Dawood Ibrahim : కరాచీ ఆస్పత్రిలో దావూద్‌ ఇబ్రహీం.. విష ప్రయోగం అనుమానాలు?

దావూద్‌ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విషప్రయోగం జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Updated : 18 Dec 2023 10:54 IST

కరాచీ: పరారీలో ఉన్న అండర్‌వరల్డ్‌ డాన్‌, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim) తీవ్ర అనారోగ్యంతో కరాచీ (Karachi)లోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రెండు రోజుల క్రితమే అతడిని ఆస్పత్రిలో చేర్చారట.

మీడియా కథనాల ప్రకారం.. కరాచీలోని ఓ ఆస్పత్రిలో ఫ్లోర్‌ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్‌ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆ అంతస్తుకు అనుమతిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. వీటిపై దావూద్‌ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబయి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు.. అమెరికాలో కలకలం

మరోవైపు, పాకిస్థాన్‌ (Pakistan)లో ఆదివారం రాత్రి నుంచే ఇంటర్నెట్‌ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు కూడా డౌన్‌ అయినట్లు సమాచారం. ముఖ్యంగా కరాచీ, లాహోర్‌, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయినట్లు పాక్‌లోని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.

1993లో ముంబయిలో జరిగిన భీకర పేలుళ్ల తర్వాత దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌కు పారిపోయాడు. అయితే, అతడు తమ దేశంలోనే ఉన్నట్లు పాక్‌ ఇంతవరకూ అంగీకరించలేదు. కానీ, దావూద్‌ కరాచీలోనే ఉన్నాడని అతడి సోదరి హసీనా పార్కర్‌ కుమారుడు అలీషా పార్కర్‌ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేగాక, దావూద్‌ ముఠా కరాచీ ఎయిర్‌పోర్టును నియంత్రిస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. దావూద్‌ రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు సదరు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే దావూద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్‌ పేరు కరాచీ అడ్రసుతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు