వీటిని ఎక్కువ మొత్తంలో కొంటున్నారా..?

చాలామంది మహిళలు షాపింగ్‌కి వెళ్లాం కదా అని ఇంటికి అవసరమయ్యే కొన్ని వస్తువులను అధిక మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాలను ఇలా అధిక మొత్తంలో కొనకూడదని....

Updated : 03 Dec 2022 20:02 IST

చాలామంది మహిళలు షాపింగ్‌కి వెళ్లాం కదా అని ఇంటికి అవసరమయ్యే కొన్ని వస్తువులను అధిక మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాలను ఇలా అధిక మొత్తంలో కొనకూడదని సూచిస్తున్నారు కూడా! ఇంతకీ ఆ పదార్థాలేంటి? ఎందుకు వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయకూడదు? .. మొదలైన ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే..

ఆహారపదార్థాలు నిల్వ ఉండే వ్యవధిని బట్టి వాటిని ఎంత పరిమాణంలో మనం కొనుగోలు చేయచ్చో నిర్ణయించుకోవాలి.

బ్రౌన్‌రైస్..

మనం సాధారణంగా ఉపయోగించే బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ చాలా తక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయని చెప్పచ్చు. ఇవి కేవలం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మాత్రమే ఉపయోగించడానికి అనువుగా ఉంటాయి. ఆ తర్వాత వీటిలో ఉండే సహజసిద్ధమైన నూనెల మొత్తం తగ్గిపోతుంది. అలాగే ఇవి నిల్వ ఉండేందుకు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగించరు కాబట్టి ఈ రైస్ తక్కువ రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. అందుకే వీటిని కేవలం అవసరమైనంత పరిమాణం మేరకు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. తద్వారా ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చన్నది నిపుణుల సూచన.

ఓట్స్..

సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఓట్స్ ఒకటి నుంచి రెండేళ్ల వరకు నిల్వ ఉంటాయి. అంతమాత్రాన ఒకేసారి వీటిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసిన ఓట్స్ ఉపయోగించడం సరికాదు.. పైగా అవి ముతకగా తయారై వాటి రుచిని కోల్పోతాయి కూడా..! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఈ రెండూ మనం సొంతం చేసుకోవాలంటే తక్కువ పరిమాణాల్లో ఎప్పటికప్పుడు వీటిని కొనుగోలు చేయడం మంచిది.

బ్రెడ్, బేకరీ ఉత్పత్తులు..

బేకరీలో అడుగుపెట్టగానే రకరకాల బిస్కట్స్, బ్రెడ్.. వంటివి మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే వీటిని కూడా అవసరం మేరకు మాత్రమే ఎప్పటికప్పుడు ఖరీదు చేయడం మంచిది. సాధారణంగా బ్రెడ్‌కి గాలి తగిలితే అది గట్టిగా మారిపోతుంది.. పైగా బేకరీ ఉత్పత్తుల నిల్వ వ్యవధి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తరహా ఆహారపదార్థాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం కంటే ఎప్పటికప్పుడు తక్కువ మొత్తాల్లో కొనుక్కొని వాటి రుచిని ఆస్వాదించడం మేలు.

నట్స్..

ఆరోగ్యానికి మంచివనో లేక వంటల్లో ఉపయోగించవచ్చనో చాలామంది నట్స్, డ్రైఫ్రూట్స్ కూడా అధిక మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ వీటిలో ఉండే సహజసిద్ధమైన నూనెలు, అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. అందుకే వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసి మూత గట్టిగా పెట్టి, గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో భద్రపరచాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అవి దాదాపు రెండు నెలల వరకు తాజాగా ఉంటాయి. ఒకవేళ మరీ ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తే మాత్రం వాటిని గాలి ప్రసరించని సీసాలో వేసి ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో భద్రపరిస్తే సరి. ఏడాది పాటు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది. అంతకుమించి మాత్రం ఇవి నిల్వ ఉండవు. కాబట్టి వీటిని కూడా తక్కువ పరిమాణాల్లోనే ఎప్పటికప్పుడు కొని తెచ్చుకోవడం ఉత్తమం.

మసాలా సామగ్రి..

మసాలా సామగ్రి పాడవుతుందా అని ఆలోచిస్తున్నారా? అవి అంత త్వరగా పాడవ్వకపోవచ్చు.. కానీ అవి వాటిలో ఉన్న ఘాటుదనం మాత్రం కోల్పోతాయి. అధిక మొత్తంలో కొనుగోలు చేసిన మసాలా సామగ్రి సుమారు ఆరు నెలల పాటు తాజాగానే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం వాటిని ఉపయోగించినా రుచి మాత్రం అంతగా ఉండదు. నిల్వ వ్యవధి పెరిగే కొద్దీ వాటిలోని ఘాటుదనం తగ్గిపోవడమే దానికి కారణం. అందుకే మసాలా సామగ్రిని కూడా ఎప్పటికప్పుడు తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడమే మంచిది.


ఈ పదార్థాలు కూడా..

⚜ కాఫీ గింజలు/ పొడి కొనుగోలు చేసిన 15 రోజుల వరకు మాత్రమే రుచికరంగా ఉంటాయట! ఆ తర్వాత గింజలు/ పొడిలో ఉండే తాజాదనం తగ్గడం వల్ల రుచి కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందట!

⚜ కెచప్, మయోనైజ్.. వంటి వాటిలో ప్రిజర్వేటివ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అనుకుంటే పొరపడినట్లే! ఇవి కూడా ఎప్పటికప్పుడు తక్కువ పరిమాణంలో ఖరీదు చేస్తేనే మంచిది.

⚜ క్యాన్డ్ ఫుడ్స్.. సాధారణంగా వీటి నిల్వ వ్యవధి కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ఒక్కసారి ఆ క్యాన్‌ని తెరిస్తే వీలైనంత త్వరగా దాన్ని ఖాళీ చేయడం మంచిది. ఎందుకంటే అది సీల్ చేసిన క్యాన్‌లో నిల్వ ఉన్నంత వరకు మాత్రమే రుచిగా, తాజాగా ఉంటుంది. ఒక్కసారి ఆ క్యాన్ తెరచిన వెంటనే దాని తాజాదనాన్ని కోల్పోయి, త్వరగా పాడైపోయే అవకాశాలుంటాయి.

⚜ గుడ్లు, వంట చేసేందుకు ఉపయోగించే నూనెలు, మైదా, వరిపిండి, గోధుమ పిండి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే పదార్థాలు.. మొదలైనవి కూడా తక్కువ పరిమాణంలో ఎప్పటికప్పుడు తాజాగా కొనుగోలు చేయడమే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్