వాడిపోయిన మొక్కకు జీవం పోస్తాయివి!

ఎంతో ఇష్టపడి మొక్కలు పెంచుకుంటాం.. వాటిని మన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. అలాంటిది ఒక్కోసారి మనం రోజుల తరబడి ఇంట్లో లేనప్పుడో లేదంటే సమయం దొరక్కపోవడం వల్లనో వాటి సంరక్షణ విషయంలో శ్రద్ధ చూపకపోవచ్చు.

Published : 14 Feb 2024 12:47 IST

ఎంతో ఇష్టపడి మొక్కలు పెంచుకుంటాం.. వాటిని మన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. అలాంటిది ఒక్కోసారి మనం రోజుల తరబడి ఇంట్లో లేనప్పుడో లేదంటే సమయం దొరక్కపోవడం వల్లనో వాటి సంరక్షణ విషయంలో శ్రద్ధ చూపకపోవచ్చు. దీనివల్ల అవి వాడిపోతుంటాయి. అయితే అలాంటి వాటికి తిరిగి జీవం పోయాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

⚛ బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని సంరక్షించుకోవచ్చన్న సంగతి తెలిసిందే! అయితే ఇవే నీటితో వాడిపోయిన మొక్కల్నీ తిరిగి పునరుత్తేజితం చేయచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బియ్యం కడిగిన నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకొని.. రోజుకోసారి మొక్కలపై, వాటి మొదళ్లపై స్ప్రే చేయాలి. వీటిలో ఉండే స్టార్చ్‌ మొక్కలకు దివ్యౌషధంలా పనిచేసి వాటికి తిరిగి జీవం పోస్తుంది.

⚛ వాడిపోయిన మొక్కల్ని పునరుత్తేజితం చేయడంలో అరటి పండు తొక్కలూ దోహదం చేస్తాయట! ఇందుకోసం ఆ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గ్లాస్‌ జార్‌లో వేయాలి. అందులో లీటరు నీటిని నింపి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే నీటిని వడకట్టి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ నీటిని రోజుకోసారి లేదా రెండుసార్లు చొప్పున మొక్కలు, వాటి మొదళ్లపై స్ప్రే చేస్తే సత్ఫలితాలుంటాయి. వీటిలోని పొటాషియం మొక్కల్ని తిరిగి పునరుత్తేజితం చేయడంలో సహకరిస్తుంది.

⚛ ఒక స్ప్రే బాటిల్‌లో టేబుల్‌ స్పూన్‌ చక్కెర వేయాలి. అందులో నీళ్లు నింపి.. రాత్రంతా పక్కన పెట్టేయాలి. తద్వారా చక్కెర నీటిలో కలిసిపోతుంది. ఇప్పుడీ ద్రావణాన్ని మొక్కల ఆకులపై కొద్దిగా స్ప్రే చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లపై స్ప్రే చేయకపోవడమే మంచిదట! ఎందుకంటే ఇందులోని తియ్యదనం వల్ల కీటకాలు మొక్క ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయట! కాబట్టి కొద్ది మోతాదులో స్ప్రే చేస్తే వాటికి తక్షణ శక్తి అందుతుంది.. అవి పునరుత్తేజితమవుతాయి.

⚛ మొక్కలకు ఎక్కువ నీళ్లు పెట్టొద్దంటుంటారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ నీటితోనే వాడిపోయిన మొక్కలు పునరుత్తేజితమవుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బకెట్‌ నిండా నీళ్లు నింపి.. మొక్క కుండీని అందులో వేయాలి. కాసేపయ్యాక నీళ్ల స్థాయి తగ్గడం గమనించచ్చు. అప్పుడు కుండీని బయటికి తీసి ఎండలో కాసేపు ఉంచాలి. దీనివల్ల కూడా వాడిన మొక్కలు తిరిగి జీవం పోసుకుంటాయట!

⚛ మొక్కలకు తగినంత సూర్యరశ్మి అందకపోయినా వాటి ఆకులు పాలిపోయినట్లుగా తయారవుతాయి. కాబట్టి వాటిని సూర్యరశ్మి తగిలే చోట ఉంచితే ఫలితం ఉంటుంది.

⚛ మొక్కల్లో వాడిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది. ఫలితంగా వాటి ప్రభావం ఇతర ఆకులపై, మొక్కపై పడకుండా ఉంటుంది. వాడిపోయిన ఆకులు/పువ్వుల్ని తొలగించడం వల్ల కూడా మొక్కల్ని పునరుత్తేజితం చేయచ్చట!

⚛ కుండీ చిన్నగా ఉండి, కొన్ని మొక్కల వేర్లు ఎక్కువగా విస్తరించడం వల్ల వాటికి తగినంత పోషణ అందకపోవచ్చు. ఇలాంటప్పుడూ మొక్కలు వాడిపోతుంటాయి. కాబట్టి పాత కుండీని తొలగించి.. కాస్త పెద్దగా ఉండే కొత్త కుండీలో మొక్కను తిరిగి నాటితే ఫలితం ఉంటుంది.

⚛ నీటిలో ఉండే క్లోరైడ్‌, ఫ్లోరైడ్‌ వంటివి మొక్కల ఆరోగ్యానికి ప్రతిబంధకాలుగా మారతాయి. కాబట్టి ప్రత్యేకించి నిల్వ చేసిన వర్షపు నీరు, క్లోరైడ్‌/ఫ్లోరైడ్‌ రహిత నీటిని మాత్రమే మొక్కలకు ఉపయోగిస్తే అవి వాడిపోకుండా కాపాడుకోవచ్చు.

⚛ మొక్కలకు సహజ ఎరువులు వాడడం, వాటికి చీడపీడల బెడద లేకుండా చూసుకోవడమూ ముఖ్యమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్