కుంకుడు కాయలు.. తల స్నానానికే కాదు..!

ఒకప్పుడు తలస్నానం చేయడానికి కుంకుడు కాయలనే ఉపయోగించేవారు. అయితే మార్కెట్లోకి షాంపూలు అందుబాటులోకి వచ్చాక వాటి వాడకం బాగా తగ్గిపోయింది. అయితే కేవలం జుట్టును శుభ్రపరచుకోవడానికే కాకుండా ఇంట్లో ఇతరత్రా పనులకు కూడా కుంకుడు కాయల్ని ఉపయోగించవచ్చు.

Published : 06 Jan 2024 20:27 IST

ఒకప్పుడు తలస్నానం చేయడానికి కుంకుడు కాయలనే ఉపయోగించేవారు. అయితే మార్కెట్లోకి షాంపూలు అందుబాటులోకి వచ్చాక వాటి వాడకం బాగా తగ్గిపోయింది. అయితే కేవలం జుట్టును శుభ్రపరచుకోవడానికే కాకుండా ఇంట్లో ఇతరత్రా పనులకు కూడా కుంకుడు కాయల్ని ఉపయోగించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

లిక్విడ్ సోప్‌గా..

కప్పు నీటిలో రెండు కుంకుడు కాయలు వేసి అరగంట పాటు మరగబెట్టాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. దీనికి మీకు నచ్చిన ఫ్లేవర్‌ అరోమా ఆయిల్‌ని కొన్ని చుక్కలు వేసి కలుపుకోవాలి. అనంతరం శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టుకున్న బాటిల్‌లో ఈ మిశ్రమాన్ని పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని స్నానం చేసేటప్పుడు సబ్బుకి బదులుగా ఉపయోగించవచ్చు.

గ్లాస్ క్లీనర్‌గా..

కిటికీల అద్దాలను తుడవడానికి సాధారణంగా మార్కెట్లో దొరికే క్లీనింగ్ లిక్విడ్‌లను ఉపయోగిస్తాం. అయితే వీటికి బదులుగా కుంకుడు కాయలను ఉపయోగించి కూడా ఇంట్లోనే గ్లాస్‌క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికోసం కుంకుడు కాయలతో తయారుచేసుకున్న లిక్విడ్ సోప్ ఒక టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, అరకప్పు నీటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి బాగా షేక్ చేయాలి. అనంతరం దీన్ని కిటికీ అద్దంపై స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే కిటికీ అద్దాలపై పేరుకున్న దుమ్ము తొలగిపోయి అవి కొత్త వాటిలా మెరుస్తాయి.

పట్టు వస్త్రాలకు..

పట్టు, జరీ దుస్తుల్ని ఉతకడానికి కుంకుడు కాయలు చక్కటి ప్రత్యామ్నాయం. దీనికోసం కొన్ని కుంకుడు కాయలను చల్లటి నీటిలో నానబెట్టి వాటి రసాన్ని తీయాలి. ఈ మిశ్రమంతో పట్టు, జరీ వస్త్రాలను ఉతికితే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు రంగు వెలిసిపోకుండా జాగ్రత్తపడచ్చు. అంటే పట్టు, ఇతర సున్నితమైన వస్త్రాల్ని మనం ఎలాగైతే షాంపూ వాష్‌ చేస్తామో.. ఆ షాంపూకు బదులుగా ఈ సహజసిద్ధమైన షాంపూను ఉపయోగించచ్చన్నమాట!

కిచెన్ క్లీనర్‌గా..

అరకప్పు కుంకుడు కాయ రసానికి రెండు చెంచాల వైట్ వెనిగర్, కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి బాగా షేక్ చేసుకోవాలి. దీంతో కిచెన్ ప్లాట్‌ఫాం, వాష్‌బేసిన్ లాంటివి శుభ్రం చేసుకోవచ్చు. అలాగే దీన్ని బాత్‌రూం క్లీనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

నగలు శుభ్రపరచడానికి..

బంగారం, వెండితో తయారుచేసిన ఆభరణాలను, ఇతర వస్తువులను శుభ్రం చేయడానికి కూడా కుంకుడు కాయల్ని ఉపయోగించచ్చు. దీనికోసం కుంకుడుకాయ రసంలో వాటిని కాసేపు నానబెట్టాలి. అనంతరం మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే సరిపోతుంది. ఇది సహజసిద్ధమైన ఉత్పత్తి కాబట్టి ఇందులో రసాయనాలు ఉండవు. ఫలితంగా ఆభరణాల రంగు తగ్గిపోతుందన్న భయం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్