స్టీలు పాత్రలు మెరవాలంటే..!

స్టీలు గిన్నెలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో; వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా పాత వాటిలా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం రోజువారీ ఉపయోగించే స్టీలు గిన్నెలను శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Published : 11 Jun 2024 21:37 IST

స్టీలు గిన్నెలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో; వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా పాత వాటిలా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం రోజువారీ ఉపయోగించే స్టీలు గిన్నెలను శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటిని శుభ్రం చేయడమే కాకుండా కొత్తవాటిలా మెరిపించేందుకు ఉపకరించే కొన్ని చిట్కాలు మీకోసం..

గోరువెచ్చని సోప్‌వాటర్‌తో..

రోజువారీ ఉపయోగించే స్టీల్ పాత్రలను శుభ్రం చేసేందుకు కూడా ఓ పద్ధతి ఉంది. దీని ప్రకారం ముందుగా చల్లని నీళ్లతో ఆ పాత్రపై ఎలాంటి పదార్థాలు లేకుండా పైపైన కడిగేయాలి. తర్వాత మెత్తని స్పాంజ్‌తో గోరువెచ్చని నీళ్లలో కలిపిన సోప్ మిశ్రమాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ స్టీల్‌పాత్రలపై ఏవైనా పదార్థాలు గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే వాటిని తొలగించేందుకు స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ను ఉపయోగించకూడదు. ఇందుకు నైలాన్ స్క్రబ్‌ని మాత్రమే ఉపయోగించాలి. ఫలితంగా పాత్రలపై ఎలాంటి గీతలు పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే స్టీల్ గిన్నెలను శుభ్రం చేసిన తర్వాత వాటిని మెత్తని వస్త్రంతో తుడుచుకొని కాసేపు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటి మెరుపు ఎక్కువ కాలం నిలిచి ఉండడమే కాదు.. మంచి లుక్‌ని కూడా ఇస్తాయి.

ఏవైనా పదార్థాలు అంటుకున్నప్పుడు..

స్టీల్ పాత్రలను ఉపయోగించే క్రమంలో వాటికి అప్పుడప్పుడూ కొన్ని పదార్థాలు జిడ్డులా అంటుకుపోతూ ఉంటాయి. ఇందుకోసం స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ని ఉపయోగించకూడదు. అలా అంటుకుపోయిన పదార్థాలను సులభంగా వదిలించేందుకు బాగా మరిగించిన నీటిని ఉపయోగిస్తే సరి. దీనికోసం మనం చేయాల్సిందల్లా.. పదార్థం అంటుకున్న పాత్రలో సలసలా మరిగించిన వేడినీళ్లు పోసి అవి చల్లారేవరకు ఆ పాత్రను కదపకుండా ఉంచడమే. ఆ తర్వాత స్పాంజ్ లేదా నైలాన్ స్క్రబ్‌ని ఉపయోగించి పాత్రని శుభ్రం చేస్తే అంటుకున్న పదార్థాలు సులభంగా తొలగిపోతాయి.

టొమాటో కెచప్‌తో..

కొన్ని స్టీల్ పాత్రలకు అడుగుభాగంలో రాగి పూత ఉంటుంది. ఇలాంటి పాత్రలకు స్టీల్ ఒక్కటే కొత్తగా ఉంటే సరిపోదు.. రాగి కోటింగ్ కూడా కొత్తదానిలా మెరవాలి. ఇందుకోసం వంటింట్లో అందుబాటులో ఉండే టొమాటో కెచప్‌ని ఉపయోగిస్తే సరి. రాగి కోటింగ్ ఉన్న ప్రాంతంలో కెచప్‌ని అప్త్లె చేసి పది నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్‌తో వాటిని శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.

మాడిపోయినప్పుడు..

సాధారణంగా స్టీల్ పాత్రలు మాడిపోయినప్పుడు బ్రౌన్ కలర్‌లో మరకలు పడడమే కాకుండా అవి పాత్ర ఉపరితలానికి చాలా గట్టిగా అతుక్కుని ఉండిపోతాయి. ఇలాంటి వాటిని తొలగించాలంటే ముందుగా ఆ పాత్రలో నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. ఇలా చేయడం వల్ల పాత్రకు అంటుకున్న పదార్థాల అవశేషాలు సులభంగా తొలగిపోతాయి. తర్వాత నైలాన్ స్క్రబ్‌తో పాత్రలను శుభ్రం చేయడం ద్వారా మాడిపోయిన మరకలన్నీ పూర్తిగా వదిలిపోతాయి.

వెనిగర్‌తో..

పాత్రల్లో పాలు లేదా నీళ్లు ఎక్కువగా మరిగించినప్పుడు ఖనిజాలు ఎక్కువగా చేరడం వల్ల అడుగుభాగం అట్టకట్టినట్లుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మూడువంతుల నీళ్లలో 1/3 వంతు వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలో పోయాలి. తర్వాత కాసేపు కదపకుండా పక్కన పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత వేడినీళ్లతో ఆ పాత్రని శుభ్రం చేయడం ద్వారా అడుగుభాగంలో చేరిన ఖనిజాలను పూర్తిగా తొలగించవచ్చు.

స్టీల్ మెరవాలంటే..

స్టీల్ పాత్రలు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే అందుకోసం బేకింగ్ సోడా, నీళ్లు కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక క్లాత్ సహాయంతో పాత్రలకు అప్త్లె చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నీటి మరకలు పడకుండా మెత్తని వస్త్రంతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టీల్ పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్