Updated : 13/02/2023 14:27 IST

అలమర.. మెచ్చేలా అమర్చారా!

విజ్ఞానాన్ని పెంచడమే కాదు, ఎన్నో కొత్త, పాత విషయాలను అందించే పుస్తకపఠనం ఇంటిల్లిపాదికీ ముఖ్యమే. వయసు, అభిరుచికి తగినట్లు పుస్తకాల అలమరలను ఇంటికీ ప్రత్యేకతను తెచ్చేలా అమర్చుకోండిలా...

గదిగదికీ.. ఇంటికంతటికీ ఒకే పుస్తకాల అలమర కాకుండా గదిగదికీ విడివిడిగా ఉంటే మంచిది. మనసుకు నచ్చి కొన్న ప్రతి పుస్తకాన్నీ ఒకే అలమరలో సర్దితే కావాల్సినప్పుడు వెతకడం కష్టంగా ఉంటుంది. చదవాలనిపించినప్పుడు పుస్తకం దొరకకపోతే ఆసక్తి దూరమవుతుంది. అలాగే రాత్రి నిద్రలోకి జారుకునేముందు చదివే పుస్తకాలు ఆ సమయానికి మన ముందుంటే వెంటనే చదువుతాం. అందుకే పడకగదిలో చిన్న మొబైల్‌ అలమర ఏర్పాటు చేసుకోవాలి. లేదా మంచం పక్కగా చిన్న స్టాండులాంటిది సర్దుకోవాలి. ఇందులో పిల్లల కథల పుస్తకాలు, మనకు నచ్చిన, చదవాల్సినవి అమర్చుకుంటే అవసరమైనప్పుడు చేతికి వెంటనే అందుతాయి.

పచ్చదనంతో.. పుస్తకాల అలమర అంటే పుస్తకాలు మాత్రమే సర్దాలనే నియమం లేదు. అలమరకు రెండు వైపులా ఇండోర్‌ప్లాంట్స్‌ పెంచే తొట్టెలు అమర్చుకోవచ్చు. ఓవైపు అభిరుచికి తగిన పుస్తకాలు, వాటికి పక్కగా ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఇంటి అందాన్ని పెంచుతాయి. మనసుకు ఆహ్లాదాన్నీ.. అందిస్తాయి.

కిటికీ పక్కగా.. వరండా లేదా హాల్‌లో ఒక వరుసతో లభ్యమవుతున్న పుస్తకాల అలమర ఉంటే బాగుంటుంది. అలమరకు పక్కగా చిన్న స్టూల్‌లాంటిది సర్ది దానిపైన ఇండోర్‌ మొక్కనుంచితే చాలు. ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని