Asia: కరోనా, ద్రవ్యోల్బణంతో ఆసియాలోని 46 దేశాల్లో పెరిగిన పేదరికం..!

ఆసియాలో కరోనా, జీవన వ్యయ భారంతో దాదాపు 70 మిలియన్లకు పైగా జనాభా పేదరికంలో కూరుకుపోయిందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ADB) నివేదిక వెల్లడించింది. 

Updated : 24 Aug 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం (Inflation) గతేడాది ఆసియా (Asia)లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 7 కోట్ల మందిని దుర్భరమైన పేదరికంలోకి నెట్టిందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ADB) నివేదిక గురువారం వెల్లడించింది.

అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల జనాభాలో 3.9శాతానికి సమానమైన 15.5 కోట్ల మంది గతేడాది అత్యంత పేదరికంలో ఉన్నారని అంచనా వేసింది. వాస్తవానికి కరోనా సంభవించని పరిస్థితుల్లో ఉండాల్సిన పేదల సంఖ్య కంటే ఇది 6.7 కోట్లు ఎక్కువ. ఆసియా-పసిఫిక్‌లో జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మినహా.. ఆసియాలోని 46 ఆర్థిక దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. గత కొన్నేళ్లతో పోలిస్తే.. 2022లో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, సరఫరా గొలుసుకు అంతరాయం కలగడం కూడా ఇందుకు కారణం.

రష్యాకు శాపాలైన లోపాలు

ధరల పెరుగుదల ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. పేదలు ఆహారం, ఇంధనంపై అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో వైద్య, విద్య, నిత్యావసరాల లభ్యత కష్టమైంది. 2017 గణాంకాల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల (రూ. 177) కంటే తక్కువ ఆదాయం సంపాధించేవారు అత్యంత పేదిరికంతో జీవిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆసియాలో 4.8 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతంలోని 4.2 శాతం కంటే ఇది ఎక్కువ. ఆసియా ప్రాతం పేదరికం నుంచి పురోగతి సాధిస్తుందని భావిస్తున్నప్పటికీ.. 2030 వరకు 30.3 శాతం లేదా 1.26 బిలియన్ల జనాభా ఆర్థికంగా బలహీనంగానే ఉండవచ్చని ఏడీబీ అంచనా వేసింది.

‘‘ప్రపంచంలోని చాలా దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ.. ఆసియా-పసిఫిక్‌లోని దేశాలు కోలుకున్నాయి. కానీ, అధిక జీవన వ్యయాల భారం పురోగతిని దెబ్బతీస్తోంది. సామాజిక భద్రతను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా తిరిగి అభివృద్ధి పుంజుకోవచ్చు’’ అని ఏడీబీ ప్రముఖ ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని