Republic Day: ఇంటికి ‘మువ్వన్నెల’ హంగులు!

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా.. ఆయా అకేషన్‌ని ప్రతిబింబించేలా ఇంటిని శోభాయమానంగా అలంకరించడం ఈమధ్య కామనైపోయింది. గణతంత్ర దినోత్సవమూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ రోజు ఎక్కడ చూసినా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులే దర్శనమిస్తాయి.

Updated : 25 Jan 2024 13:26 IST

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా.. ఆయా అకేషన్‌ని ప్రతిబింబించేలా ఇంటిని శోభాయమానంగా అలంకరించడం ఈమధ్య కామనైపోయింది. గణతంత్ర దినోత్సవమూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ రోజు ఎక్కడ చూసినా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులే దర్శనమిస్తాయి. వీటిని ఇంటి అలంకరణలోనూ మేళవిస్తే ఇంట్లో గణతంత్ర కళ ఉట్టిపడుతుంది. మరి, ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశభక్తి ఉట్టిపడేలా ఇంటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందాం రండి..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆఫీస్‌లు, ఇతర పని ప్రదేశాలు, వీధులు మువ్వన్నెలతో కళకళలాడిపోతాయి. అయితే ప్రతి సందర్భంలోనూ ఇంటి అలంకరణకు ప్రాధాన్యమిచ్చే మగువలు.. ఈ మూడు రంగులతో ఇంటినీ అలంకరించడానికి ఆసక్తి చూపుతున్నారు. తద్వారా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ అలంకరణ చిట్కాలు..

⚛ అకేషన్‌ ఏదైనా ఇంటి ముంగిలిని రంగురంగుల ముగ్గులతో నింపేస్తుంటాం. అయితే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉపయోగిస్తూ అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దచ్చు. అలాగే జెండా, భారతదేశ పటం.. వంటివీ రంగవల్లికకు ఇరువైపులా గీసి మూడు రంగులతో అలంకరించచ్చు. ఓపిక, సమయం ఉంటే స్వాతంత్ర సమరయోధుల చిత్రాలూ ముగ్గు రూపంలో తీర్చిదిద్దచ్చు. ఇదంతా కుదరదనుకున్న వారు రెడీమేడ్‌గా దొరికే రంగోలీ షో పీస్‌లను ముంగిట్లో అలంకరించుకోవచ్చు.

⚛ ముగ్గు తర్వాత మనం ఆసక్తి చూపేది గుమ్మాలకు వేలాడదీసే తోరణాలు. ఈ క్రమంలోనూ మూడు రంగుల పువ్వుల్ని నిర్ణీత దూరాల్లో గుచ్చి గుమ్మాలకు వేలాడదీయచ్చు.. లేదంటే ఒక్కో రంగుతో కూడిన పూలదండను ఒక దాని కింద/తర్వాత మరొకటి వేలాడదీసినా త్రివర్ణ రూపమొస్తుంది.

⚛ రిపబ్లిక్‌ డే, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా చిన్న చిన్న పేపర్‌ జెండాల్ని దుస్తులపై ధరిస్తుంటాం. అయితే వీటినీ ఇంటి అలంకరణలోనూ భాగం చేయచ్చు. ఈ క్రమంలో ఈ పేపర్‌ ఫ్లాగ్స్‌ని ఇంటి గుమ్మానికి, హాల్‌/బెడ్‌రూమ్‌ గోడలకు, గృహాలంకరణ వస్తువులకు, విండ్‌ఛైమ్స్‌ చివర్లలో.. ఇలా నచ్చిన చోట అతికించేస్తే ఇల్లంతా మువ్వన్నెలతో కళకళలాడిపోతుంది.

⚛ చాలామంది పేపర్‌ క్రాఫ్ట్స్‌ తయారు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇదే ఆసక్తిని రిపబ్లిక్‌ డే ఇంటి అలంకరణలోనూ చూపించచ్చు. మూడు రంగుల క్రాఫ్ట్‌ పేపర్లతో వివిధ రకాల పువ్వులు, వాల్‌ హ్యాంగింగ్స్‌, డ్రీమ్‌ క్యాచర్స్‌, పక్షులు.. వంటివి తయారుచేసి అక్కడక్కడా గోడలకు వేలాడదీయచ్చు. ఇక మన జాతీయ పక్షి నెమలిని కూడా మువ్వన్నెల్లో పేపర్‌ క్రాఫ్ట్స్‌ రూపంలో తీర్చిదిద్ది.. ఇంట్లో ఒక చోట అమర్చుకోవచ్చు. మనలోని సృజనకు పదును పెడితే ఇలాంటి ఐడియాలు బోలెడొస్తాయి. ఇంకా ఇలాంటి ఐడియాలు కావాలంటే యూట్యూబ్‌ వీడియోలు ఉండనే ఉన్నాయి.

⚛ ప్రస్తుతం ‘ట్రై కలర్‌ రిబ్బన్‌ రోప్స్‌’ విభిన్న డిజైన్లలో మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని గుమ్మాలకు ఇరువైపులా లేదంటే హాల్లో గోడలకు వేలాడదీస్తే ఇల్లంతా మువ్వన్నెలతో కళగా కనిపిస్తుంది.

⚛ పుట్టినరోజు, పెళ్లిరోజులు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇంటి అలంకరణలో బెలూన్లకూ ప్రాధాన్యమిస్తుంటాం. అలాగే రిపబ్లిక్‌ డే సందర్భంగా మూడు రంగుల బెలూన్లతో ఇంటిని అలంకరించచ్చు. ఈ క్రమంలో సీలింగ్‌కి హీలియం బెలూన్లను వేలాడదీయడం, మువ్వన్నెల బెలూన్ల గుత్తుల్ని గోడలకు అక్కడక్కడా వేలాడదీయడం, గుమ్మం వద్ద బెలూన్ల ఆర్చ్‌ని ఏర్పాటుచేయడం.. వంటివి చేయచ్చు. ఈసారి 75వ గణతంత్ర దినోత్సవం కాబట్టి.. దాన్ని ప్రతిబింబించేలా బెలూన్లను 75 అనే అంకె మాదిరిగా డిజైన్‌ చేసి ఇంటి ముంగిట్లో లేదంటే ఇంట్లో ఏర్పాటుచేసినా లుక్‌ అదిరిపోతుంది.

⚛ ఇలా పగటి పూటే కాకుండా.. రాత్రుళ్లు కూడా ఇంటికి త్రివర్ణ శోభ తీసుకురావాలంటే మూడు రంగుల్లో ఉన్న ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేయచ్చు. వీటిని ఇంటి గుమ్మాలకు, కిటికీ ఫ్రేమ్స్‌కి వేలాడదీయచ్చు.. లేదంటే జాతీయ పతాకం, జాతీయ చిహ్నం.. వంటివి ప్రతిబింబించేలా లైట్‌ ప్యాటర్న్స్‌ని ఏర్పాటుచేసుకున్నా శోభాయమానంగా కనిపిస్తుంది.

⚛ గృహాలంకరణలో భాగంగా ఇంటీరియర్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు కొందరుంటారు. అలాంటి వారు.. ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఈ రిపబ్లిక్‌ డేకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావచ్చు. ఈ క్రమంలో సోఫా కుషన్లు, బెడ్‌షీట్లు, కర్టెన్లు.. వంటివి మువ్వన్నెల్లో ఉండేలా శ్రద్ధ తీసుకోవచ్చు. అలాగే గోడలకు త్రివర్ణ పతాకంతో కూడిన వాల్‌ ఫ్రేమ్స్‌ ఏర్పాటుచేయచ్చు.

⚛ పచ్చదనం కూడా ఈ రోజుల్లో గృహాలంకరణలో ముఖ్య భాగమైంది. ఇలా పచ్చదనాన్ని కోరుకునే వారు ఇంట్లో మూడు రంగుల్లో ఉన్న పూల మొక్కలు, డెకరేటివ్‌ మొక్కల్ని వరుసగా పేర్చి.. ఇంటిని అందంగా, శోభాయమానంగా అలంకరించచ్చు.

⚛ ఇంటిని సువాసనభరితం చేయడానికి చాలామంది సెంటెడ్‌ క్యాండిల్స్‌ని వాడుతుంటారు. వీటిలోనూ విభిన్నంగా ఉన్న వాటిని ఎంచుకొని ఇంటికి కళ తీసుకురావాలని అనుకునే వారూ లేకపోలేదు. అలాంటి వారు ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా ట్రై కలర్‌ క్యాండిల్స్‌ని ఎంచుకోవచ్చు.

ఇలా ఆలోచిస్తే.. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటిని మువ్వన్నెల రంగుల్లో అలంకరించడానికి ఇంకా బోలెడన్ని ఐడియాలు దొరుకుతాయి. కావాలంటే ఇంటి అలంకరణకు సంబంధించిన ఇలాంటి సృజనాత్మక ఆలోచనల కోసం యూట్యూబ్‌ వీడియోల్ని కూడా ఫాలో అవ్వచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్