మొక్కలకు కాఫీ పిప్పి!

ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ బద్ధకాన్ని వదిలించుకొనే అలవాటున్న వారు చాలామందే ఉంటారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా కాఫీని ఆశ్రయించేవారు బోలెడంతమందే..! అయితే కాఫీ తాగడం వరకు సరే.. కానీ వాడేసిన కాఫీ పొడిని వృథాగా.......

Published : 24 Jun 2022 20:39 IST

ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ బద్ధకాన్ని వదిలించుకొనే అలవాటున్న వారు చాలామందే ఉంటారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా కాఫీని ఆశ్రయించేవారు బోలెడంతమందే..! అయితే కాఫీ తాగడం వరకు సరే.. కానీ వాడేసిన కాఫీ పొడిని వృథాగా పడేస్తూ ఉంటారు చాలామంది. ఈసారి మాత్రం అలా చేయకండి.. ఎందుకంటే కాఫీ పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు.

ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు చాలామంది. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల మొక్కలకే కాదు.. మన ఆరోగ్యానికీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం కాఫీ పిప్పి బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఎరువును తయారుచేయండిలా..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కూరగాయల్లో రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయనే ఉద్దేశంతో కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసుకొనేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి వారు వాడేసిన కాఫీ పొడితో తయారుచేసిన ఎరువును మొక్కలకు ఉపయోగించవచ్చు. కోడిగుడ్డు పెంకులను మెత్తగా చేసి ఒకసారి ఉపయోగించిన కాఫీ పిప్పిలో కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. అంతే.. కిచెన్ గార్డెన్‌కి కావాల్సిన ఎరువు తయారైపోతుంది. ఈ మిశ్రమం ద్వారా మొక్కలకు నత్రజని, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం.. వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

పురుగులు రాకుండా..

కిచెన్‌గార్డెన్‌లో పెంచే ఆకుకూరలకు పురుగుల వల్లే ఎక్కువ బెడద ఉంటుంది. ఇవి మొక్కల ఆకులను తినేస్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. చెంచా కాఫీ పిప్పిని లీటరు నీటిలో కలిపి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని మొక్కల ఆకులపై స్ప్రే చేస్తే సరిపోతుంది. కాఫీ పొడి వెదజల్లే వాసనకు కీటకాలు మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు.

అలాగే మొక్కలు బాగా పెరగడానికి కుండీల్లో నీరు పోస్తుంటాం. దీనివల్ల కుండీల్లోని మట్టి చల్లగా మారుతుంది. ఫలితంగా మొక్కల మొదళ్లలో చీమలు, ఇతర కీటకాలు చేరే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండటానికి ఎండబెట్టిన కాఫీ పిప్పిని మొక్క మొదళ్ల చుట్టూ వేస్తే సరిపోతుంది.

నీరు నిలిచి ఉండేలా..

మొక్కల సంరక్షణ విషయంలో నీటికే అధిక ప్రాధాన్యమిస్తుంటాం. అలాగని కుండీల్లో పెంచే మొక్కలకు రోజూ నీరు పోస్తే వాటి వేర్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ నీరు పోస్తే.. మొక్కలు వాడిపోయి జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. అందుకే తక్కువ నీరు పోసినప్పటికీ కుండీలోని మట్టిలో తేమ నిలిచి ఉండే ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ పనిని వాడేసిన కాఫీ పొడి సమర్థంగా నిర్వహిస్తుంది. దీనికోసం కుండీలో మొక్కను నాటేటప్పుడు నింపే మట్టిలో కాఫీ పిప్పిని కలిపితే సరిపోతుంది. ఇది నీటిని పీల్చుకొని తేమగా ఉంచడంతో పాటు ఎరువుగానూ ఉపయోగపడుతుంది.

పూలు విరబూయడానికి..

గులాబీ మొక్కలు ఏపుగా పెరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో పూలు చాలా తక్కువగా పూస్తాయి. అయితే కాఫీ పిప్పిని తరచూ గులాబీ మొక్కలకు ఎరువుగా వేయడం ద్వారా పూలు ఎక్కువగా పూయడంతో పాటు.. చాలారోజుల పాటు వాడిపోకుండా కూడా ఉంటాయి. గులాబీ మొక్కలకు మాత్రమే కాకుండా.. మల్లె, సన్నజాజి, బంతి.. వంటి ఇతర పూల మొక్కలకు సైతం కాఫీ పిప్పిని ఎరువుగా ఉపయోగించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్