టేబుల్ మ్యానర్స్.. నేర్పించారా?

సాధారణంగా రెండు లేదా మూడేళ్ల లోపు వయసున్న పిల్లలకు తల్లులే ఆహారం తినిపిస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత మాత్రం పిల్లలు వారంతట వారే ఆహారం తినేలా ప్రోత్సహిస్తాం. ఈ క్రమంలోనే వారికి డైనింగ్ టేబుల్ దగ్గర పాటించాల్సిన కొన్ని పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేర్పించాలి.

Published : 29 Feb 2024 13:16 IST

సాధారణంగా రెండు లేదా మూడేళ్ల లోపు వయసున్న పిల్లలకు తల్లులే ఆహారం తినిపిస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత మాత్రం పిల్లలు వారంతట వారే ఆహారం తినేలా ప్రోత్సహిస్తాం. ఈ క్రమంలోనే వారికి డైనింగ్ టేబుల్ దగ్గర పాటించాల్సిన కొన్ని పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేర్పించాలి.

కూర్చోవడం ఇలా..

డైనింగ్ టేబుల్‌పై అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలో ఏవైనా కుషన్స్ వంటివి వేయాలి. లేదా ప్రత్యేకించి పిల్లల కోసం సౌకర్యవంతంగా తయారు చేయించిన కుర్చీ ఏర్పాటుచేసినా మంచిదే. అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే ముందు కుర్చీని శబ్దం వచ్చేలా జరపకూడదని వారికి తెలియజేయాలి. ఒకవేళ వారు కుర్చీని టేబుల్‌కి దగ్గరగా జరుపుకోవడానికి వీల్లేకపోతే.. మీరే నెమ్మదిగా జరిపే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు టేబుల్ ఎక్కి కూర్చుంటుంటారు. అలాంటప్పుడు అది సరికాదని వారికి తెలియజేస్తూ.. అనువుగా ఎలా కూర్చోవాలో పిల్లలకు నేర్పించాలి. అయినా కొందరు చిన్నారులు మారాం చేస్తుంటారు. కాబట్టి వారిపై కోపం తెచ్చుకోకుండా ఓపికతో వ్యవహరిస్తూ నెమ్మదిగా ఈ పద్ధతిని అలవాటు చేయించాలి.

ఆహారం తీసుకునే విధానం..

టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ప్లేట్లో ఎంత ఆహారం పెట్టుకోవాలి? ఏ విధంగా తినాలి..? మొదలైన విషయాలు కూడా సునిశితంగా వారికి ఒకటికి రెండుసార్లు వివరించాలి. ప్లేటును ఆహారంతో నింపేయడం కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో ఆహారం పెట్టుకొని బాగా నమిలి తినే విధానం వారికి అలవాటు చేయాలి. ఇలా తినడం వల్ల వారికి ఆహారం రుచించి ఇంకాస్త ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతిని వారికి నేర్పించడం వల్ల మీరు బయటికి వెళ్లినప్పుడు కూడా వారంతట వారే ఆహారం తినే వీలుంటుంది.

వేటిని దేనికి ఉపయోగించాలి??

డైనింగ్ టేబుల్‌పై స్పూన్లు, చాకులు, ఫోర్క్‌లు.. ఇవన్నీ ఓ హోల్డర్‌లో వేసి ఉంచడం సహజం. ఆహారం తీసుకునే క్రమంలో వేటిని దేనికి ఉపయోగించాలి? వాటిని ఏ విధంగా పట్టుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందో కూడా వారికి నేర్పించాలి. ఉదాహరణకు.. కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న స్పూన్‌ను సలాడ్స్ తినడానికి, చిన్న పరిమాణంలో ఉన్న స్పూన్‌ను ఐస్‌క్రీమ్స్, స్వీట్స్.. వంటివి తినడానికి ఉపయోగించాలని చిన్నారులకు చెప్పాలి. అలాగే చాలామంది పిల్లలు వారికి ప్లేట్లో తినడం సరిగ్గా రాక.. చుట్టూ ఆహారం పడేస్తుంటారు. కాబట్టి వారికి ముందుగా గిన్నెలో తినడం నేర్పించి.. ఆ తర్వాత ప్లేట్లో తినే విధానాన్ని అలవాటు చేయాలి.

మర్యాదపూర్వకంగా..

భోజనంలో భాగంగా పలు రకాల ఆహారపదార్థాలు సిద్ధం చేసుకోవడం పరిపాటే. అయితే వడ్డించిన పదార్థం కాకుండా టేబుల్‌పై ఉన్న ఇతరత్రా పదార్థాలు కావాలనుకున్నప్పుడు వాటిని వేయమని అరవడం కాకుండా.. మర్యాదపూర్వకంగా అడగమని పిల్లలకు సూచించాలి. ఈ క్రమంలో ప్లీజ్, థాంక్యూ.. వంటి పదాలు వారికి అలవాటు చేయాలి. ఫలితంగా బయట రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు కూడా పిల్లలు హుందాగా, వినయంగా నడుచుకునే అవకాశం ఉంటుంది.

భోజనం ముగిసిన తర్వాత..

భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్‌లో చేతులు కడగకుండా జాగ్రత్తగా కిందకు దిగి సింక్ లేదా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి శుభ్రం చేసుకోవడం నేర్పించాలి. అలాగే పిల్లలకు తిన్న తర్వాత ప్లేట్ తీయడం లేదా వాటిని వాష్ చేయడం.. వంటి అలవాట్లు వారు ఎదుగుతున్న కొద్దీ నేర్పించడం కూడా మంచిదే. ఫలితంగా ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునే స్వభావం వారికి అలవడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్