బియ్యం పురుగులు పడుతుంటే..!

బియ్యం పురుగు పట్టినప్పుడు శుభ్రం చేయడానికి ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే.. పల్లెటూళ్లలో ఉన్నవారైతే.. చేటతో చెరిగి లేదా ఎండలో పెట్టి బియ్యాన్ని బాగుచేసుకుంటారు. మరి వృత్తి, ఉద్యోగాలతో విధుల్లో బిజీగా ఉండే పట్టణవాసులకు అంత తీరిక ఉండదు.

Updated : 19 Feb 2024 21:09 IST

బియ్యం పురుగు పట్టినప్పుడు శుభ్రం చేయడానికి ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే.. పల్లెటూళ్లలో ఉన్నవారైతే.. చేటతో చెరిగి లేదా ఎండలో పెట్టి బియ్యాన్ని బాగుచేసుకుంటారు. మరి వృత్తి, ఉద్యోగాలతో విధుల్లో బిజీగా ఉండే పట్టణవాసులకు అంత తీరిక ఉండదు. కాబట్టి బియ్యం పురుగు పట్టకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి దీనికోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందామా...

వేపాకులు..

బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువమంది వేపాకులనే ఉపయోగిస్తారు. దీనిలో ఉండే క్రిమిసంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు చేరకుండా ఉంటాయి. దీనికోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని లైనింగ్‌ క్లాత్‌ లాంటి నూలు వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు పెంకు పురుగులు కూడా చేరకుండా ఉంటాయి.

కర్పూరం..

కర్పూరం వాడితే పురుగులు పట్టవా? అని సందేహిస్తున్నారా? కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు పెరగవు. ఈ ఫలితాన్ని పొందడానికి పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే నూలు వస్త్రంలో చుట్టి బియ్యం డబ్బాలో పెడితే సరిపోతుంది.

ఇంగువ

వంటల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ కూడా బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇది వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకొని బియ్యంలో కలిపితే సరిపోతుంది. దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల ఇది బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుంది. ఇవే కాదు.. బిర్యానీ ఆకులను ఉపయోగించినా ఇదే ఫలితం కనిపిస్తుంది.

బోరిక్‌ పౌడర్

బియ్యంలో పురుగులు పెరగడానికి తేమ కూడా ఒక కారణమే. సాధారణంగా రెండు, మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు బియ్యంలో తేమ చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా పురుగులు పట్టచ్చు. అందుకే బియ్యంలో తడి చేరకుండా చూసుకోవాలి. దీనికోసం బియ్యంలో కొద్దిగా బోరిక్‌ పౌడర్‌ని కలపాలి. ఇది బియ్యంలో చేరిన తేమను పీల్చేసుకుంటుంది. ఫలితంగా అందులో పురుగులు చేరకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్