పోహా.. కాంచీపురం.. ఈ ఇడ్లీలు ఎప్పుడైనా ట్రై చేశారా?

చూడగానే చందమామని ప్లేట్లో పెట్టినట్టు, తుంచగానే దూదిపింజను తాకినట్టు.. ఇక నోట్లో పడగానే వెన్నలా కరిగిపోయేదేంటని అడిగితే 'ఇడ్లీ..!' అని చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. కర్ణాటకలో పుట్టిన ఇడ్లీ.. తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొంది, తెలుగువారికీ....

Updated : 30 Mar 2023 20:36 IST

చూడగానే చందమామని ప్లేట్లో పెట్టినట్టు, తుంచగానే దూదిపింజను తాకినట్టు.. ఇక నోట్లో పడగానే వెన్నలా కరిగిపోయేదేంటని అడిగితే 'ఇడ్లీ..!' అని చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. కర్ణాటకలో పుట్టిన ఇడ్లీ.. తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొంది, తెలుగువారికీ తెగ నచ్చేసింది. రుచికరంగా ఉండడమే  కాదు.. తేలిగ్గా అరుగుతూ, ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఇడ్లీలలో ఎన్నో రకాలున్నాయి. ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ (మార్చి ౩౦) సందర్భంగా కొన్ని వెరైటీ ఇడ్లీ రెసిపీస్‌ను మీరూ ప్రయత్నించండి.

పోహా ఇడ్లీ

కావాల్సినవి

లావు అటుకులు - ఒక కప్పు

బియ్యపు రవ్వ/ ఇడ్లీ రవ్వ - ఒకటిన్నర కప్పు

పుల్లటి పెరుగు - 2 కప్పులు

బేకింగ్ సోడా - చిటికెడు

నీరు - తగినంత

ఉప్పు - తగినంత

నూనె - ఇడ్లీ పాత్రకు రాయడానికి తగినంత

తయారీ

శుభ్రం చేసుకున్న అటుకులను ఒక కప్పు పుల్లటి పెరుగులో 15 నిమిషాలు నానబెట్టాలి.

స్పూన్ లేదా ఫోర్క్‌తో అటుకులను మెత్తగా మెదపాలి.

తర్వాత ఇందులో ఇడ్లీ రవ్వ, ఒక కప్పు పెరుగు, కాసిన్ని నీళ్లు కలిపి, మరో 15 నిమిషాలు నానబెట్టాలి.

ఇడ్లీలు తయారు చేసుకోడానికి వీలుగా నీళ్లు పోస్తూ పిండిని కలపాలి.

ఈ పిండిలో కాస్త ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, చివరగా ఇడ్లీ పాత్రకు నూనె రాసి, ఇడ్లీలు పెట్టుకోవాలి.

8-10 నిమిషాల తర్వాత స్టౌ ఆపేసి, ఐదు నిమిషాల తర్వాత ఈ ఇన్‌స్టంట్ పోహా ఇడ్లీలను వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు.


స్టఫ్డ్ ఇడ్లీ

కావాల్సినవి

ఇడ్లీ పిండి కోసం:

వేయించిన ఇడ్లీ రవ్వ - 1 కప్పు

పెరుగు - ఒక కప్పు

ఉప్పు - తగినంత

బేకింగ్ సోడా - చిటికెడు

నీరు - తగినంత

స్టఫింగ్ కోసం:

ఉడకబెట్టిన బంగాళాదుంపలు - 3

సన్నగా తరిగిన ఉల్లిపాయ - ఒకటి

సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను

పసుపు - చిటికెడు

కరివేపాకు - రెండు రెబ్బలు

కొత్తిమీర - కొద్దిగా

ఆవాలు - తాలింపుకి సరిపడా

జీలకర్ర - తాలింపుకి సరిపడా

ఇంగువ - చిటికెడు

ఉప్పు - తగినంత

నూనె - తాలింపుకి సరిపడా

తయారీ

స్టఫ్ తయారీ

బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువతో తాలింపు వేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి, రంగు మారే వరకూ వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో పసుపు, ఉప్పు కలిపి.. చివరగా మెదిపిన బంగాళాదుంపలను వేసి కలపాలి.

ఇది ముద్దలా తయారవగానే స్టౌ మీది నుంచి దించి చల్లారనివ్వాలి. తర్వాత ఈ స్టఫ్‌ను ప్యాటీలుగా/ కట్‌లెట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇడ్లీ తయారీ

ఒక పెద్ద బౌల్‌లో కప్పు వేయించిన రవ్వ, కప్పు పెరుగు, పావుకప్పు నీళ్లు తీసుకొని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.

ఈ పిండిని అరగంట నానబెట్టాలి.

ఆ తర్వాత ఈ పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి.

ఇప్పుడు ఇడ్లీ పాత్రకు నూనె రాసి సిద్ధం చేసుకోవాలి.

ఇడ్లీ పాత్రలో ప్రతి మౌల్డ్‌లో ఒక టేబుల్‌స్పూన్ చొప్పున పిండిని వేసుకోవాలి.

ప్యాటీలుగా చేసిన స్టఫ్‌ను ఈ పిండిపై పెట్టుకోవాలి.

వీటిపై నుంచి మరో టేబుల్‌స్పూన్ పిండి పోయాలి.

పది పన్నెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టౌ ఆపి ఐదు నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. ఆపై వేడి వేడి స్టఫ్డ్ ఇడ్లీలు సర్వ్ చేసుకోవడానికి సిద్ధం..!


కాంచీపురం ఇడ్లీ

కావాల్సినవి

చదరంగా కట్ చేసిన అరటి ఆకులు - ఇడ్లీలను బట్టి

శెనగపప్పు - ఒక టేబుల్‌స్పూను

శొంఠి పొడి (ఎండిన అల్లం పొడి) - పావు టీస్పూను

పిండి కోసం:

బియ్యం - ఒక కప్పు

మినప గుండ్లు - అర కప్పు

మెంతులు - ఒక టీస్పూను

తాలింపు కోసం:

నెయ్యి/ నూనె - తాలింపు కోసం సరిపడా

దంచిన మిరియాలు - అర టీస్పూను

దంచిన జీలకర్ర - అర టీస్పూను

ఆవాలు - పావు టీస్పూను

శెనగపప్పు- పావు స్పూను

జీడిపప్పు - పది పలుకులు

కరివేపాకు - రెండు రెబ్బలు

ఉప్పు - తగినంత

ఇంగువ - చిటికెడు

తయారీ

బియ్యం, మినప గుండ్లు శుభ్రం చేసుకుని, విడివిడిగా రాత్రంతా నానబెట్టాలి. మినప గుండ్లలోనే మెంతులు కూడా వేసుకోవాలి.

ముందుగా నానబెట్టిన మినపగుండ్లను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత బియ్యాన్ని నానబెట్టిన నీరు ఒంపేసి, కొద్ది కొద్దిగా నీరు చల్లుతూ రవ్వలా రుబ్బుకోవాలి.

ఈ రెండింటినీ కలిపి ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి.

ఇడ్లీలు పెట్టుకోవడానికి అరగంట ముందు శెనగపప్పును వేడినీటిలో నానబెట్టాలి.

బాణలిలో నెయ్యి/ నూనె వేసి అందులో ఆవాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, శెనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు వేసుకుని దోరగా వేగనివ్వాలి. చివరగా ఇంగువ వేయాలి.

ఈ తాలింపు, నానబెట్టుకున్న శెనగపప్పు, శొంఠి పొడి, ఇడ్లీ పిండిలో కలపాలి.

చదరంగా కట్ చేసుకున్న అరిటాకులకు నూనె రాసి, చిన్న స్టీలు కప్పులలో పెట్టుకోవాలి. ఈ అరిటాకులున్న కప్పులలో ఇడ్లీ పిండిని వేసుకుని, ఇడ్లీ పాత్రలో అమర్చుకోవాలి. వీటిని 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడకనివ్వాలి.

ఆపై పది నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర లోంచి కట్ చేయని అరిటాకుల్లోకి మారిస్తే నోరూరించే కాంచీపురం ఇడ్లీ రడీ..!


అన్నం ఇడ్లీ

కావాల్సినవి

అన్నం - ఒక కప్పు

పెరుగు - 3 కప్పులు

ఇడ్లీ రవ్వ - ఒక కప్పు

ఉప్పు - తగినంత

బేకింగ్ సోడా - చిటికెడు

తయారీ

అన్నం, ఒక కప్పు పెరుగు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

దీనికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ, రెండు కప్పుల పెరుగు కలిపి అరగంట పాటు నానబెట్టాలి.

ఆపై ఈ పిండిలో ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేయాలి.

కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ, ఇడ్లీలు తయారు చేయడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి.

ఇడ్లీ పాత్రకు నూనె రాసి, పిండిని అందులో వేసి ఆవిరిపై పది నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాలాగి అన్నంతో తయారైన మెత్తని ఇడ్లీలను సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్