నల్లుల బెడదను ఇలా వదిలించుకుందాం!

నల్లుల వల్ల నిద్రకు అంతరాయం కలగడం అటుంచితే.. అవి కుట్టడం వల్ల రకరకాల అలర్జీలు వచ్చే ప్రమాదమే ఎక్కువ! అందుకే చాలామంది నల్లులు కనిపించిన వెంటనే వాటిని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని మంచం, పరుపులపై స్ప్రే చేస్తుంటారు.

Published : 29 Nov 2023 13:07 IST

నల్లుల వల్ల నిద్రకు అంతరాయం కలగడం అటుంచితే.. అవి కుట్టడం వల్ల రకరకాల అలర్జీలు వచ్చే ప్రమాదమే ఎక్కువ! అందుకే చాలామంది నల్లులు కనిపించిన వెంటనే వాటిని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని మంచం, పరుపులపై స్ప్రే చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల నల్లుల బెడద పూర్తిగా వదలదు సరికదా.. తిరిగి మన ఆరోగ్యమే పాడవుతుంది. కాబట్టి చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటిస్తూ నల్లుల బెడద నుంచి విముక్తి పొందడం చాలా మంచిది. అలాంటి కొన్ని చిట్కాలు మీకోసం..

వ్యాక్యూమ్ క్లీనర్‌తో..

నల్లుల బెడద ఎక్కువగా ఉండే ప్రదేశాలను వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. అల్మరాలు, గది మూలలు, సోఫా సెట్, కుర్చీలు, మంచం మూలలు, పరుపులు.. ఇలా అన్ని చోట్లా వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫ్లోరింగ్ పగుళ్లలోనూ నల్లులు దాక్కునే అవకాశాలుంటాయి. కాబట్టి అక్కడ కూడా శుభ్రం చేసి ప్లాస్టర్ లేదా గ్లూను ఉపయోగించి ఆ పగుళ్లను మూసేయాలి. తర్వాత డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌తో ఇల్లు శుభ్రం చేయాలి.

వేడి నీళ్లతో..

మంచంపై పరిచే దుప్పట్లు, బెడ్‌కవర్స్, పిల్లో కవర్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. వేడి నీటిని ఉపయోగించి వీటిని ఉతకడం వల్ల వాటిపై నల్లులుంటే సులభంగా వదిలిపోతాయి. అలాగే వారానికోసారి మంచంపై వేసే దుప్పట్లు, పిల్లో కవర్స్ మారుస్తూ ఉండాలి.

సూర్యరశ్మి ప్రసరించేలా..

నల్లులు వేడిని ఎక్కువగా తట్టుకోలేవు. కాబట్టి గదిలోకి సూర్యరశ్మి ప్రసరించేలా చూసుకోవాలి. నల్లుల్ని పూర్తిగా నివారించడానికి పరుపు, మంచాన్ని ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి వల్ల నల్లులు చాలా వరకు నశిస్తాయి. పరుపుని ఎండలోంచి తీసి లోపల వేసుకొనే ముందు ఓసారి వ్యాక్యూమ్ క్లీనర్‌తో బాగా శుభ్రం చేయాలి. అలాగే మెత్తని వస్త్రంతో మంచాన్ని కూడా శుభ్రంగా తుడవాలి.

సుగంధ ద్రవ్యాలతో..

సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే వాసనను నల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఉతికిన తర్వాత దుప్పట్లు, బెడ్‌కవర్లను సువాసన వచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్‌లో ముంచడం మంచిది. అలాగే లావెండర్ నూనెకి నల్లులు నశిస్తాయి. కాబట్టి ఈ నూనెలో ముంచిన వస్త్రంతో కుర్చీలు, మంచాన్ని తుడిస్తే నల్లులు నశిస్తాయి. అదేవిధంగా కొన్ని పుదీనా ఆకులను నల్లుల బెడద ఎక్కువగా ఉన్న చోట ఉంచడం ద్వారా కూడా నల్లుల సమస్యకు చెక్ పెట్టొచ్చు. మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్‌తోనూ నల్లుల బెడదకు చెక్‌ పెట్టచ్చు.

వాషింగ్‌సోడాతో..

కేవలం మంచాలకు మాత్రమే నల్లులు పరిమితం కావు. కొన్నిసార్లు అవి మన వార్డ్‌రోబ్‌కి సైతం పాకుతాయి. కాబట్టి దుస్తుల్ని వాషింగ్ సోడా ఉపయోగించి ఉతకాలి.

బేకింగ్ సోడాతో..

బేకింగ్ సోడాను కొద్దిగా తీసుకొని దుస్తుల మడతల్లో, పరుపు కింద అక్కడక్కడా చల్లుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే నల్లుల బెడద ఉండదు.

ఇవి కూడా..

నల్లులు ఉన్నచోట ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను స్ప్రే చేయాలి.

కేవలం ఒక గదికి మాత్రమే నల్లులు పరిమితం కావు కాబట్టి ఇల్లు మొత్తం డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్