ఈ ఉగాది కోసం.. ప్రత్యేకంగా..!

జీవితమంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. తీపి, చేదు, వగరు, పులుపు... ఇలా జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించడం మనందరికీ అలవాటే.

Published : 08 Apr 2024 20:02 IST

జీవితమంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. తీపి, చేదు, వగరు, పులుపు... ఇలా జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించడం మనందరికీ అలవాటే. మరి ఉగాదిని మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు మీరూ సిద్ధమయ్యారా? ఈ శుభవేళ మనవైన సంప్రదాయ రుచులతో మీ ఇంటిల్లిపాదికీ విందు చేయండి..

శెన్గ హోళిగె

కావాల్సినవి

⚛ గోధుమ పిండి- రెండు కప్పులు

⚛ నూనె/నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు

⚛ ఉప్పు - చిటికెడు

⚛ పల్లీలు - ఒక కప్పు

⚛ నువ్వులు - పావు కప్పు

⚛ గసగసాలు - రెండు టీస్పూన్లు

⚛ తురిమిన బెల్లం- ముప్పావు కప్పు

⚛ యాలకుల పొడి- పావు టీస్పూను

తయారీ

⚛ గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల నూనె/నెయ్యి వేసి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. చపాతీ పిండిలా కలుపుకోవాలి. పైన నూనె/ నెయ్యి రాసి మూతపెట్టి అరగంట పాటు నానబెట్టాలి.

⚛ బాణలిలో పల్లీలు, నువ్వులు, గసగసాలు విడివిడిగా వేయించుకోవాలి.

⚛ వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి, బాగా కలిసే వరకూ మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.

⚛ కొద్దిగా పాలు పోసి, ఈ పిండిని గుండ్రటి ముద్దలుగా చేసుకోవాలి.

⚛ గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతి వెడల్పున ఒత్తుకోవాలి.

⚛ వీటిలో పల్లీ పొడి ముద్దలను స్టఫ్ చేసి, అంచులను మూయాలి.

⚛ వేళ్లకు నెయ్యి/ నూనె రాసుకుంటూ ఈ ఉండలను గుండ్రంగా ఒత్తుకోవాలి.

⚛ స్టౌ మీడియం మంటపై ఉంచి వీటిని నూనె/నెయ్యితో కాల్చుకోవాలి.

రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే పల్లీ బొబ్బట్లు సిద్ధం! కర్ణాటకలో ‘శెన్గ హోళిగె’ పేరుతో పిలిచే ఈ ప్రత్యేక వంటకాన్ని అక్కడి వారు పండగల సందర్భంలో తయారుచేసుకుంటారు.


గసగసాల పాయసం..

కావాల్సినవి

⚛ గసగసాలు- పావు కప్పు

⚛ పచ్చి కొబ్బరి తురుము- ముప్పావు కప్పు

⚛ తురిమిన బెల్లం- అర కప్పు

⚛ సన్నగా కట్ చేసుకున్న డ్రైఫూట్స్ - పావు కప్పు

⚛ యాలకులు - ఒకటి లేదా రెండు

⚛ నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు

తయారీ

⚛ బాణలిలో టీస్పూన్ నెయ్యి వెసి, గసగసాలు కాస్త రంగు మారే వరకూ వేయించాలి. వేగిన గసగసాలను పక్కకు తీసి, అదే బాణలిలో డ్రైఫ్రూట్స్ వేయించుకోవాలి. గార్నిష్ కోసం ఒక టీస్పూన్‌ డ్రైఫ్రూట్స్‌ని పక్కన పెట్టుకోవాలి.

⚛ వేయించిన గసగసాలు, డ్రైఫ్రూట్స్‌ను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా మెదిగాక, ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

⚛ యాలకులను పొడిచేసి పెట్టుకోవాలి.

⚛ పావు కప్పు నీటిలో తురిమిన బెల్లాన్ని కలిపి, లేత పాకం రానివ్వాలి.

⚛ పాకం తయారవగానే ఇందులో గ్రైండ్ చేసుకున్న గసగసాల మిశ్రమం, యాలకుల పొడి, నెయ్యి వేసి చిక్కబడే వరకూ కలుపుతూ ఉండాలి.

⚛ ఆఖర్లో డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేస్తే.. వేడి వేడి గసగసాల పాయసం రడీ..!


అరటిపండు బోండా

కావాల్సినవి

⚛ అరటి పండు - ఒకటి

⚛ గోధుమపిండి - అర కప్పు

⚛ బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు

⚛ బెల్లం తురుము - అర కప్పు

⚛ యాలకుల పొడి - అర టీస్పూను

⚛ బేకింగ్ సోడా - ముప్పావు టీస్పూను

⚛ నూనె - వేయించడానికి సరిపడా

తయారీ

⚛ ముందుగా అరటిపండు, యాలకుల పొడి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

⚛ పావుకప్పు నీళ్లలో తురిమిన బెల్లం వేసి, కరిగే వరకూ కలుపుకోవాలి. దీన్ని పది నిమిషాలు స్టౌ మీద సన్నని మంటపై ఉంచి, లేత పాకం రానివ్వాలి. ఆపై చల్లార్చుకొని వడకట్టుకోవాలి.

⚛ ఇందులో గోధుమ పిండి, బేకింగ్ సోడా, బొంబాయి రవ్వ, అరటి పండు గుజ్జు వేసి బాగా కలుపుకొని గంటపాటు నానబెట్టాలి.

⚛ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ నూనెలో వేయించుకుంటే నోరూరించే బనానా బోండా రడీ..!


మామిడికాయ బజ్జీలు

కావాల్సినవి

⚛ బియ్యప్పిండి - కప్పు

⚛ శెనగ పిండి - ముప్పావు కప్పు

⚛ మామిడికాయ తురుము - అరకప్పు (కావాలంటే చిన్నచిన్న ముక్కలుగా కోసి కూడా వేసుకోవచ్చు)

⚛ ఉల్లిపాయలు - అరకప్పు (సన్నగా తరగాలి)

⚛ ఉల్లికాడలు - అరకప్పు (సన్నగా తరగాలి)

⚛ కొత్తిమీర - పావు కప్పు

⚛ చాట్ మసాలా - అర టీస్పూను

⚛ కరివేపాకు - టేబుల్‌స్పూను

⚛ పుదీనా - టేబుల్ స్పూను

⚛ అల్లం - అంగుళం ముక్క

⚛ వెల్లుల్లి - రెండు రెబ్బలు

⚛ జీలకర్ర పొడి - అర టీస్పూను

⚛ పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరగాలి)

⚛ బేకింగ్ సోడా - చిటికెడు

⚛ వాము - పావు టీస్పూను

⚛ నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా

⚛ ఉప్పు - తగినంత

తయారీ

ముందుగా అల్లం, వెల్లుల్లిని మెత్తని పేస్ట్‌లా చేసుకొని పెట్టుకోవాలి. ఆపై మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక బౌల్‌లో వేసి నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా జారుడుగా కలుపుకోవాలి. ఆ తర్వాత నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజులో బజ్జీల్లా వేసుకొని వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చిన తర్వాత దింపి సర్వ్ చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్