అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదట!

ఒక్కోసారి ఉన్నట్లుండి మాట తడబడుతుంటుంది.. ఆ వెంటనే తిరిగి సెట్‌ అవ్వడంతో పెద్దగా పట్టించుకోం..అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తుంటుంది.. గ్యాస్ట్రిక్‌ సమస్యేమోనని నిర్లక్ష్యం చేస్తుంటాం..సడన్‌గా బరువు తగ్గడం, జుట్టు ఎక్కువగా రాలడాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు కొంతమంది..ఇలా శరీరంలో, ఆరోగ్యపరంగా జరిగే చాలా మార్పుల్ని అంతగా పట్టించుకోరు చాలామంది. మరోసారి ఈ సమస్య ఎదురైనప్పుడు చూద్దాంలే అనుకుంటుంటారు.

Updated : 06 Apr 2024 19:12 IST

ఒక్కోసారి ఉన్నట్లుండి మాట తడబడుతుంటుంది.. ఆ వెంటనే తిరిగి సెట్‌ అవ్వడంతో పెద్దగా పట్టించుకోం..

అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తుంటుంది.. గ్యాస్ట్రిక్‌ సమస్యేమోనని నిర్లక్ష్యం చేస్తుంటాం..

సడన్‌గా బరువు తగ్గడం, జుట్టు ఎక్కువగా రాలడాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు కొంతమంది..

ఇలా శరీరంలో, ఆరోగ్యపరంగా జరిగే చాలా మార్పుల్ని అంతగా పట్టించుకోరు చాలామంది. మరోసారి ఈ సమస్య ఎదురైనప్పుడు చూద్దాంలే అనుకుంటుంటారు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తీసుకొస్తుందంటున్నారు వైద్యులు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అనుమానం కలిగినా, కొన్ని రకాల లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. అప్పుడే ఆరోగ్య సమస్యను తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించడం వీలవుతుంది. అలాగే ప్రాణహానీ తప్పుతుంది. మరి, శరీరంలో కనిపించే ఎలాంటి లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకుందాం రండి..

⚛ కొంతమందికి ఉన్నట్లుండి మాట తడబడుతుంటుంది.. నత్తిగా మాట్లాడుతుంటారు. కాసేపటికి అదే సెట్‌ అవుతుందిలే అని దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణం శరీరంలో కొన్ని అనారోగ్యాలకు సంకేతమని చెబుతున్నారు నిపుణులు. రక్తంలో సోడియం-చక్కెర స్థాయులు పడిపోవడం, అమ్మోనియా స్థాయులు పెరిగిపోవడం, కాలేయ సంబంధిత సమస్యలు, మెదడు సంబంధిత ఇన్ఫెక్షన్లు.. వంటి సమస్యలున్నప్పుడు ఇలా జరిగే అవకాశాలున్నాయంటున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం వల్ల సమస్యను గుర్తించచ్చంటున్నారు.

⚛ ఒక్కోసారి మన మనసు మన అధీనంలో ఉండదు.. తీవ్ర గందరగోళానికి గురవుతుంటాం.. చేసే చేతలకు, మాటలకు పొంతన ఉండదు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. జీవక్రియల పనితీరు అదుపు తప్పడం, మెదడులో ఇన్ఫెక్షన్లు, అరుదుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కూడా ఈ లక్షణాలు కారణం కావచ్చని చెబుతున్నారు. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్‌ అవ్వమని సలహా ఇస్తున్నారు.

⚛ ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్‌ సమస్యలున్న వారిలో తరచూ ఛాతీలో నొప్పి రావడం గమనిస్తుంటాం. అయితే ఈ నొప్పికి ప్రతిసారీ ఇవే సమస్యలు కారణం కాకపోవచ్చంటున్నారు నిపుణులు. నొప్పికి తోడు ఛాతీపై ఎక్కువ బరువు మోపినట్లుగా అనిపించడం, మంట.. అది క్రమంగా చేతుల్లోకీ విస్తరించడం.. వంటి లక్షణాలు గమనిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఈ తరహా లక్షణాలు గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు.

⚛ బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తుంటారు చాలామంది. కానీ వ్యాయామాలు చేయకుండానే మీరు బరువు తగ్గుతున్నారా? అది కూడా ఆరు నెలల్లోనే నాలుగున్నర కిలోల పైగానే తగ్గారా? అయితే ఈ సడన్‌ వెయిట్‌ లాస్‌ థైరాయిడ్‌, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అరుదుగా ఇది క్యాన్సర్‌కూ దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

⚛ కొంతమందికి మూత్రం, మలంలో రక్తం పడుతుంటుంది. వేసవిలో వేడి కారణంగా కొంతమందిలో ఈ సమస్య తలెత్తుతుంటుంది. అయితే అసలు కారణం ఇది కాకపోవచ్చంటున్నారు నిపుణులు. జీర్ణకోశ సంబంధిత సమస్యలు, యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు.. వంటి వాటి వల్ల ఇలా జరిగే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.

⚛ ఉన్నట్లుండి జుట్టు ఎక్కువగా రాలడం కొంతమందిలో గమనిస్తుంటాం. దీనికి హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్‌, రక్తహీనత.. వంటివి కారణమయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వైద్యుల సలహాలు పాటిస్తూనే శక్తి స్థాయులు పెంచుకోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం పైనా దృష్టి పెట్టమంటున్నారు.

⚛ జ్వరాన్ని తేలిగ్గా తీసుకునే వారూ కొందరుంటారు. ట్యాబ్లెట్స్‌, యాంటీ బయోటిక్స్‌తో ఈ సమస్య నుంచి బయటపడచ్చనుకుంటారు. కానీ జ్వరం ఎక్కువ రోజుల పాటు కొనసాగినా, 103 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరినా.. ఇది వివిధ రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు సూచన అంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకపోవడం మంచిదని చెబుతున్నారు.

⚛ తరచూ కడుపుబ్బరం వేధిస్తోందా? కడుపంతా పట్టేసినట్లుగా ఉంటోందా? ఇందుకు మనం తీసుకునే ఆహారమే కాదు.. వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలున్నప్పుడూ ఇలా జరిగే అవకాశాలు ఎక్కువమంటున్నారు నిపుణులు. ఇలాంటి లక్షణాలు అరుదుగా గర్భాశయ క్యాన్సర్‌, సిస్టులకు కారణం కావచ్చని చెబుతున్నారు. కాబట్టి అసలు సమస్యేంటో తెలుసుకోవాలంటే సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.

⚛ గర్భం ధరించాక వికారం కామన్‌. కానీ సాధారణ సమయాల్లో ఇలా పదే పదే జరుగుతుందంటే అందుకు మైగ్రెయిన్‌, ఒత్తిడి, వెజైనల్‌ సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం.. వంటి వాటి వల్ల కూడా ఇలా జరుగుతుందట! అంతేకాదు.. ఇదే వికారం కొన్నిసార్లు సర్వైకల్‌ క్యాన్సర్‌కూ కారణమవుతుందట!

⚛ నెలసరి సమయంలో కొంతమందిలో రక్తం గడ్డల్లాగా పడుతుంటుంది. దీనికి గర్భాశయ ఫైబ్రాయిడ్లు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కారణం కాకపోయినా.. అధిక రక్తస్రావానికి, తద్వారా రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఎక్కువంటున్నారు.

⚛ కలయిక సమయంలో నొప్పి రావడానికి వెజైనా పొడిబారడమే కారణమనుకుంటారు చాలామంది. కానీ కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్‌, యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు, వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు, సుఖ వ్యాధుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి నొప్పి వెనకున్న అసలు కారణాలేంటో త్వరగా తెలుసుకొని సంబంధిత చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మేలంటున్నారు.

⚛ కొంతమంది వెజైనల్‌ డిశ్చార్జిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అండం విడుదలయ్యే సమయంలో ఇది సహజమే అనుకుంటారు. కానీ ఈ డిశ్చార్జి బ్రౌన్‌, గులాబీ రంగుల్లో రావడం, దుర్వాసనతో కూడుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే గర్భాశయ క్యాన్సర్‌కు దీన్ని తొలి సూచనగా పరిగణించచ్చని నిపుణులు చెబుతున్నారు.

చూశారుగా.. ఏయే లక్షణాలు ఏయే సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందో! కాబట్టి శరీరంలో ఆయా మార్పులు, ఆరోగ్యపరంగా ఆయా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. వాళ్లు తగిన సూచనలు చేయడంతో పాటు సంబంధిత నిపుణుల్ని సంప్రదించమని సలహా ఇస్తారు. ఆపై వాళ్లు సూచించిన పరీక్షలు చేయించుకొని సమస్యను నిర్ధరించుకోవచ్చు.. తగిన చికిత్స తీసుకొని అనారోగ్యం నుంచి బయటపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్