయ్స్‌, అమ్మాయిల్ని బి-గర్ల్స్‌గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన నృత్యరీతిని ఒంటబట్టించుకొని దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది జైపూర్‌కు చెందిన బి-గర్ల్‌ సిమ్రన్.

ఆ అబ్బాయిల స్ఫూర్తితో..!

సిమ్రన్‌కు చిన్నతనం నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ప్రత్యేక సందర్భమైనా, బంధువులిళ్లలో ఫంక్షన్‌ అయినా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకునేదామె. ఇలా ఏడేళ్ల క్రితం ఒక సందర్భంలో బ్రేక్ డ్యాన్స్‌ చేస్తున్న బి-బాయ్స్‌ బృందాన్ని చూసిందామె. వాళ్ల డ్యాన్స్కి ముగ్ధురాలైన సిమ్రన్‌.. తాను కచ్చితంగా ఈ డ్యాన్స్‌ నేర్చుకోవాలని పట్టుబట్టింది.. దీన్ని సవాలుగా తీసుకుంది.. ఆసక్తి ఉంటే ఎంత కఠినమైన అంశాన్నైనా ఇట్టే నేర్చుకోవచ్చన్నట్లుగా.. కొన్ని నెలల్లోనే ఈ అరుదైన నృత్య రీతిని ఒంటబట్టించుకుంది సిమ్రన్‌. అయితే సాధన చేసే సమయంలో పదే పదే జారిపడడం వల్ల తన డ్యాన్స్‌ టీచర్‌ తనకు ‘గ్లిబ్‌’ అని పేరుపెట్టారని, ఆపై అదే తన స్టేజ్‌ నేమ్‌గా మారిపోయిందంటోందీ యంగ్‌ బి-గర్ల్.

కష్టమనుకోను.. ఎంజాయ్‌ చేస్తా!

‘2016 లో నా బ్రేకింగ్‌ జర్నీ ప్రారంభమైంది. అదే సమయంలో ఓసారి బ్రేక్ డ్యాన్స్‌ చేస్తోన్న అబ్బాయిల బృందాన్ని చూసి స్ఫూర్తి పొందా. ఈ డ్యాన్స్‌ స్టైల్‌ చాలా కొత్తగా అనిపించింది. ఏదైనా అందరిలా కాకుండా కాస్త వైవిధ్యంగా ఎంచుకోవడం నాకు అలవాటు. ఇదే బ్రేకింగ్‌ను నా కెరీర్‌గా మలచుకునేందుకు కారణమైంది. ఇందులో ప్రతి మూవ్మెంట్‌ ఎంతో కష్టతరమైంది.. అయినా ఆసక్తిగా నేర్చుకుంటూ ఎంజాయ్‌ చేశా. ఇక నైపుణ్యాలు పెంచుకుంటూ అనుభవం గడించే కొద్దీ.. డ్యాన్స్‌ టీచర్‌ చెప్పిన నృత్య రీతుల్ని సాధన చేయడంతో పాటు కొత్త మూవ్మెంట్స్‌ కనుక్కోవడం అలవాటైంది. ఎంతటి కఠినమైన మూవ్ అయినా సింపుల్‌గా, స్మూత్‌గా చేయడం నా ప్రత్యేకత. అలాగే ఒక మూవ్మెంట్‌ ఎంత పర్‌ఫెక్ట్‌గా చేయడం వచ్చినా.. దాన్ని సాధన చేయడం మాత్రం మానను..’ అంటోంది సిమ్రన్.

ఓడి.. గెలిచా!

ప్రస్తుతం జైపూర్‌లోని ‘ది కాపర్‌ బీట్స్‌ క్రూ’ అనే డ్యాన్స్‌ స్కూల్‌ తరపున బ్రేకింగ్‌ పోటీల్లో పాల్గొంటోన్న సిమ్రన్‌.. తొలి పోటీల్లోనే ఓటమి పాలైనా.. అందులో నుంచి బోలెడన్ని పాఠాలు నేర్చుకున్నానంటోంది.

‘జైపూర్‌లో జరిగిన స్థానిక పోటీల్లో తొలిసారి పాల్గొన్నా. అందులో నేనొక్కదాన్నే అమ్మాయిని కావడంతో ఆ పోటీని సవాలుగా తీసుకున్నా.. ప్రదర్శన కోసం స్టేజ్‌ మీదకు వెళ్తున్నప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యా. కానీ ఓడిపోయా.. టాప్‌-16లో చోటు దక్కింది. అయినా ఈ పోటీల్లో నేను చేసిన ‘విండ్‌మిల్‌’ మూవ్మెంట్స్‌ ‘బెస్ట్‌ బి-గర్ల్‌’గా నాకు అవార్డు తెచ్చిపెట్టాయి. నిజానికి ఆ మూవ్స్ చేయడం చాలా కష్టం. అయినా నా పెర్ఫార్మెన్స్‌కు అవార్డు దక్కడంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇక వెనుతిరిగి చూడలేదు. ఆపై పలు పోటీల్లో పాల్గొని టైటిల్స్‌ గెలుపొందా. నా కెరీర్‌లో ఇప్పటివరకు మైలురాళ్లుగా నిలిచే విజయాలు నాలుగున్నాయి.

మొదటిది - ‘రెడ్ బుల్‌ బీసీ వన్‌ ఇండియా సైఫర్‌ - 2021 బి-గర్ల్‌ ఛాంపియన్‌షిప్‌’లో టాప్‌-4లో నిలవడం.

రెండోది - ‘నేషనల్‌ బ్రేకింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకోవడం.

మూడోది - ‘రెడ్‌ బుల్‌ బీసీ వన్‌ 2022 ఇండియా నార్త్‌ జోన్‌ సైఫర్‌’ పోటీల్లో టైటిల్‌ గెలుచుకోవడం.

నాలుగోది - ఇటీవలే జరిగిన ‘రెడ్‌ బుల్‌ బీసీ వన్‌ సైఫర్‌ ఇండియా బి-గర్ల్‌’ పోటీల్లో విజేతగా నిలవడం..’ అంటూ మురిసిపోతోందీ యంగ్‌ బ్రేక్ డ్యాన్సర్.

వారానికి ఐదు రోజులు!

ప్రస్తుతం ఇటు చదువు కొనసాగిస్తూనే.. అటు బ్రేక్ డ్యాన్సర్‌గా సత్తా చాటుతోన్న సిమ్రన్‌.. ఈ నృత్యరీతే తనను ప్రత్యేకంగా నిలబెట్టిందంటోంది.

‘నేను వారానికి ఐదు రోజులు, రోజుకు నాలుగ్గంటల చొప్పున బ్రేకింగ్‌ సాధన చేస్తున్నా. యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటే ఆ రోజు కొత్త కొత్త మూవ్మెంట్స్ కనిపెడతా.. అయితే రోజురోజుకీ సాధనతో నా నైపుణ్యాల్ని పెంచుకుంటూ పోవడానికే ప్రయత్నిస్తా. ఈ డ్యాన్స్‌ చేస్తున్నంత సేపు నాకు నేనే స్వేచ్ఛగా ఫీలవుతా.. ఎంజాయ్‌ చేస్తా. ఈ నృత్య రీతి నా ప్రాణం. ఇది నాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.. వ్యక్తిగతంగానూ నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదం చేసింది.. అందుకే దీనికి నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ జైపూర్‌ బ్రేకర్.

ఇలా తన డ్యాన్స్తో కుర్రకారు హృదయాల్ని షేక్‌ చేస్తోన్న సిమ్రన్‌.. ఈ నవంబర్‌లో ప్యారిస్‌లో జరగబోయే ‘రెడ్‌ బుల్‌ బీసీ వన్‌ వరల్డ్‌ ఫైనల్‌ - 2023 పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో తొలిసారి ఈ డ్యాన్స్‌ స్టైల్‌ పోటీల్ని నిర్వహించనున్నారు. తన ప్రతిభతో అందులోనూ పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోందీ యువ డ్యాన్సర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్