Khalid Payenda: అప్పటి అఫ్గాన్‌ ఆర్థిక మంత్రి.. ఇప్పుడు టాక్సీ డ్రైవర్..!

తాలిబన్ల ఆక్రమణకు ముందు అఫ్గాన్‌ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో వేలకోట్ల రూపాయాల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఖలీద్‌ పయేందా.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అమెరికాలో క్యాబ్‌ డ్రైవర్‌ అవతారమెత్తాడు.

Published : 22 Mar 2022 01:36 IST

తాలిబన్ల ఆక్రమణతో దీన స్థితిలో అఫ్గాన్‌ పౌరులు

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాత్రం చివరకు కారు డ్రైవర్‌గా మారిన వైనం తెలియవచ్చింది. తాలిబన్ల ఆక్రమణకు ముందు అఫ్గాన్‌ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో వేలకోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఖలీద్‌ పయేందా.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అమెరికాలో క్యాబ్‌ డ్రైవర్‌గా అవతారమెత్తాడు. అమెరికాలోని ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక పయేందాను ఇంటర్వ్యూ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు ఉపసంహరించుకున్న తర్వాత అష్రాఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చిన తాలిబన్లు సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో తాలిబన్ల అరాచకాలను ముందుగానే అంచనా వేసిన వేలమంది ప్రజలు ముందుగానే దేశం విడిచి పారిపోయారు. దేశ అధ్యక్షుడు మొదలు వేల సంఖ్యలో సామాన్యులు అఫ్గాన్‌ను విడిచి సురక్షిత ప్రాంతాలకు శరణార్థులుగా తరలివెళ్లారు. ఇదే సమయంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ యూఏఈ పారిపోగా.. ఆయన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పయేందా కూడా తన పదవికి రాజీనామా చేశారు. దేశ ఆర్థికమంత్రిగా సేవలందించడం తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తానన్న ఆయన.. వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి పయేందా అమెరికా వెళ్లిపోయాడు.

ప్రజలకే ఆ సంకల్పం లేదు..

అమెరికా వెళ్లిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఖలీద్‌ పయేందా క్యాబ్‌ డ్రైవర్‌ అవతారమెత్తాడు. అఫ్గాన్‌ నుంచి అమెరికా ప్రయాణాన్ని వివరిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ వార్తా పత్రికకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. తనకు తోచిన విధంగా కుటుంబానికి అండగా నిలబడడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. అయితే, అఫ్గాన్‌ ప్రభుత్వ వైఫల్యంలో తాను కూడా ఓ భాగమేనన్న ఆయన.. ప్రభుత్వం పడిపోవడానికి అసలు కారణమేంటనే విషయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో సంక్షోభ పరిస్థితులకు ఒక రకంగా అమెరికా కూడా కారణమన్నారు. అయితే, ప్రభుత్వాన్ని పునరుద్ధరించుకోవాలనే సంకల్పం, తపన అఫ్గాన్‌ ప్రజలకే లేకపోవడం విచారకరమని ఖలీద్‌ పయేందా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ సమాజం మాత్రం వారి ప్రభుత్వాన్ని ఇప్పటికీ గుర్తించలేదు. విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. తాలిబన్ల పూర్తి ఆక్రమణ తర్వాత అఫ్గాన్‌కు అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోవడంతో ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి. విద్య, వైద్య సేవలు అందకపోవడంతో పాటు కనీసం ఒక్క పూట ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అఫ్గాన్‌ పౌరులు దీనస్థితిలో కాలం గడపాల్సి వస్తోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని