పూలు ఫ్రెష్‌గా ఉండాలంటే..!

రంగు రంగుల పూలను ఫ్లవర్‌వాజుల్లో ఉంచి ఇంటిని అలంకరించుకోవడమంటే అందరికీ ఇష్టమే. పువ్వులు ఇంటికి అందాన్నివ్వడంతో పాటు వాటి నుంచి వెదజల్లే సువాసనలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ సమయం తాజాగా ఉండవు కాబట్టి చాలామంది....

Published : 11 Mar 2023 19:53 IST

రంగు రంగుల పూలను ఫ్లవర్‌వాజుల్లో ఉంచి ఇంటిని అలంకరించుకోవడమంటే అందరికీ ఇష్టమే. పువ్వులు ఇంటికి అందాన్నివ్వడంతో పాటు వాటి నుంచి వెదజల్లే సువాసనలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ సమయం తాజాగా ఉండవు కాబట్టి చాలామంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తోనే ఇంటిని అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా.. పండగలు, శుభకార్యాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇంటిని సహజమైన పూలతో అలంకరించడానికే ఆసక్తి చూపిస్తాం. మరి అటువంటప్పుడు పుష్పాలు త్వరగా వాడిపోకుండా.. ఎక్కువ సమయం తాజాగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందామా..

కూల్‌డ్రింక్‌తో..

పూలు ఎక్కువ సమయం తాజాగా ఉండాలని ఫ్లవర్‌వాజుల్లో నీరు పోస్తూ ఉంటాం. అయినా మనకు పెద్దగా ప్రయోజనం కనిపించకపోవచ్చు. దీనికి కారణం నీటిలో ఉండే బ్యాక్టీరియానే. వీటిని నిర్మూలించినట్లయితే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికోసం శీతలపానీయాలను ఉపయోగించడం మంచిది. ఇందులో ఉండే చక్కెరలు నీటిలో ఉండే బ్యాక్టీరియాను సంహరించి పూలు వాడిపోకుండా చేస్తాయి. ఈ ఫలితాన్ని పొండానికి నీరు, కూల్‌డ్రింక్ కప్పు చొప్పున తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి చెంచా బ్లీచ్‌ని కూడా కలపాలి. పారదర్శకంగా ఉండే వాజుల్లో పువ్వులు పెడితే కనుక నీటిలో కలసిపోయే విధంగా ఉండే డ్రింక్స్‌ని ఉపయోగించవచ్చు.

హెయిర్‌స్ప్రేతో..

ఇంటి అలంకరణలో భాగంగా కొన్ని రకాల పూలను గుత్తులుగా కట్టి వాటిని గోడల మీద వేలాడదీస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల అవి త్వరగా తేమను కోల్పోయి వాడిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్.. ఆకులు, పూరెక్కల అడుగు బాగాన హెయిర్ స్ప్రేని చల్లితే సరిపోతుంది. ఫ్లవర్‌వాజులో పెట్టే పూలకు కూడా ఈ చిట్కాను పాటించవచ్చు.

యాస్ప్రిన్

గులాబీ పూలను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. వాటికున్న అందమే దానికి కారణం. ఇటీవలి కాలంలో మార్కెట్లో విభిన్న రంగులు, వివిధ పరిమాణాల్లో గులాబీలు విరివిగా లభిస్తున్నాయి. వాటన్నింటినీ ఒక చోట చేర్చి ఫ్లవర్వాజ్‌లో పెడితే ఆ అందమే వేరు. మరి ఇవి ఎక్కువ సమయం తాజాగా ఉండాలంటే ఫ్లవర్‌వాజులో వేసే నీటితో పాటు.. ఒక యాస్ప్రిన్ ట్యాబ్లెట్ కూడా వేస్తే గులాబీలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

బ్లీచ్

పావు లీటరు నీటిలో మూడు చుక్కల బ్లీచ్, టీస్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్లవర్ వాజులో పోసి అందులో పూలను ఉంచితే అవి వాటి సహజత్వాన్ని, రంగుని కోల్పోకుండా ఉంటాయి.

కత్తిరిస్తూ..

కొన్ని రకాల పుష్పాలు మొగ్గగా ఉన్నప్పుడే కోసినా తర్వాత మెల్లగా విచ్చుకుంటాయి. ఇలాంటి వాటిని కొన్ని రోజుల వరకు ఫ్లవర్‌వాజ్‌లో ఉంచవచ్చు. అయితే అవి అన్ని రోజులు తాజాగా ఉండాలంటే కచ్చితంగా క్రమం తప్పకుండా నీటిని మార్చాల్సి ఉంటుంది. అలాగే రోజుకి పావు అంగుళం మేర కాండాన్ని క్రాస్‌గా కత్తిరిస్తూ ఉంటే పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్లవర్‌వాజులోని నీటిలో కాస్త ఉప్పు వేస్తే పువ్వులు మరింత ఎక్కువ సమయం ఫ్రెష్‌గా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్