ఆ దిండ్లు.. ఇలా శుభ్రం..!

దిండు కవర్లను వారం లేదా పదిహేను రోజులకోసారి మార్చుతూ.. వాటిని శుభ్రపరచడం చాలామందికి అలవాటే! వీటి సంగతి సరే గానీ.. కవర్‌ తొలగించలేని దిండ్లు/కుషన్ల సంగతేంటి? మన చర్మంలోని చెమట, జిడ్డుదనం, మేకప్‌ అవశేషాలు.. వంటివన్నీ వాటిపైనా చేరి.. క్రిములు, బ్యాక్టీరియాకు ఆవాసంగా మారతాయి.

Published : 01 Mar 2024 21:48 IST

దిండు కవర్లను వారం లేదా పదిహేను రోజులకోసారి మార్చుతూ.. వాటిని శుభ్రపరచడం చాలామందికి అలవాటే! వీటి సంగతి సరే గానీ.. కవర్‌ తొలగించలేని దిండ్లు/కుషన్ల సంగతేంటి? మన చర్మంలోని చెమట, జిడ్డుదనం, మేకప్‌ అవశేషాలు.. వంటివన్నీ వాటిపైనా చేరి.. క్రిములు, బ్యాక్టీరియాకు ఆవాసంగా మారతాయి. పైగా వాటిపై చెమట, జిడ్డు మరకలు కూడా పడుతుంటాయి. అందుకే ఇలాంటి దిండ్లను శుభ్రం చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులున్నాయంటున్నారు నిపుణులు.

అయితే అందులోనూ స్పాంజ్‌, ఇతర మెటీరియల్స్‌తో తయారుచేసిన దిండ్లను చేత్తో లేదంటే వాషింగ్‌ మెషీన్‌లోనైనా ఉతికేయచ్చు.. అదే దూది దిండ్లకు తేమ తగిలితే అవి వెంటనే పాడైపోతాయి. కాబట్టి ఇలాంటి దిండ్ల విషయంలోనూ ఈ ప్రత్యేకమైన క్లీనింగ్‌ పద్ధతులు ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.

వ్యాక్యూమ్ క్లీనర్‌తో..!

దిండుపై పడుకున్నప్పుడు మన చర్మం, జుట్టులోని జిడ్డుదనం, చెమట దిండు కవర్‌తో పాటు దిండుకు కూడా అంటుకుపోతుంది. దాన్నలాగే కొన్ని రోజుల పాటు వదిలేస్తే.. దుమ్ము, ధూళి చేరి అక్కడ ఓ మరకలాగా ఏర్పడుతుంది.. పైగా దాన్నుంచి అదో రకమైన వాసన కూడా వస్తుంటుంది. ఇలా జరగకుండా దిండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే దిండ్ల కవర్లను శుభ్రం చేసిన ప్రతిసారీ దిండ్లను కూడా క్లీన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వ్యాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించచ్చు. ఇది దుమ్ము, ధూళి, జిడ్డుదనం, ఇతర అవశేషాల్ని ఆకర్షిస్తుంది. ఇక మరకను తొలగించడానికి డిటర్జెంట్ కలిపిన నీళ్లలో కాటన్‌ క్లాత్‌ని ముంచి, బాగా పిండి మరకపై రుద్దుతూ తుడవాలి. ఆపై ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని దిండుపై స్ప్రే చేస్తే.. అది పూర్తిగా శుభ్రపడుతుంది.. చక్కటి పరిమళాల్నీ వెదజల్లుతుంది.

‘స్టీమ్‌’ క్లీనింగ్‌ తెలుసా?

నీటితో శుభ్రం చేయలేని దూది దిండ్లు/కుషన్స్‌, కవర్‌ తొలగించలేని దిండ్లను స్టీమ్‌ క్లీనింగ్‌ పద్ధతి ద్వారా శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు. వీటి నుంచి ఉత్పత్తయ్యే వేడి వల్ల దిండు పైకి చేరిన క్రిములు, బ్యాక్టీరియా.. వంటివి నశిస్తాయి. తద్వారా అది పూర్తిగా శానిటైజ్‌ అవుతుంది. అలాగే ఈ వేడి వల్ల చెమట, జిడ్డుదనం కారణంగా వెలువడే దుర్వాసనలు కూడా తొలగిపోతాయి. అయితే దీన్ని వాడే క్రమంలో ఎంత వేడిని సెట్‌ చేసుకోవాలి? ఉపయోగించే విధానం.. వంటివన్నీ హ్యాండ్‌బుక్‌ చదివి తెలుసుకొని ఫాలో అవడం ముఖ్యం.

మరకల్ని తొలగించడానికి..!

దిండ్లపై చెమట, జిడ్డుతో పాటు ఇతర మరకలు పడడం సహజమే! అయితే వీటిని తొలగించడానికి సహజసిద్ధంగా లభించే కొన్ని క్లీనింగ్‌ ఉత్పత్తులు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

డిష్‌సోప్‌, వేడి నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమంలో పేపర్‌ టవల్‌ లేదా స్పాంజిని ముంచి.. దాంతో మరక ఉన్న చోట అప్లై చేయాలి. కాసేపటి తర్వాత పొడి గుడ్డతో తుడిచేస్తే ఫలితం ఉంటుంది.

వేడి నీళ్లు, బేకింగ్‌ సోడా దిండ్లపై పడిన జిడ్డు మరకల్ని సమర్థంగా తొలగిస్తాయి. ఈ మిశ్రమాన్ని మరక ఉన్న చోట అప్లై చేసి కాసేపు అలాగే వదిలేయాలి. తర్వాత పొడి గుడ్డతో తుడిస్తే మరక వదిలిపోవడం గమనించచ్చు.

అలాగే జిడ్డు మరకల్ని తొలగించడానికి కార్న్‌స్టార్చ్‌ని సైతం ఉపయోగించచ్చు. దీన్ని మరకపై చల్లి పావుగంట పాటు వదిలేయాలి. ఆపై కాస్త తడి చేసిన గుడ్డతో ఈ స్టార్చ్‌ని పూర్తిగా తొలగిస్తే సరిపోతుంది.

ఇక ఎలాంటి మరకనైనా తొలగించే శక్తి వెనిగర్‌కు ఉంది. వెనిగర్‌, నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమంతోనూ పైన చెప్పిన పద్ధతి మాదిరిగా దిండ్లపై పడిన మరకల్ని సులభంగా తొలగించచ్చు.

అలాగే దిండ్లపై పడిన సిరా మరకలు అంత త్వరగా వదిలిపోవు. అలాంటప్పుడు మరకపై రబ్బింగ్‌ ఆల్కహాల్‌ అప్లై చేసి కాసేపటి తర్వాత పొడి గుడ్డతో తుడిచేస్తే మరక తొలగిపోవడం గమనించచ్చు.

ఈ క్లీనింగ్‌ పద్ధతుల వల్ల దిండ్లపై పడిన మరకలు తొలగిపోవడమే కాదు.. వాటి రంగు వెలిసిపోకుండా, నాణ్యత తగ్గకుండానూ జాగ్రత్తపడచ్చు.

అలాగే అలంకరణలో భాగంగా ఉపయోగించే దిండ్లు/కుషన్లపై పడిన మరకల్ని తొలగించడానికి డ్రై క్లీనింగ్‌ పద్ధతిని ఆశ్రయించడం మంచిది.

ఇలా కూడా!

కవర్‌ తొలగించడానికి వీల్లేని కుషన్లు/దిండ్లను ఆరుబయట ఉంచి కర్రతో కొట్టాలి. తద్వారా వాటిలో చేరిన దుమ్ము-ధూళి వదిలిపోతాయి.

దిండ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ చెమట, వాతావరణంలోని తేమ వల్ల వాటిపై క్రిములు, బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు వాటిని రోజంతా ఎండలో ఆరబెట్టడం వల్ల తేమ తొలగిపోయి అవి శుభ్రపడతాయి. అలాగే వాటి నుంచి వచ్చే దుర్వాసనలు కూడా దూరమవుతాయి.

కుషన్లు/దిండ్లను వివిధ రకాల మెటీరియల్స్‌తో తయారుచేస్తారు. కాబట్టి వాటిని ఎలా శుభ్రపరచాలో తెలియాలంటే.. వాటికి అనుసంధానించి ఉన్న లేబుల్‌ చూస్తే అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్