Queensland floods: క్వీన్స్‌లాండ్‌లో భారీ వరదలు.. నీటమునిగిన విమానాశ్రయం..!

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో వరదలు వచ్చాయి. జాస్పర్‌ తుపాను కారణంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రానున్న 24 గంటల్లో కూడా భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated : 18 Dec 2023 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో జాస్పర్‌ తుపాను కారణంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. 1977లో నమోదైన భారీ వరదల రికార్డును ఇవి దాటేసి ఉంటాయని క్వీన్స్‌లాండ్‌ ప్రీమియర్‌ జాన్‌ మైల్స్‌ పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో బ్లాక్‌ మౌంటైన్‌లో 625 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు తెలిపింది.

తుపాను మొదలైన నాటి నుంచి 20 చోట్ల మీటరుకు పైగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. డెయిన్‌ట్రీ నదీ పరీవాహక ప్రాంతంలో మొత్తం 820మి.మీల వర్షపాతం రికార్డైంది. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల 500మి.మీ వర్షం పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశం ఈ స్థాయి వర్షపాతం చవిచూడటం ఇదే తొలిసారి అని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా నదులు, కాల్వలు కట్టలు తెంచుకొన్నాయి. కెయిర్న్స్‌ ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఇక్కడ కొన్ని విమానాలు రెక్కల వరకు నీట మునిగాయి. కెయిర్న్స్‌ నగరంలో ఏకంగా 2 మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ భారీ వరదలు విరుచుకుపడ్డాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. వైద్యశాలలు కూడా నీట మునిగాయి. కెయిర్న్స్‌ నగరంలోకి మొసళ్లు కొట్టుకొచ్చాయి. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో దాదాపు 300 మందిని రక్షించారు.

కరాచీ ఆస్పత్రిలో దావూద్‌ ఇబ్రహీం.. విష ప్రయోగం అనుమానాలు?

పోర్ట్ డగ్లస్‌కు ఉత్తరాన ఉన్న వుజాల్‌వుజాల్‌ నగరం పూర్తిగా నీటిలో చిక్కుకుపోయింది. దీనికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వరదలకు ఎంత లేదన్నా బిలియన్‌ డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని