ఈ ఫ్రిజ్ గ్యాడ్జెట్స్ మీ ఇంట్లో ఉన్నాయా?

ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించుకునే క్రమంలో ఇలాంటి అనుభవాలు చాలామందికి కామన్. అయితే మరి, ఫ్రిజ్‌లో అమర్చే కాయగూరలు, పండ్లు తాజాగా ఉండాలంటే ఏంచేయాలి?, ఫ్రిజ్ పరిశుభ్రంగా ఉంచుకోవడమెలా? అని ఆలోచిస్తున్నారా? అందుకూ సరికొత్త గ్యాడ్జెట్లు ప్రస్తుతం.....

Updated : 23 Nov 2022 11:04 IST

మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే కవర్లతో పాటే వాటిని ఫ్రిజ్‌లోని వెజిటబుల్ బాక్స్‌లో వేసేసింది శ్రావణి. రెండ్రోజుల తర్వాత వండుదామని తీసేసరికి.. అవి మొత్తం కుళ్లిపోవడం గమనించింది.

పుచ్చకాయని సగం కట్ చేసిన మాధవి.. మిగతా సగాన్ని అలాగే నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేసింది. మరునాటికి మిగతా సగం తిందామని తీసేసరికి.. పైన లేయర్ మొత్తం డ్రైగా మారి పండు నిర్జీవమైపోయింది.

ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించుకునే క్రమంలో ఇలాంటి అనుభవాలు చాలామందికి కామన్. అయితే మరి, ఫ్రిజ్‌లో అమర్చే కాయగూరలు, పండ్లు తాజాగా ఉండాలంటే ఏంచేయాలి?, ఫ్రిజ్ పరిశుభ్రంగా ఉంచుకోవడమెలా? అని ఆలోచిస్తున్నారా? అందుకు ఎన్నో రకాల గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరాయి.

సిలికాన్ లిడ్ సెట్

పుచ్చకాయ, తర్బూజా.. వంటి పండ్లను ఒకేసారి తినకుండా సగం కట్ చేసుకొని తర్వాత తిందామని ఫ్రిజ్‌లో పెట్టేసే వారు మనలో చాలామందే! ఈ క్రమంలో ఫ్రిజ్‌లో ఉన్నా దాన్ని సరిగ్గా స్టోర్ చేయకపోతే కట్ చేసిన భాగం తేమను కోల్పోయి డ్రైగా మారే అవకాశముంది. అంతేకాదు.. ఆ పండ్లపై ఉండే తొక్క కూడా ముడతలు పడుతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే సిలికాన్ లిడ్ సెట్‌ను ఇంటికి తెచ్చుకోవాల్సిందే! ఇవి సాగే గుణాన్ని కలిగి ఉండడం వల్ల గుండ్రంగా, చతురస్రాకారంలో, దీర్ఘచతురస్రం.. ఇలా అన్ని ఆకృతులకు, సైజులకు అమర్చుకునే వీలుంటుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. కట్ చేసిన లేదా ఇతర పండ్లను ఒక కంటెయినర్‌లో పెట్టి దానిపై సిలికాన్ లిడ్‌ను బిగిస్తే సరి. పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లను కంటెయినర్‌లో పెట్టకుండా నేరుగా కూడా దానిపై ఈ మూతను బిగించచ్చు. తద్వారా ఆ లిడ్ పండ్లకు, ఇతర పదార్థాలకు కవచంలా పనిచేసి వాటిని తాజాగా ఉంచుతుంది. సిలికాన్ లిడ్ సెట్‌తో పాటు కంటెయినర్స్ కూడా దాంతో పాటే కొనేసుకోవచ్చు.. ఒకవేళ అవసరం లేదనిపిస్తే కేవలం మూతలు మాత్రమే కొనుక్కుంటే సరిపోతుంది.


రిఫ్రిజిరేటర్ మ్యాట్స్

మనం తినగా మిగిలిపోయిన పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు.. వంటివి ఎలా పడితే అలా ఫ్రిజ్‌లోని షెల్ప్‌లపై పడేసే వారూ లేకపోలేదు. దానివల్ల ఆ షెల్ఫ్‌లపై మరకలు పడి ఫ్రిజ్ అపరిశుభ్రంగా మారిపోతుంది. మరి, అలా జరగకుండా రిఫ్రిజిరేటర్‌ను నీట్‌గా ఉంచడానికే మన ముందుకొచ్చేశాయి రిఫ్రిజిరేటర్ మ్యాట్స్. ప్లాస్టిక్ మెటీరియల్‌తో, విభిన్న డిజైన్లలో, రంగుల్లో తయారు చేసిన ఈ మ్యాట్స్‌ను ఫ్రిజ్‌లోని షెల్ఫ్‌ల్లో అమర్చుకుంటే సరిపోతుంది. ఇక వాటిపై ఏం పెట్టినా షెల్ఫ్‌పై మరకలు పడకుండా జాగ్రత్తపడచ్చు. వారానికోసారో లేదంటే పదిహేను రోజులకోసారో వీటిని తీసి శుభ్రం చేసుకొని మళ్లీ అమర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పదే పదే ఫ్రిజ్‌ను శుభ్రం చేసే పనిని తగ్గించుకోవచ్చు.. తద్వారా శ్రమ కూడా తగ్గుతుంది.


మల్టీ ఫంక్షనల్ స్టోరేజ్ బాక్స్

పుచ్చకాయ, తర్బూజా.. వంటి పండ్లు పెద్దగా ఒకటి లేదా రెండు ఉంటాయి కాబట్టి వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేయచ్చు.. అదే బెర్రీస్, ద్రాక్ష, నేరేడు.. వంటి పండ్లు చిన్నగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి! మరి వాటిని నేరుగా ఫ్రిజ్‌లో ఉంచలేము. పైగా ఏదైనా కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడదామంటే అవి త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మల్టీ ఫంక్షనల్ స్టోరేజ్ బాక్స్‌ల్లో వాటిని నిల్వ చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. ఫొటోలో చూపినట్లుగా ర్యాక్ మాదిరిగా ఉండే ఈ బాక్సుల్లో కేవలం పండ్లే కాదు.. చిన్న చిన్న కాయగూరలు, పాల ప్యాకెట్లు.. వంటివి కూడా అమర్చుకొని ఫ్రిజ్‌లో ర్యాక్ లాగా అమర్చుకోవచ్చు. అంతేకాదు.. వాటిని తీసి శుభ్రం చేయడమూ సులభమే.


ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్

మసాలాలు, కారం, పసుపు.. వంటివి కూడా కొందరు రిఫ్రిజిరేటర్‌లో అమర్చుతుంటారు. అయితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికీ కొన్ని స్టోరేజ్ బ్యాగ్‌లు అందుబాటులోకొచ్చేశాయి. ఫొటోలో చూపించినట్లు సిలికాన్‌తో తయారైన ఈ రంగురంగుల బ్యాగుల్లో మసాలాలే కాదు.. దానిమ్మ పండ్ల గింజలు, క్యారట్-బీట్‌రూట్ వంటి దుంపలు, పాలు, జ్యూసులు సైతం అందులో అమర్చుకొని ఫ్రిజ్‌లో భద్రపరచుకోవచ్చు. తద్వారా అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండడంతో పాటు ఫ్రిజ్‌లో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వాటిని సులభంగా శుభ్రం చేసి తిరిగి ఉపయోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్