పనీర్‌ నీటిని ఇలా కూడా..!

ఇంట్లో పాలు విరిగిపోతే పనీర్‌, కలాకండ్‌.. వంటి పదార్థాలు తయారుచేసుకుంటాం. అయితే ఈ క్రమంలో వడకట్టిన నీటిని కొంతమంది బయట పడేస్తుంటారు. కానీ ప్రొటీన్లు, ఇతర పోషకాలు నిండి ఉన్న ఈ నీటిని ఇంట్లో పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు....

Published : 21 Dec 2022 19:09 IST

ఇంట్లో పాలు విరిగిపోతే పనీర్‌, కలాకండ్‌.. వంటి పదార్థాలు తయారుచేసుకుంటాం. అయితే ఈ క్రమంలో వడకట్టిన నీటిని కొంతమంది బయట పడేస్తుంటారు. కానీ ప్రొటీన్లు, ఇతర పోషకాలు నిండి ఉన్న ఈ నీటిని ఇంట్లో పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

మనం చపాతీ పిండి తడపడానికి సాధారణ నీటిని ఉపయోగిస్తాం. అయితే పనీర్‌ నీటిని కూడా ఇందుకోసం వాడుకోవచ్చు. తద్వారా చపాతీ/పూరీ.. వంటివి మెత్తగా రావడంతో పాటు వీటి రుచి కూడా పెరుగుతుంది.

బేకింగ్‌ వంటకాలు తయారుచేసుకునే క్రమంలో.. ఆయా పిండిని తడుపుకోవడానికీ ఈ నీటిని వినియోగించుకోవచ్చు.

కూరల్లో గ్రేవీ కోసం కొన్ని నీళ్లు పోయడం మనకు అలవాటే! అయితే ఈసారి సాధారణ నీటికి బదులు పనీర్‌ నీటిని పోసి చూడండి.. అటు రుచీ పెరుగుతుంది.. ఇటు అందులోని పోషకాలూ శరీరానికి అందుతాయి.

అలాగే కొన్ని కూరలు, ఇతర వంటకాల తయారీలో భాగంగా పులుపు ఎక్కువైతే.. కొద్దిగా ఈ నీటిని కలిపితే వాటి రుచి మారే అవకాశం ఉంది.

పండ్లు-కాయగూరల రసాలు, స్మూతీస్‌.. వంటివి తయారుచేసుకునేటప్పుడు నీటికి బదులుగా పనీర్‌ నీటిని ఉపయోగిస్తే.. రుచి మరింతగా పెరుగుతుంది. వీటిలో చక్కెర వేసుకోకపోయినా తియ్యదనం వస్తుంది.

పాస్తా, నూడుల్స్‌, బంగాళాదుంపలు, బియ్యం, ఇతర కాయగూరలు.. వంటివి ఉడికించే క్రమంలోనూ పనీర్‌ నీటిని వినియోగించుకోవచ్చు. అలాగే  కొన్ని రకాల పప్పుల్ని కూడా ఈ నీటిలో నానబెట్టుకోవచ్చు. తద్వారా ఈ నీటిలోని పోషకాలు ఆయా పదార్థాల్లో చేరతాయి. తద్వారా ఒంటికి పడతాయి.

ఉప్మా వంటివి తయారుచేసే క్రమంలో సాధారణ నీటితో పాటు కొన్ని పనీర్‌ నీటిని కూడా పోస్తే దాని రుచి పెరుగుతుంది.

ప్రొటీన్లు, ఇతర పోషకాలు నిండి ఉన్న ఈ పనీర్‌ నీటిని మొక్కలకూ పోయచ్చు. అయితే సాధారణ నీటితో కలిపి మాత్రమే వాడాలి.

ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌ మాస్కుల్లోనూ ఈ నీటిని వాడచ్చు. అలాగే ఈ నీటితో జుట్టును కండిషనింగ్‌ చేసుకుంటే కేశాలు పట్టులా తయారవుతాయి. ఇందులోని ప్రొటీన్‌ జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. అయితే ఈ చిట్కా పాటించిన తర్వాత జుట్టు జిడ్డుగా అనిపిస్తే.. గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయచ్చు.

స్నానం చేసే నీటిలో కొన్ని పనీర్‌ నీటిని కలుపుకోవడం, బాత్‌ టబ్‌లో రెండు కప్పుల పనీర్‌ నీటిని కలుపుకొని అందులో ఇరవై నిమిషాల పాటు సేదదీరడం.. వంటివి చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ఆపై సాధారణ నీటితో మరోసారి స్నానం చేస్తే సరిపోతుంది.

కొంతమంది ఇంట్లోనే కంపోస్ట్‌ ఎరువులు తయారుచేసుకుంటారు. ఈ క్రమంలో పనీర్‌ నీటిని అందులో పోస్తే.. ఎరువులోని పోషకాల శాతాన్ని పెంచచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్