వాషింగ్ మెషీన్‌లో.. వీటిని కూడా..!

వాషింగ్‌ మెషీన్‌ని ఎందుకు ఉపయోగిస్తారు? అదేం ప్రశ్న.. బట్టలుతకడానికి అంటారా? అది నిజమే.. కానీ వాటితో పాటు మరికొన్ని వస్తువుల్ని సైతం ఇందులో శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు....

Published : 22 May 2024 12:44 IST

వాషింగ్‌ మెషీన్‌ని ఎందుకు ఉపయోగిస్తారు? అదేం ప్రశ్న.. బట్టలుతకడానికి అంటారా? అది నిజమే.. కానీ వాటితో పాటు మరికొన్ని వస్తువుల్ని సైతం ఇందులో శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటి? వాటిని మెషీన్‌లో వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రండి.. తెలుసుకుందాం..!

ఏవేవి?
 పిల్లలు ఆడుకునే సాఫ్ట్‌ టాయ్స్‌, క్లాత్‌ లేదా ఫర్‌ మెటీరియల్‌తో తయారుచేసిన బొమ్మలు త్వరగా మురికి పడతాయి. వాటిని కూడా మెష్‌ బ్యాగ్‌లో వేసి ‘క్విక్‌ వాష్‌’ ఆప్షన్‌ ఎంచుకుంటే.. చిటికెలో కొత్త వాటిలా మారిపోతాయి.
 కిచెన్‌లో తరచూ ఉపయోగించే స్పాంజ్‌లు, సిలికాన్‌ ట్రివెట్స్‌ (వేడి గిన్నెల అడుగున వేసే మ్యాట్‌), వేడి గిన్నెలు దింపడానికి ఉపయోగించే సిలికాన్‌ మిట్స్‌/అవెన్‌ మిట్స్‌/సిలికాన్‌ గ్లౌజులు.. వంటివీ వాషింగ్‌ మెషీన్‌లో వేసి శుభ్రం చేసుకోవచ్చు. అయితే వీటి కోసం మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు వచ్చేలా ముందుగా మెషీన్‌లో ఆప్షన్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
 ప్రస్తుతం సౌందర్య పోషణలో భాగంగా లూఫా స్పాంజ్‌లను ఉపయోగించడం కామనైపోయింది. ఈ క్రమంలో చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు ఇందులోకి చేరతాయి.. కాబట్టి వీటినీ తరచూ శుభ్రం చేయాల్సిందే. ఈ క్రమంలో వీటిని మెష్‌ బ్యాగ్‌లో ఉంచి.. మెషీన్‌లో వేయచ్చు.
 హెయిర్‌ టైస్‌, హెడ్‌ బ్యాండ్స్‌, రబ్బర్‌ బ్యాండ్స్‌.. వంటి హెయిర్‌ యాక్సెసరీస్‌ త్వరగా జిడ్డుగా మారిపోతాయి. అయితే వీటిని కూడా మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేసేయచ్చు.
 ప్రస్తుతం ఏ దుస్తులు వేసుకున్నా బెల్టు పెట్టుకోవడం ఫ్యాషనైపోయింది. కాబట్టి వీటిని ఉతకాలనుకున్నప్పుడు మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషింగ్‌ మెషీన్‌లో వేసేయచ్చు. తద్వారా వాటికి ఉండే మెటల్‌ హార్డ్‌వేర్‌ పాడవకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!
 కాస్త గట్టి వస్తువులు, సున్నితమైన వస్తువుల్ని జిప్‌లాక్‌ ఉన్న మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేయాలి. తద్వారా అటు అవి, ఇటు వాషింగ్‌ మెషీన్‌ డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.
 చాలావరకు చల్లటి లేదా గోరువెచ్చటి నీటిని ఉపయోగించడమే మంచిది. అలాగే ‘క్విక్‌ వాష్‌’ ఆప్షన్‌ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
 అలాగే అన్ని వస్తువులకు గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌/లిక్విడ్‌ ఉపయోగించడం ఉత్తమం. మరీ సున్నితమైన వస్తువులైతే క్యాస్టైల్‌ సోప్‌ లిక్విడ్‌ని వాడచ్చు.
 కొన్ని వస్తువుల నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు వాష్‌ సైకిల్‌లో అరకప్పు వైట్‌ వెనిగర్‌ వేస్తే సరి.
 ఇక వీటన్నింటినీ ఎండలో ఆరబెట్టడం వల్ల వాటిలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములు తొలగిపోయి మరింత శుభ్రపడతాయి.
 వీటన్నింటితో పాటు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆయా వస్తువుల్ని వాషర్‌లో వేసే ముందు వాటి లేబుల్‌ని పరిశీలించడం మంచిది. అలాగే మీరు ఉపయోగించే వాషర్‌లో ఆయా వస్తువులు శుభ్రం చేసే ఫీచర్లు ఉన్నాయో, లేదో ముందే చూసుకోవడం మర్చిపోవద్దు. తద్వారా ఆయా వస్తువులు, వాషర్‌.. రెండూ పాడవకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్