చపాతీ.. తింటున్నారా?

బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు. రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ తీసుకోవడం కూడా ఇలాంటిదే! అయితే రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

Published : 06 Apr 2024 11:32 IST

బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు. రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ తీసుకోవడం కూడా ఇలాంటిదే! అయితే రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందట! మరి, చపాతీలో దాగున్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

పోషకాల సమ్మేళనం!

⚛ చపాతీని పోషకాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందులో ‘బి’, ‘ఇ’ విటమిన్లతో పాటు కాపర్‌, జింక్‌, అయొడిన్‌, మాంగనీస్‌, సిలికాన్‌, పొటాషియం, క్యాల్షియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంటే.. ఇవన్నీ రోజువారీ శరీరానికి కావాల్సిన పోషకాలను కొద్ది మొత్తాల్లో భర్తీ చేస్తాయన్నమాట!

⚛ చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

⚛ బరువు తగ్గడానికీ ఇది మంచి ఆహారం అంటున్నారు నిపుణులు. అదెలాగంటే రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ఆకలేయకుండా, ఇతర చిరుతిళ్ల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఇతర పదార్థాలతో పోల్చితే ఇందులో క్యాలరీలూ తక్కువే! కాబట్టి నిశ్చింతగా బరువు తగ్గచ్చు.

⚛ చపాతీల్లో ఉండే అధిక ఐరన్‌ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి.

⚛ చపాతీల్లో ఉండే జింక్‌, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయట!

⚛ ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థకూ మంచిదే! అజీర్తి, గ్యాస్, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

⚛ చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్‌ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతుంది.

⚛ గుండె ఆరోగ్యానికీ చపాతీ మేలు చేస్తుందట! ఇందుకు దీనిలో అతి తక్కువ కొవ్వులుండడమే కారణమట! తద్వారా గుండెకు, ఇతర శరీర అవయవాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.


ఇలా చేసుకోవడం ఆరోగ్యదాయకం!

చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయంటున్నారు నిపుణులు. అందుకే వీలైనంత తక్కువ నెయ్యి/నూనెను వాడడం మంచిదంటున్నారు. అసలు ఈ రెండూ వాడకుండా పుల్కా చేసుకొని తింటే మరీ మంచిదట!

⚛ బయట దొరికే గోధుమపిండిలో మైదా కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ముడిగోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది.

⚛ చపాతీకి జతగా రోజూ పప్పు, బంగాళాదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.

⚛ బీన్స్‌, క్యారట్‌ ముక్కలు, పాలకూర.. వంటి వాటిని ఉడికించి.. గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో వేసి చపాతీ చేసుకుంటే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం!

⚛ గోధుమపిండికి రాగి పిండి, సోయాబీన్‌ పిండి, చిరుధాన్యాలతో తయారుచేసిన పిండి.. వంటివి కూడా కలుపుకొని చపాతీ తయారుచేసుకోవచ్చు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్‌ పిండిని కూడా వాడుకోవచ్చు. అయితే అందులో మైదా 0%గా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం లేబుల్‌ చూస్తే అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్