ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ వాడుతున్నారా?

దుస్తుల నాణ్యత, మన్నిక పెంచాలని, సువాసనలు వెదజల్లుతూ ఉండాలని కొంతమంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని అన్ని ఫ్యాబ్రిక్స్‌కి ఉపయోగించడం సరికాదట! ఇంతకీ దీనిని ఏయే ఫ్యాబ్రిక్స్‌.....

Published : 10 May 2022 20:14 IST

దుస్తుల నాణ్యత, మన్నిక పెంచాలని, సువాసనలు వెదజల్లుతూ ఉండాలని కొంతమంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని అన్ని ఫ్యాబ్రిక్స్‌కి ఉపయోగించడం సరికాదట! ఇంతకీ దీనిని ఏయే ఫ్యాబ్రిక్స్‌కి ఉపయోగించకూడదు? అసలు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మొదలైన వివరాలు తెలుసుకుందాం రండి..

దుస్తుల్లోని పోగులు/ దారాలను మృదువుగా ఉండేలా చేయడం ద్వారా బట్టల మృదుత్వాన్ని పెంచడమే కాదు.. వాటి నాణ్యత, మన్నికను మరింత మెరుగుపరచడంలో కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ పాత్ర చాలా ముఖ్యమైంది. అందుకే బట్టలు ఉతకడంలో ఇది కూడా ఒక భాగంగా మారిపోయింది. అయితే ఇది అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌కి అనువుగా ఉండదని, కొన్నింటి నాణ్యతని దెబ్బతీసే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు.

స్పోర్ట్స్ వేర్..

ఆటలు ఆడే సమయంలో ధరించే దుస్తులు చెమటను అధికంగా పీల్చుకునే స్వభావం కలిగి ఉంటాయి. ఇలాంటి దుస్తులకు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ ఉపయోగించడం వల్ల అవి చెమటను పీల్చుకునే స్వభావాన్ని క్రమంగా కోల్పోతాయట! సాఫ్ట్‌నర్ కారణంగా దుస్తుల మీద ఒక పొరలా ఏర్పడే రసాయనాలే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లో ఉండే అమ్మోనియా సమ్మేళనాలు దుస్తులపై ఒక జిగురు లాంటి పొరలా ఏర్పడి ఫ్యాబ్రిక్‌ని మృదువుగా అనిపించేలా చేస్తాయి. ఈ పొర కారణంగా బట్టలు సువాసనలు వెదజల్లుతూ మృదువుగా ఉన్నప్పటికీ చెమటను పీల్చే వాటి సహజసిద్ధమైన స్వభావాన్ని కోల్పోతాయి. ఫలితంగా వాటి నాణ్యత సైతం దెబ్బతినే అవకాశాలు లేకపోలేవు.

టవల్స్..

స్నానం చేసిన అనంతరం తుడుచుకోవడానికి ఉపయోగించే టవల్స్‌తో పాటు రోజూ ఇంట్లో చేతులు తుడుచుకోవడానికి ఉపయోగించే వాటికి కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్ తరచూ ఉపయోగించకూడదట! వీటి కారణంగా ఏర్పడే రసాయనాల పొర వల్ల టవల్స్ మృదువుగా మారినా నీటిని పీల్చుకునే గుణం క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ టవల్స్‌కి కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ తప్పనిసరిగా పెట్టాలని అనుకుంటే వాటిని ఉతికిన ప్రతిసారీ కాకుండా మధ్యలో కాస్త విరామం ఇస్తూ ఉపయోగించవచ్చు.

మైక్రోఫైబర్ క్లాత్..

కొన్ని రకాల వస్తువులపై ఉండే దుమ్ము, ధూళిని తొలగించడంలో మైక్రోఫైబర్ క్లాత్ బాగా ఉపయోగిస్తుంది. అయితే మైక్రోఫైబర్ క్లాత్‌కి ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ పెట్టడం వల్ల దాని పోగులు దెబ్బతినడమే కాకుండా దుమ్ము, ధూళిని సమర్థంగా తొలగించే వాటి స్వభావాన్ని కూడా అవి కోల్పోతాయి. కాబట్టి వీటికి సాఫ్ట్‌నర్ అస్సలు ఉపయోగించకూడదు.

ఇవేకాదు.. నీటిలో తడవకుండా ఉపయోగించే వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్‌కి కూడా సాఫ్ట్‌నర్‌ని ఉపయోగించడం మంచిది కాదు.

లేబుల్ పరిశీలించాలి..

బట్టలు కొన్నప్పుడు వాటిపైన ఉండే లేబుల్స్ పరిశీలించి వాటిని ఉతికే విధానం గురించి ఎలా తెలుసుకుంటామో, అలాగే ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్ వాడచ్చో లేదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద సాఫ్ట్‌నర్స్ ఉపయోగించకూడదని పలు సంస్థలు తమ లేబుల్ ద్వారా వినియోగదారులకు తెలిపే అవకాశాలున్నాయి. ఫలితంగా సాఫ్ట్‌నర్స్ కారణంగా వాటి నాణ్యత దెబ్బతినక ముందే జాగ్రత్తపడచ్చు.

ఈ పరిస్థితుల్లో ఉపయోగించాలి..

* బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటిలో మినరల్స్ స్థాయులు అధికంగా ఉన్నప్పుడు..

* బెడ్‌షీట్స్ మృదువుగా ఉంటూ, సువాసనలు వెదజల్లాలనుకున్నప్పుడు..

* ఉన్ని వంటి ఫ్యాబ్రిక్‌తో రూపొందిన దుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా మెరవాలనుకున్నప్పుడు..

* చిన్నారులకు వేసే దుస్తులు శుభ్రంగా ఉండాలనుకున్నప్పుడు..

ఇలాంటి సందర్భాల్లో దుస్తులను బాగా శుభ్రం చేసి, ఎలాంటి వాసనలు లేకుండా జాగ్రత్తపడిన తర్వాతే ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే దాని కారణంగా బట్టలు మృదువుగా మారడమే కాకుండా నాణ్యత, మన్నిక కూడా పెరుగుతాయి. సువాసనలు వెదజల్లుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్