కాళ్లు, చేతులు వెచ్చగా.. ఇలా!

చలికి ఒక్కోసారి చేతులు, కాళ్లు గడ్డకట్టుకుపోయినట్లుగా అనిపిస్తాయి. ఈ కాలంలో రక్తప్రసరణ వేగం మందగించడమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ ఈ కాలంలో చేతులు, కాళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు....

Published : 28 Nov 2022 19:24 IST

చలికి ఒక్కోసారి చేతులు, కాళ్లు గడ్డకట్టుకుపోయినట్లుగా అనిపిస్తాయి. ఈ కాలంలో రక్తప్రసరణ వేగం మందగించడమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ ఈ కాలంలో చేతులు, కాళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

వ్యాయామం తప్పనిసరి..

శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి.. వేడి పుట్టించే శక్తి వ్యాయామానికి ఉంది. అందుకే కష్టమైనా రోజూ ఓ అరగంట పాటు వర్కవుట్‌కు సమయం కేటాయించమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఏరోబిక్స్‌, జాగింగ్‌, నడక, ఇతర జిమ్ వ్యాయామాలు సాధన చేయచ్చు. అలాగే ఆరుబయట వ్యాయామాలు చేసే వాళ్లు చలికి తట్టుకునేలా దుస్తులు ధరించడం తప్పనిసరి.. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు వేసుకోవడం మర్చిపోవద్దు.

మర్దనతో లాభాలెన్నో!

మర్దనతో శరీరంలో వేడి పుడుతుంది.. రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. రక్తంతో పాటు ఆక్సిజన్‌ కూడా ఆయా శరీర భాగాలకు అందుతుంది. కాబట్టి గోరువెచ్చటి నూనెతో శరీరాన్ని, చేతులు-కాళ్లు, చేతి వేళ్లు-కాలి వేళ్లను మర్దన చేయడం వల్ల ఈ ఫలితాలన్నీ పొందచ్చు. అంతేకాదు.. ఈ ప్రక్రియ వల్ల చర్మం కూడా తేమగా మారుతుంది.

హీటింగ్‌ ప్యాడ్‌ ఉందా?

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటి చల్లదనం ఇంట్లోకీ ప్రవేశిస్తుంది. తద్వారా మరింత చలిగా ఉంటుంది. ఇలాంటప్పుడు హీటింగ్‌ ప్యాడ్లు, రూమ్‌ హీటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల అటు గదిని, ఇటు శరీరాన్ని వెచ్చబర్చుకోవచ్చు.

ఉప్పుతో ఇలా!

గళ్లుప్పుకు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే గుణం ఉంది. అందుకే చేతులు, కాళ్లను వెచ్చగా మార్చుకోవడానికి ఈ చిట్కా పాటించమంటున్నారు నిపుణులు. గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి.. అందులో చేతులు, కాళ్లను ఓ పది నిమిషాల పాటు ఉంచితే చక్కటి ఫలితం ఉంటుంది.

నీళ్లు తాగాలి..

సాధారణంగా చాలామంది చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీని ప్రభావం రక్తప్రసరణ పైనా పడుతుంది. కాబట్టి దాహం వేయకపోయినా బరువును బట్టి తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి! తద్వారా చలికి చర్మం పొడిబారకుండా కూడా కాపాడుకోవచ్చు.

ఇవి కూడా!

⚛ చల్లటి వస్తువుల్ని నేరుగా తాకకూడదు.

⚛ ఇంట్లోని ఫోరింగ్‌పై నడిచేటప్పుడు స్లిప్పర్స్‌ ధరించడం, గ్లౌజులు-సాక్సులు వేసుకోవడం తప్పనిసరి.

⚛ శరీరంలో వేడి పుట్టించే హెర్బల్‌ టీలకు ప్రాధాన్యమివ్వాలి. అరటిపండ్లు, చిలగడదుంప, ఓట్స్‌, సూప్స్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

చలికాలంలో కాళ్లు, చేతులు గడ్డకట్టుకుపోవడం/చల్లగా మారడం సర్వసాధారణమే అయినా.. కొంతమందిలో ఇతర సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. రక్తహీనత, హైపోథైరాయిడిజం, మధుమేహం.. వంటి అనారోగ్యాలున్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. కాబట్టి ఓసారి నిపుణుల్ని సంప్రదించి.. సమస్యకు గల కారణాలు, దాని పరిష్కార మార్గాల్ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్