శరీరాన్ని డీటాక్స్ చేయండిలా..!

సంక్రాంతికి స్వీటు, హాటు అని తేడా లేకుండా.. వివిధ రకాల స్పెషల్ వంటకాలు టేస్ట్ చేసే ఉంటారు కదూ..! ఇలాంటి విందు భోజనం ఆరంగించేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అమితంగా లాగిస్తే మాత్రం అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఇలాంటి ప్రత్యేక వంటకాల ద్వారా ఎంతో కొంత....

Updated : 17 Jan 2023 12:20 IST

సంక్రాంతికి స్వీటు, హాటు అని తేడా లేకుండా.. వివిధ రకాల స్పెషల్ వంటకాలు టేస్ట్ చేసే ఉంటారు కదూ..! ఇలాంటి విందు భోజనం ఆరంగించేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అమితంగా లాగిస్తే మాత్రం అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఇలాంటి ప్రత్యేక వంటకాల ద్వారా ఎంతో కొంత మొత్తంలో కొవ్వులు, చక్కెరలు వంటివి మన శరీరంలోకి చేరిపోతాయి. నిజానికి ఇవి మన శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. కాబట్టి మన శరీరంలో చేరిన ఇలాంటి విషతుల్యాలను తొలగించుకొని తిరిగి సాధారణ ఆహార నియమాలకు అలవాటు పడాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు నిపుణులు.

మరుసటి రోజే..!

సంక్రాంతి లాంటి పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్వీట్స్‌ ఎక్కువగా లాగిస్తుంటాం. తద్వారా ఆ మరుసటి రోజు కూడా వాటి పైకే మనసు లాగుతుంది. అలాగని మళ్లీ అవే తింటే లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోరికల్ని తగ్గించుకోవాలంటే సీజనల్‌ పండ్లు తీసుకోవాలి. ఇవీ నోటికి తియ్యదనాన్ని అందిస్తాయి. ఇక చక్కెర తినాలనిపిస్తే దానికి బదులుగా కొద్దిగా దాల్చిన చెక్క ముక్క లేదంటే జాజికాయ నోట్లో వేసుకుంటే మనసు సంతృప్తి పడుతుంది.. ఆరోగ్యమూ మన సొంతమవుతుంది.

బంధువులిళ్లకు వెళ్లినప్పుడు కాదనలేక కాఫీ, టీలు ఎక్కువగా తాగేస్తుంటాం.  వాటి ద్వారా చేరిన కెఫీన్‌ని బయటికి పంపించేయాలంటే నిమ్మరసం కలిపిన నీళ్లు, కొబ్బరి నీళ్లు, సూప్స్‌, గంజి.. వంటివి చక్కటి ఎంపిక.

శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి వ్యాయామమూ సహకరిస్తుంది. కాబట్టి రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం మంచిది. తద్వారా శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి. అలాగే ఆరోగ్యమూ సొంతమవుతుంది.

మనం ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ఆ రోజుకంతటికీ కావాల్సిన శక్తిని మన శరీరానికి అందిస్తుంది.. మనల్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. అలాగని పండక్కి చేసిన స్వీట్స్‌, పిండి వంటలు మళ్లీ తింటానంటే కుదరదు. వాటికి బదులుగా పోహా, ఉప్మా, ఇడ్లీ, దోసె.. వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలే తీసుకోవాలి. అంతేకాదు.. అల్పాహారం మానేయడం కూడా అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే అలా చేస్తే మరింత ఆకలేసి ఏది పడితే అది తినేస్తాం.. దీనివల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

ప్రత్యేక సందర్భాల్లో లేట్‌ నైట్‌ డిన్నర్స్‌ మామూలే. అలాగని రోజూ ఆలస్యంగానే తింటామంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందే భోంచేసేయాలి. అది కూడా తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలతోనే! ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడకుండా ఉంటుంది.. అంతేకాదు.. రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.

గబగబా తినేయడం కాకుండా నెమ్మదిగా, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అప్పుడే వాటి రుచిని ఆస్వాదించడంతో పాటు ఎక్కువసేపు ఆకలేయకుండా కూడా ఉంటుంది.

మన శరీరాన్ని డీటాక్స్‌ చేయడంలో నీటిని మించింది లేదు. కాబట్టి రోజుకు తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. తద్వారా శరీరంలోని విషతుల్యాలు సులభంగా బయటికి వెళ్లిపోతాయి.

ప్రత్యేక సందర్భాల్లో మనకు నచ్చినవి అమితంగా లాగించడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరును తిరిగి గాడిలో పెట్టాలంటే ఫైబర్‌ ఎక్కువగా ఉండే సీజనల్‌ పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్