విరిగిన పాలతో ఇలా!

వేసవిలో వేడికి పదే పదే పాలు విరిగిపోవడం చూస్తుంటాం. అలాగని విరిగిన ప్రతిసారీ వాటిని బయటపడేయలేం.. కలాకండ్‌, పనీర్‌.. వంటివీ తరచూ చేసుకోలేం. అందుకే ఇవే కాకుండా.. ఈ విరిగిన పాలను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు.

Published : 15 Apr 2024 22:06 IST

వేసవిలో వేడికి పదే పదే పాలు విరిగిపోవడం చూస్తుంటాం. అలాగని విరిగిన ప్రతిసారీ వాటిని బయటపడేయలేం.. కలాకండ్‌, పనీర్‌.. వంటివీ తరచూ చేసుకోలేం. అందుకే ఇవే కాకుండా.. ఈ విరిగిన పాలను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం రండి..

⚛ బేకింగ్‌ మిశ్రమాన్ని కలిపే క్రమంలో పెరుగు, బటర్‌, క్రీమ్‌ వంటివి ఉపయోగించడం సహజమే. అయితే వీటికి బదులుగా విరిగిన పాలనూ వినియోగించచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెడ్‌, ప్యాన్‌కేక్స్‌, కేక్స్‌.. వంటి బేకింగ్‌ మిశ్రమాల తయారీలో ఈ పాలను ఉపయోగిస్తే అవి మరింత రుచికరంగా, పర్‌ఫెక్ట్‌గా వస్తాయంటున్నారు.

⚛ కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా చర్మం పొడిబారుతుంటుంది.. పొలుసులుగా ఊడిపోతుంది. ఇలాంటప్పుడు విరిగిన పాల మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా చర్మానికి మెరుపునూ అందిస్తుంది.

⚛ విరిగిన పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కలు ఏపుగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందుకే ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లలో, ముఖ్యంగా టొమాటో చెట్ల మొదళ్లలో వేస్తే ఆశించిన ఫలితం వస్తుంది.

⚛ విరిగిన పాలతో పెరుగూ తయారుచేసుకోవచ్చట. ఈ పాలను మరిగించి గోరువెచ్చగా మారాక.. ఇందులో రెండు టీస్పూన్ల పెరుగు వేస్తే.. కొన్ని గంటలకు గడ్డ పెరుగు తయారవుతుందట! మీరూ ఓసారి ట్రై చేయండి!

⚛ చికెన్‌, మటన్‌, చేపలు.. తదితర మాంసాహార వంటకాల తయారీలో పెరుగు, మజ్జిగను వాడుతుంటాం. అయితే వీటికి బదులుగా విరిగిన పాలతోనూ ఈ మాంసాన్ని మ్యారినేట్‌ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా వంటకాల రుచి ఇనుమడిస్తుందంటున్నారు.

⚛ కాయగూరలు, పండ్లతో తయారుచేసుకునే సలాడ్‌ డ్రస్సింగ్‌ కోసమూ ఈ విరిగిన పాలను ఉపయోగించచ్చట! తద్వారా వాటి రుచి పెరుగుతుంది.

⚛ కోడిగుడ్డుతో ఆమ్లెట్‌, పొరటు.. వంటివి తయారుచేసుకునేటప్పుడు ముందుగా గుడ్లను బీట్‌ చేస్తుంటాం. ఈ క్రమంలో కొన్ని విరిగిన పాలను వేసి బీట్‌ చేస్తే.. అవి మరింత రుచిగా వస్తాయట!

⚛ స్మూతీస్‌ తయారీలోనూ విరిగిన పాలను వాడడం వల్ల వాటి చిక్కదనం, రుచి.. రెండూ పెరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్