Updated : 09/02/2023 13:01 IST

ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో..

మాధురికి ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ప్రతి విషయాన్నీ తరచి తరచి చూస్తుంది. చెడు జరుగుతుందేమోనని భయపడుతుంది. దీంతో నిత్యం ఒత్తిడికి గురవుతూ ఆందోళన చెందుతుంటుంది. ఈ అలవాటును దూరంగా తరిమేయొచ్చు అంటున్నారు నిపుణులు. మార్చాలి..

కుటుంబ సభ్యులు ఎవరికైనా అనుకోని ఆపద ముంచుకొస్తుందేమో, పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్లినప్పుడు కింద పడిపోతారేమో... వంటివన్నీ ప్రతికూల ఆలోచనలే. ఇటువంటప్పుడు వెంటనే మనసు మార్గాన్ని మరల్చడానికి ప్రయత్నించాలి. ఆసక్తి ఉన్న దాని మీద మనసు కేంద్రీకరించి ఆ వైపు అడుగులేయాలి. నచ్చినవి వండటం, ఇష్టమైన పుస్తకాలు చదవడం, నచ్చిన పాటలు వినడం, బొమ్మలేయడం లేదా తోటపని వంటివాటితో మనసు మార్గాన్ని మార్చొచ్చు. అప్పటికీ అవే ఆలోచనలొస్తుంటే స్నేహితులు, శ్రేయోభిలాషులెవరికైనా ఫోన్‌ చేసి మాట్లాడటం మంచిది. కారణం లేకుండా వచ్చే ఆలోచనలను అరికట్టడానికి ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది.

పుస్తకంలో.. వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు ఏ అంశానికి సంబంధించి భయం, బాధ కలుగుతున్నాయో పుస్తకంలో పొందుపరచాలి. అలా ప్రతికూల ఆలోచనలొచ్చిన ప్రతిసారీ రాస్తుండాలి. ఆ తర్వాత వాటిని చదువుతుండాలి. అనుకున్నట్లుగా బాధాకరమైన సంఘటనలు చోటుచేసుకోనప్పుడు ఎందుకిలా జరుగుతోందని ఆలోచించాలి. మన ఆలోచనాతీరులో ఉండే అసహజత్వం క్రమేపీ మనసుకు అర్థమవుతుంది. కొంతకాలానికి ఈ అలవాటు దూరమవుతుంది. అలాగే కాసేపు పిల్లలతో సమయాన్ని గడిపినా కులాసాగా ఉంటుంది.

ఆలోచనను.. మనసులో ప్రతికూల ఆలోచనలొచ్చినప్పుడు గతంలో కూడా అలా అనిపించిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దానివల్ల ఊహించిన ప్రమాదమేదీ చోటుచేసుకోలేదు కదా అనుకోవాలి. అటువంటప్పుడు మళ్లీ అలాగే నెగెటివ్‌గా అనుకోవడం సరికాదని మనకు మనమే నచ్చజెప్పుకోవాలి. క్రమేపీ ఆ అలవాటును మానుకోవడానికి చేసే స్వీయ ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తుంది. లేదంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని