Twinkle Khanna: బుక్ షెల్ఫ్‌ని ఇలా అందంగా సర్దేయండి!
ఇంటిని అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇక ఇంట్లో తమకు నచ్చిన ప్రదేశాల్ని డెకరేట్ చేసుకునే క్రమంలో మరిన్ని హంగులద్దుతుంటారు అతివలు. బాలీవుడ్ అందాల తార ట్వింకిల్ ఖన్నా కూడా ఇదే చేసింది. స్వయానా పుస్తక ప్రియురాలైన ఆమె.. ఇంటీరియర్ డిజైనర్ కూడా! ఈ క్రమంలో తాను రాసిన, తనకు నచ్చిన...
(Photos: Instagram)
ఇంటిని అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇక ఇంట్లో తమకు నచ్చిన ప్రదేశాల్ని డెకరేట్ చేసుకునే క్రమంలో మరిన్ని హంగులద్దుతుంటారు అతివలు. బాలీవుడ్ అందాల తార ట్వింకిల్ ఖన్నా కూడా ఇదే చేసింది. స్వయానా పుస్తక ప్రియురాలైన ఆమె.. ఇంటీరియర్ డిజైనర్ కూడా! ఈ క్రమంలో తాను రాసిన, తనకు నచ్చిన పుస్తకాలతో.. ఇంట్లోనే ఓ మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసుకుంది. ఆ పుస్తకాలన్నీ బుక్ షెల్ఫ్‌లో ఆకర్షణీయంగా సర్దేసింది. అంతేకాదు.. ఆ చిట్కాల్నీ ఓ చిన్న వీడియో రూపంలో ఇన్‌స్టాలో పంచుకుంది కూడా! మరి, ఆ టిప్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
పుస్తకాలు అమర్చుకునే ర్యాక్ చిన్నదైనా, పెద్దదైనా.. దాన్ని నీట్‌గా సర్దుకున్నప్పుడే ఆ ప్రదేశం ఆకర్షణీయంగా కనిపిస్తుందంటోంది ట్వింకిల్. ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పంచుకుంది.
⚛ పుస్తకాల అర నీట్‌గా కనిపించాలంటే ముందు.. వాటిని ఆకృతి, పరిమాణం, రంగును బట్టి మూడు భాగాలు చేయాలి. ఆపై దేనికదే విడివిడి అరల్లో సర్దేయాలి.
⚛ పుస్తకాలన్నీ వరుసగా పేర్చడం కాకుండా.. మధ్యమధ్యలో కాస్త ఖాళీ స్థలం వదిలేయాలి. అక్కడ మీకొచ్చిన ప్రైజ్ షీల్డ్స్, మెమెంటోస్.. వంటివి అమర్చుకుంటే.. ర్యాక్ చిందరవందంగా లేకుండా అందంగా కనిపిస్తుంది.
⚛ ర్యాక్ చివర్లో చిన్న చిన్న కళాఖండాలతో అలంకరిస్తే ఆ ప్రదేశానికే కొత్త కళ వస్తుంది.
⚛ పుస్తకాలన్నీ ఒకేలా సర్దడం కాకుండా.. కొన్ని నిలబెట్టడం, మరికొన్ని ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా అమర్చితే ర్యాక్ అందం ఇనుమడిస్తుంది. ఈ క్రమంలో ఒక అర అలా, మరో అర ఇలా.. లేదంటే ఒకే అరలో కొన్ని పుస్తకాలు నిలబెట్టి, మరికొన్ని పేర్చినా అందంగానే కనిపిస్తుంది.
⚛ పుస్తకాల మధ్యలో, అరల చివర్లలోనే కాదు.. పేర్చిన పుస్తకాల పైనా చిన్న చిన్న కళాఖండాలు అమర్చుకోవచ్చు.
⚛ పచ్చటి మొక్కలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. కాబట్టి వాటికీ బుక్ షెల్ఫ్‌లో చోటు కల్పించండి. పుస్తకాల అర చివర్లో ఓ చిన్న ఇండోర్ ప్లాంట్ కుండీని అమర్చడం.. ర్యాక్‌కు బోర్డర్‌లా పూలు, లతలతో కూడిన తీగను వేలాడదీయడం.. ఇలా ఎవరి క్రియేటివిటీ వారిది!
⚛ పుస్తకాలు ఎక్కువగా కనిపించినా చిందరవందరగా ఉంటుందనుకునే వారు.. కొన్ని పుస్తకాల్ని బుట్టల్లో అమర్చుకొని డ్రా/స్లైడ్ మాదిరిగా ర్యాక్‌కు సెట్ చేసుకోవచ్చు.
⚛ సెరామిక్ వస్తువులు ఇంటికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. అలాంటి ఇంటీరియర్ పీసెస్‌తోనూ పుస్తకాల ర్యాక్‌కు అదనపు హంగులద్దచ్చు.
⚛ ఇక ఆఖర్లో ఆ పుస్తకాల ర్యాక్ పక్కనున్న గోడకు ఓ అందమైన పెయింటింగ్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు.. లేదంటే మెదడుకు పదును పెట్టే ఆర్ట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు. తద్వారా ఆ ప్రదేశం నీట్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.. అక్కడి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.