Summer: బట్టలు సర్దేటప్పుడు.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

ఇల్లంతా నీట్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతుంటాం.. అందుకు తగినట్లుగానే అందంగా సర్దుతుంటాం. కానీ బెడ్‌రూమ్‌లో ఉండే వార్డ్‌రోబ్‌ల దగ్గరికొచ్చేసరికి మాత్రం అశ్రద్ధ చేస్తుంటాం.. ఎందుకంటే అందులోని వస్తువులు, దుస్తులు బయటికి కనిపించవు కాబట్టి సర్దినా, సర్దకపోయినా ఒక్కటే అన్నది చాలామంది భావన.

Published : 14 Mar 2024 12:53 IST

ఇల్లంతా నీట్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతుంటాం.. అందుకు తగినట్లుగానే అందంగా సర్దుతుంటాం. కానీ బెడ్‌రూమ్‌లో ఉండే వార్డ్‌రోబ్‌ల దగ్గరికొచ్చేసరికి మాత్రం అశ్రద్ధ చేస్తుంటాం.. ఎందుకంటే అందులోని వస్తువులు, దుస్తులు బయటికి కనిపించవు కాబట్టి సర్దినా, సర్దకపోయినా ఒక్కటే అన్నది చాలామంది భావన. కానీ దీనివల్ల దుమ్ము, ధూళి, బూజు, సాలీడు పురుగులు.. వంటివి చేరే అవకాశాలున్నాయి. ఇవి దుస్తుల ద్వారా మన చర్మానికి అంటుకొని వివిధ రకాల అలర్జీలకు కారణమవుతాయి. పైగా ఈ వేసవిలో వార్డ్‌రోబ్‌, అందులో అమర్చే దుస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికుండే చెమట వాసన వల్ల లోపలి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అందుకే వేసవిలో దుస్తులు అమర్చే వార్డ్‌రోబ్‌ పరిశుభ్రత విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు.

వాటిని కాస్త ప్రత్యేకంగా!

రోజువారీ ధరించిన దుస్తుల్ని ఎప్పటికప్పుడు ఉతుక్కుంటాం.. కానీ ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ధరించే పట్టు చీరలు, డిజైనర్‌ దుస్తులు మాత్రం అల్మరాల్లో అలాగే భద్రపరుస్తుంటాం. నిజానికి ఇలా చేయడం వల్ల వాటికి అంటుకున్న చెమట, దుమ్ము-ధూళి, పరిమళాలు.. వంటి వాటి వల్ల కూడా వార్డ్‌రోబ్‌ నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆ దుస్తుల్ని అల్మరాలో పెట్టే ముందు నీడలో, గాలి బాగా తగిలే ప్రదేశంలో ఆరేయాలి. ఆపై ఒక శుభ్రమైన కాటన్‌ చీర లేదా వస్త్రంలో వాటిని చుట్టి అల్మరాలో పెట్టచ్చు.. లేదంటే సూట్‌కేస్‌లో సెపరేట్‌గా వాటిని భద్రపరచచ్చు.. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి కూడా! అలాగే అప్పుడప్పుడూ వాటిని డ్రై క్లీనింగ్‌ చేయించడం కూడా మర్చిపోవద్దు.

ఆ పురుగులు చేరకుండా..!

ఏ వస్తువైనా ఎక్కువ రోజుల పాటు దుమ్ము దులపకుండా అలాగే పెడితే వాటిపై బూజు పేరుకుపోతుంది. వార్డ్‌రోబ్‌ విషయంలోనూ అంతే! వాటిని ఎక్కువ కాలం పాటు శుభ్రం చేయకపోతే.. వాటి మూలల్లో దుమ్ము-ధూళి.. వంటివి చేరి బూజు మాదిరిగా తయారవుతుంది. ఇలా ఈ కార్నర్స్‌ సాలీడ్లు, ఇతర పురుగులకు ఆవాసంగా మారతాయి. దుమ్ము-ధూళి ఎక్కువగా ఇంట్లోకి ప్రవేశించే ఎండాకాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికోసారి, కుదరకపోతే రెండు వారాలకోసారైనా వార్డ్‌రోబ్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. అలాగే లవంగాలు, రోజ్‌మేరీ, లావెండర్ పూరేకలు, బిర్యానీ ఆకు.. వంటివి కొద్ది మొత్తాల్లో తీసుకొని ఒక క్లాత్‌ బ్యాగ్‌లో మూటకట్టి వార్డ్‌రోబ్‌ అరల్లో లేదంటే అందులోని రాడ్‌కి వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఆ మూలికల్లోని అత్యవసర నూనెలు పురుగులు, సాలీడ్ల బెడద లేకుండా చేస్తాయి. అంతేకాదు.. పరిమళాన్ని సైతం వెదజల్లుతాయి.

అందుకే హ్యాంగర్లు అవసరం!

వేసవి కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హ్యుమిడిటీ ప్రభావం గాలి సరిగ్గా ప్రసరించని ప్రదేశాల్లో మరింత అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వార్డ్‌రోబ్‌లో కూడా గాలి తగలదు కాబట్టి దుర్వాసన వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి అల్మరాలో దుస్తుల్ని అమర్చడానికి హ్యాంగర్లను ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాస్త మందంగా ఉండే దుస్తుల్ని హ్యాంగర్లకు విడివిడిగా తగిలించి.. సన్నగా, తేలిగ్గా ఉండే వాటిని షెల్ఫ్‌లో పేర్చడం వల్ల దుస్తులకు దుస్తులకు మధ్య చక్కగా గాలి ఆడుతుంది. తద్వారా అవి తాజాగా, పరిశుభ్రంగా ఉంటాయి.. ఫలితంగా వార్డ్‌రోబ్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది..


దుస్తుల్ని ఇలా ఉతకాలి!

వేసవి అంటేనే వేడి, చెమట.. ఇది మన శరీరం నుంచి దుస్తులకు చేరుతుంది. అయితే ఒక్కోసారి ఎంత ఉతికినా ఈ చెమట వాసన, దాని కారణంగా దుస్తులపై పడిన మరకలు ఓ పట్టాన వదలవు. అలాగని వీటిని ఏదో అలా పైపైన ఉతికి.. అల్మరాలో పెట్టేస్తే వాటి వాసన ఇతర దుస్తులకు అంటుకుంటుంది. మరి, అలా జరగకూడదంటే దుస్తుల్ని బేకింగ్‌ సోడాలో ఉతకమంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా దుస్తులు ఉతకడం పూర్తయ్యాక ఆఖర్లో అరకప్పు బేకింగ్‌ సోడా/వెనిగర్‌ కలిపిన నీటిలో ఒకసారి ముంచి తీసి ఎండలో ఆరేయాలి.. ఇక వాషింగ్‌ మెషీన్‌లో ఉతికేవారు.. డ్రై చేయడానికి ముందు బేకింగ్‌ సోడా నీటిని అందులో పోయచ్చు. ఫలితంగా దుస్తులకు అంటుకున్న చెమట వాసన, మరకలు తొలగిపోయి సువాసన వెదజల్లుతాయి. ఇలా ఎండలో బాగా ఆరిన దుస్తుల్ని అల్మరాలో హ్యాంగర్లకు తగిలించుకోవడం లేదంటే షెల్ఫుల్లో అమర్చుకోవడం చేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్