పోషకాల దోసె!

పెసర పప్పు, పోహా అటుకులు... పోషక విలువలు పుష్కలంగా ఉన్న వీటితో వివిధ రకాల వంటకాలు చేస్తుంటాం. మరి, ఈ రెండింటినీ కలిపి ఎప్పుడైనా దోసె ట్రై చేశారా? అయితే ఇప్పుడు ట్రై చేసేయండి!

Published : 24 Nov 2023 20:01 IST

పెసర పప్పు, పోహా అటుకులు... పోషక విలువలు పుష్కలంగా ఉన్న వీటితో వివిధ రకాల వంటకాలు చేస్తుంటాం. మరి, ఈ రెండింటినీ కలిపి ఎప్పుడైనా దోసె ట్రై చేశారా? అయితే ఇప్పుడు ట్రై చేసేయండి!

ఆ శ్రమ లేకుండా!

సాధారణంగా దోసెలు తయారుచేసుకోవాలంటే ముందు రోజే రాత్రే పిండిని పులియబెట్టుకోవాలి. ఈ దోసెలకు ఆ అవసరం లేదు. అటుకులు, పెసరపప్పును గంటన్నర పాటు నీటిలో నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే చాలు. దోసెలు వేసేసుకోవచ్చు. ఇలా సులభంగా తయారుచేసుకునే ఈ దోసెలను బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు ఈవెనింగ్‌ స్నాక్స్‌, పార్టీ స్నాక్స్‌లలో కూడా భాగం చేసుకోవచ్చు. మరి ఈ సూపర్‌ హెల్దీ రెసిపీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

పోహా-మూంగ్ దాల్‌ దోసె

కావాల్సిన పదార్థాలు

పోహా అటుకులు - ఒక కప్పు

పెసర పప్పు - ముప్పావు కప్పు

మెంతులు - ఒక టీస్పూన్

తురిమిన కొబ్బరి - అర కప్పు

సన్నగా తరిగిన పచ్చి మిర్చి- ఒక టీస్పూన్

అల్లం - అర టీస్పూన్

కొత్తిమీర – పావు కప్పు

జీలకర్ర- అర టీస్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - తగినంత

తయారీ విధానం

ఒక బౌల్‌లో అటుకులు, పెసరపప్పు, మెంతులు వేసి గంటన్నర పాటు నీటిలో నానబెట్టాలి. గంటన్నర తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో తురిమిన కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరో బౌల్‌లోకి తీసుకొని అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు.. జత చేసి దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌ వేడి చేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. అనంతరం ముందుగా రడీ చేసుకున్న బ్యాటర్‌ను ప్యాన్‌పై పోసి దోసెలా పరచాలి. దోసె అంచుల చుట్టూ నెయ్యి వేసి మీడియం సైజు మంటపై ఇరువైపులా కాల్చుకోవాలి. ఇలా తయారైన దోసెల్ని కొబ్బరి చట్నీ/పల్లీల చట్నీ, సాంబార్‌తో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.

పోషకాలెన్నో!

ప్రొటీన్లతో నిండి ఉన్న పెసర పప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్‌ బి6.. వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక పోహా అటుకుల్లో క్యాలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్‌ గర్భిణులలో రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్